ETV Bharat / international

'పాక్‌ ఉగ్రవాదుల అడ్డా.. దాని సలహాలేం మాకు అక్కర్లేదు'

author img

By

Published : Oct 6, 2021, 7:48 AM IST

ఐరాసలో సమావేశాల్లో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాక్​కు భారత్ దీటుగా బదులిచ్చింది. ఒసామా బిన్ లాడెన్ వంటి అంతర్జాతీయ తీవ్రవాదులను అమరవీరులుగా కీర్తించే ఆ దేశ సలహాలు భారత్​కు అవసరం లేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అమర్‌నాథ్ స్పష్టం చేశారు. పాక్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని మండిపడ్డారు.

amarnath
అమర్​నాథ్

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్దిచెప్పింది. ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదానికి స్వర్గధామంలా ఉన్న దేశం నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశించలేమని విమర్శించింది. అస్థిరతను పెంచి పోషించడంలో ప్రపంచంలోనే పాకిస్థాన్‌ను మించిన శక్తి లేదని మండిపడింది. ఐక్య రాజ్యసమితిలో సాధారణ అసెంబ్లీ తొలి కమిటీ సమావేశంలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన చర్చలో భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌ ఎ.అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌ అంశాన్ని యూఎన్‌లో పాక్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ లేవనెత్తగా.. అమర్‌నాథ్‌ పాకిస్థాన్‌ వైఖరిని అంతర్జాతీయ వేదికపై తీవ్రంగా ఎండగట్టారు.

అణ్వస్త్ర సామగ్రి, సాంకేతికతను అక్రమంగా ఎగుమతిచేసిన చరిత్ర కలిగిన పాకిస్థాన్‌నుంచి నుంచి సలహా తీసుకొనే అవసరం భారత్‌కు లేదన్నారు. అసత్యాలు, అర్ధసత్యాలతో అంతర్జాతీయ వేదికల పవిత్రతను దెబ్బతీసేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. భారత్‌పై పాకిస్థాన్‌ అనేక పనికిరాని, నిరాధార ఆరోపణలు చేస్తోందని, జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లకు సంబంధించి కూడా అవాకులు పేలుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని పునరుద్ఘాటించారు. భారత్‌తో కశ్మీర్‌ ఎప్పటికీ విడదీయరాని భాగమని తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌ ఆక్రమించిన ప్రాంతాలూ ఇందులో కొన్ని ఉన్నాయని, అక్రమంగా దురాక్రమణకు పాల్పడిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాక్‌కు హితవు పలికారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.