ETV Bharat / international

రూ.70 వేల కోట్ల నిధి తాలిబన్లకు దక్కనిది అందుకే..!

author img

By

Published : Aug 20, 2021, 9:49 AM IST

ద అఫ్గాన్‌ బ్యాంక్‌ (డీఏబీ) దాదాపు 10 బిలియన్ డాలర్లు విలువైన సంపదను అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ సహా వివిధ బ్యాంకుల్లో భద్రపర్చింది. ఈ సంపద మొత్తం నగదు రూపంలో లేదు. అతి తక్కువ మొత్తం మాత్రం క్యాష్‌ రూపంలో ఉంది. అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించాక అప్రమత్తమైన అమెరికా వీటిని ఫ్రీజ్ చేసింది. దీంతో వారు ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి నెలకొంది.

why-taliban-may-not-be-able-to-access-afghan-central-banks-10-billion-dollars-in-assets
రూ.70 వేల కోట్ల నిధి తాలిబన్లకు దక్కనిది అందుకే..!

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ ఉగ్రమూక ఒక్కసారిగా ఆర్థికంగా బలపడకుండా జాగ్రత్తలు తీసుకొంది. దీనికి తోడు అమెరికాలో ఉన్న దాదాపు రూ.70,500 కోట్లు విలువైన అఫ్గాన్‌ ఆస్తులను తాలిబన్ల అధీనంలోకి వెళ్లకుండా ఫ్రీజ్‌ చేసింది. దీంతో భవిష్యత్తులో అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి నెలకొంది.

అమెరికా వద్ద ఎంత సంపద ఉంది..!

ద అఫ్గాన్‌ బ్యాంక్‌ (డీఏబీ) దాదాపు 10 బిలియన్ డాలర్లు విలువైన సంపదను అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ సహా వివిధ బ్యాంకుల్లో భద్రపర్చింది. ఈ సంపద మొత్తం నగదు రూపంలో లేదు. అతి తక్కువ మొత్తం మాత్రం క్యాష్‌ రూపంలో ఉంది. ఈ విషయాన్ని డీఏబీ గవర్నర్‌ అజ్మల్‌ అహ్మదీ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం దేశం విడిచి పారిపోయారు.

అత్యధికంగా ఫెడరల్‌ రిజర్వులో ఏడు బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. అమెరికా బిల్స్‌ రూపంలో 3.1 బిలియన్లు, డబ్ల్యూబీ ఆర్‌ఏఎంపీ ఆస్తుల రూపంలో 2.4 బిలియన్లు, బంగారం రూపంలో 1.2 బిలియన్‌ డాలర్లు, కేవలం 0.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే నగదు రూపంలో ఉన్నాయి. ఇక మిగిలిన అంతర్జాతీయ ఖాతాల్లో 1.3 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్‌ వద్ద 0.7 బిలియన్‌ డాలర్లు పడిఉన్నాయి.

డాలర్ల సరఫరా నిలిపివేసిన అమెరికా..

అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి దిగజారుతుండటాన్ని గమనించిన అమెరికా డాలర్ల సరఫరాను కొన్ని వారాల ముందే నిలిపివేసిందని అహ్మదీ వెల్లడించారు. వాస్తవానికి ఇక్కడికి ప్రతివారం అవసరాల కోసం అమెరికా నగదును భౌతిక రూపంలో పంపిస్తుంది. అమెరికాతో పాటు పలు దేశాలు కూడా డాలర్లను అఫ్గానిస్థాన్‌కు ఇవ్వడం ఆపేశాయి. ఈ క్రమంలో అమెరికా ట్రజరీ సెక్రటరీ జానెట్‌ ఎల్‌ అలెన్‌ అఫ్గాన్‌ రిజర్వులను ఫ్రీజ్‌ చేశారు. అఫ్గానిస్థాన్లో డాలర్ల చెల్లుబాటు చాలా ఎక్కువ. ప్రస్తుతం అక్కడ డాలర్లు అతి తక్కువ మాత్రమే ఉన్నాయి.

ఎస్డీఆర్‌ నిధులు ఆపేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి..!

అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ద్రవ్యనిధి 440 మిలియన్‌ డాలర్ల మానిటరీ నిధిని అఫ్గాన్‌కు అందించడం నిలిపివేసింది. అమెరికా ట్రజరీ నుంచి ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ‘‘అంతర్జాతీయ సమాజం గుర్తింపు విషయంలో స్ఫష్టత లేకపోవడంతో కొత్త అఫ్గాన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి వనరులను వాడుకోలేదు’’ అని ఐఎంఎఫ్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబన్లు ఇంకా అంతర్జాతీయ ఆంక్షల జాబితాలో ఉండటంతో వీరు ఇటువంటి నిధులను అందుకోలేరని డీఏబీ గవర్నర్‌ అహ్మదీ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌కు ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఆస్తుల్లో అత్యధికంగా 0.2శాతం మాత్రమే తాలిబన్ల చేతిలో పడే అవకాశం ఉందని ఆయన వివరించారు.

అధ్యక్ష భవనంలోని సొమ్ము.. వెండి నాణేలే దిక్కు..!

అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆస్తులను విదేశీ బ్యాంకుల్లో భద్రపరుస్తాయి. ది ఫెడరల్‌ రిజర్వు ఆఫ్‌ న్యూయార్క్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వంటి వాటిని ఎంచుకొంటాయి. ఇక్కడి నిధుల విడుదల విషయంలో కఠినమైన అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తారు. దీంతో ఇప్పుడు అఫ్గాన్‌కు విదేశాల్లో ఆస్తులను తాలిబన్లు దక్కించుకోలేరు. దీంతో మహా అయితే వారి చేతికి 362 మిలియన్‌ డాలర్లు మాత్రమే దక్కే అవకాశం ఉంది. వీటిల్లో అఫ్గానిస్థాన్‌లో ఉన్న బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, అధ్యక్ష భవనంలో భద్రపర్చిన డాలర్లు ఉంటాయి. దీంతోపాటు అధ్యక్ష భవనంలోని 160 మిలియన్‌ డాలర్లు విలువైన బంగారు, వెండి నాణేలు వారికి దక్కుతాయి.

డాలర్లు ఇవ్వంది ఎందుకు..?

అమెరికన్‌ డాలర్లు అంతర్జాతీయంగా అత్యధిక డిమాండ్‌ ఉన్న కరెన్సీ. ఇది పెద్దమొత్తంలో తాలిబన్ల వంటి ఛాందసవాదుల చేతుల్లో పడితే వారు దాని అక్రమ ఆయుధాల కొనుగోళ్లకు, ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి, దాడులు చేయడానికి వినియోగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయుధాలు అక్కడే వదిలేసిన అమెరికా.. డాలర్లను కూడా ఇస్తే అంతిమంగా అంతర్జాతీయ శాంతికి ముప్పుగా మారుతుంది.

తాలిబన్లతో ఆర్థిక వ్యవస్థకే ఎసరు..

తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్‌ ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. అమెరికా ట్రెజరీ అనుమతి లేనిదే మిత్ర దేశాలు కూడా తాలిబన్లకు డాలర్లను ఇవ్వలేవు. కనీసం సాయం కూడా అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే స్థానిక బ్యాంకులు కస్టమర్లకు నగదును డాలర్ల రూపంలో ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. తమకు డీబీఏ నుంచి డాలర్ల సరఫరా ఆగిపోయిందని అవి చెబుతున్నాయి. తాలిబన్లు పౌర ప్రభుత్వంపై విజయం సాధించారు.. ఇప్పుడు పాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది అంత తేలికకాదు.. డాలర్ల వినియోగాన్ని తాలిబన్లు గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడు అఫ్గాన్‌ అఫ్గానీ (అఫ్గాన్‌ కరెన్సీ) విలువ దారుణంగా పడిపోయి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. తాలిబన్లకు పాలన నల్లేరుపై బండి నడకలా ఉండబోదని ఈ పరిణామాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: Afghanistan Hero: ఆయనంటే తాలిబన్ల వెన్నులో వణుకు..!

అఫ్గాన్​లో స్వేచ్ఛకు సంకెళ్లు.. మహిళల మెడపై 'షరియా' కత్తి

Taliban news: తాలిబన్లపై అఫ్గాన్​ ప్రజల తిరుగుబాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.