ETV Bharat / international

జనాభాలో అగ్రస్థానం వైపు భారత్‌.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కేనా?

author img

By

Published : Jul 13, 2022, 7:25 AM IST

ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న కృషి ఫలించేలా ఉందని ఐరాసలో కీలక స్థానంలో ఉన్న అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా మరో ఏడాదిలోనే భారత్‌ నిలువనుందని ఐరాస నివేదిక నేపథ్యంలో ఇది మరింత బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

unsc permanent membership india
unsc permanent membership india

ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాత్రం చోటు లభించడం లేదు. ఇందుకు ఎన్నో ఏళ్లుగా కృషి జరుగుతున్నా.. కేవలం తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా మరో ఏడాదిలోనే (2023 నాటికి) భారత్‌ నిలువనుందని ఐరాస నివేదిక వెల్లడించింది. దీని ఫలితాలు ఎలా ఉన్నా.. తాజా పరిణామం మాత్రం భారత్‌కు కలిసి వచ్చేదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత బలాన్ని ఇస్తుందని ఐరాసలో కీలక స్థానంలో ఉన్న అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇటీవల అంచనాల ప్రకారం 142.6కోట్ల జనాభాతో చైనా ప్రపంచంలో తొలిస్థానంలో ఉండగా 141.2కోట్లతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. 2023నాటికి భారత్‌ జనాభా చైనాను దాటుతుందని ఐరాస అంచనా వేసింది. ఇలా ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవిస్తే భారత్‌కు ప్రయోజనమేంటని ప్రశ్నకు ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖలోని జనాభా విభాగాధిపతి జాన్‌ విల్మోత్‌ స్పందించారు. 'ఆయా దేశాల జనాభా పెరుగుదలలో మార్పులు పలు వాదనలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఐరాస విధులు, భద్రతా మండలిలో శాశ్వత దేశాల పాత్రపైనా చర్చకు కారణం కావచ్చు. ముఖ్యంగా జనాభాలో అతిపెద్ద దేశంగా అవతరిస్తే.. భద్రతా మండలిలో తమకు సభ్యత్వం కావాలని ఎంతోకాలంగా భారత్‌ చేస్తున్న డిమాండు మరింత బలపడవచ్చు. అందుకు తాజా పరిణామం మరింత బలాన్ని చేకూర్చవచ్చు' అని అభిప్రాయపడ్డారు.

ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటితోపాటు రెండేళ్ల కాలపరిమితితో మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఉంటుంది. అయితే, భద్రతా మండలిలో సంస్కరణలు జరగాలని రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. మారిన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మండలి విస్తరణ జరగాలనే డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ వైపు అడుగులు మాత్రం పడటం లేదు. ఈ క్రమంలో భారత్‌ వంటి దేశాలు శాశ్వత దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పొరుగు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోన్న భారత్.. జనాభాలోనూ అగ్రస్థానంలో నిలిస్తే ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలకు మరింత ఒత్తిడి పెంచే ఆస్కారం ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి:

శ్రీలంక విడిచి పారిపోయిన గొటబాయ.. ఆ దేశంలో స్వాగతం

ట్రంప్.. మీరు ఇక రిటైర్ కావడం ఉత్తమం: ఎలాన్ మస్క్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.