ETV Bharat / international

అఫ్గానీలకు అండగా నిలబడతాం: భారత్‌

author img

By

Published : Sep 14, 2021, 5:44 AM IST

గతంలో మాదిరిగానే అఫ్గానిస్థాన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారత్‌ ఉద్ఘాటించింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి బాసటగా నిలవాలని అంతర్జాతీయ సమాజానికీ పిలుపునిచ్చింది. మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు పాటుపడతామని తెలిపింది.

india
india

అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించారు. 'భారతదేశానికి అఫ్గాన్ ప్రజలతో చారిత్రక స్నేహం ఉంది. భవిష్యత్తులోనూ అది అలాగే కొనసాగుతుంది. ఇదే భారత్ విధానం' అని జైశంకర్ ఉద్ఘాటించారు. అఫ్గాన్ సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు.

"నేడు తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అఫ్గాన్ ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ గతంలో మాదిరే సిద్ధంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం సహకారం అవసరమని నమ్ముతున్నాం. ఎలాంటి అవరోధం లేకుండా అఫ్గాన్​లోకి ప్రవేశించగలగాలి."

-ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి

అఫ్గానిస్థాన్‌ ప్రస్తుతం సవాళ్లతో కూడుకున్న, సంక్లిష్ట దశలో ఉందన్నారు. దాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అఫ్గాన్‌లో పేదరికం మరింత కోరలు చాచే ముప్పుందని.. అదే జరిగితే ప్రాంతీయ స్థిరత్వం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. అఫ్గాన్‌తో భారత్‌కు అనాదిగా స్నేహం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులు చాలా మారినప్పటికీ.. ఆ దేశ ప్రజలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.