పిల్లుల్లో కరోనా యాంటీబాడీలు- సర్వేలో షాకింగ్​ నిజాలు

author img

By

Published : Sep 10, 2020, 3:00 PM IST

More cats may have COVID-19 than believed: Study

కరోనా ఇన్నాళ్లూ మనుషులపైనే తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు పిల్లులపైనా ఈ రక్కసి కోరలు చాచిందట. ఇప్పటివరకు అంచనా వేసిన వాటికంటే ఎక్కువ సంఖ్యలో పిల్లుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. అయితే వైరస్​ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండడం వల్ల అవి మరణించట్లేదని పరిశోధకులు తెలిపారు.

పెంపుడు జంతువుల్లో ఒకటైన పిల్లులపైనా కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వీటిల్లో కొవిడ్​ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. చైనా వుహాన్​లో కరోనాను గుర్తించిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలోని పిల్లులపై సర్వే చేసింది హౌజాంగ్​ వ్యవసాయ విద్యాలయం.

యాంటీబాడీలతో తప్పిన ముప్పు..

జనవరి నుంచి మార్చి మధ్యలో దాదాపు 102 పిల్లులపై పరిశోధన చేశారు. వాటి రక్తం సహా నోటి, మూత్ర నమూనాలను తీసుకున్నారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ప్రముఖ జర్నల్​ ఎమర్జింగ్​ మైక్రోబ్స్​ అండ్​ ఇన్​ఫెక్షన్స్​లో ప్రచురించారు. వీటిల్లో 15 పిల్లుల్లో కొవిడ్​ యాంటీబాడీలు ఉన్నట్లు పరిశీలకులు గుర్తించారు. వాటిలో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీన్​ కరోనా​ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

పిల్లుల్లో కొవిడ్​ ఇన్​ఫెక్షన్​ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాధారణంగానే ఉత్పత్తయిన యాంటీబాడీలు మహమ్మారితో పోరాడుతున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. ఏ పిల్లీ కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాలేదని.. కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ అవి చనిపోవట్లేదని స్పష్టం చేశారు.

మనుషుల వల్లే...!

పరిశోధన కోసం 46 పిల్లులను ప్రత్యేక జంతు షెల్టర్ల నుంచి, మరో 41 పిల్లులను ఆసుపత్రులు, 15 పిల్లులను కరోనా బారిన పడిన వ్యక్తుల ఇళ్ల నుంచి సేకరించినట్లు పరిశోధకులు తెలిపారు. కరోనా సోకిన యజమానులకు చెందిన 3 పిల్లుల్లో.. అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు కనిపించాయని తెలిపారు పరిశోధకుడు మైలిన్​ జిన్​.

"కరోనాతో కలుషితమైన వాతావరణంలో తిరిగే పిల్లులు, కరోనా బాధితులు పెంచకుంటున్న పిల్లులకు వైరస్​ వచ్చే అవకాశం ఉంది. అయితే వీధి పిల్లుల విషయంలో ఇంకా స్పష్టతమైన అవగాహనకు రావాల్సి ఉంది. ఈ అంశాల ఆధారంగా చూస్తే కరోనా వచ్చిన వాళ్లు.. పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం, క్వారంటైన్​ నిబంధలను పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఈ జంతువులకు ముప్పు తప్పుతుంది."

-- మైలిన్​ జిన్​, పరిశోధన బృందం నాయకుడు

పిల్లుల నుంచి మనుషులకు వైరస్​ సోకినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు మైలిన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.