ETV Bharat / entertainment

'సరైన కథలు దొరికితే.. సత్తా చూపిస్తాం'

author img

By

Published : Oct 27, 2022, 7:06 AM IST

ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుంటున్నా అంటోంది ఓ హీరోయిన్​. ఇప్పటి దాకా కమర్షియల్‌ చిత్రాలే చేశా.. ఇకపై నటిగా సవాల్‌ విసిరే పాత్రలతోనే ప్రయాణించాలనుకుంటున్నా అని చెబుతోంది మరో భామ. అవకాశాలు దక్కినా.. అనుకోని కారణాల వల్ల సినిమాలు ఆగి డైరీ ఖాళీ అయినవాళ్లు కొందరు. ఇప్పుడీ భామలంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. సరైన కథలు దొరికితే సై అనేందుకు సిద్ధంగా ఉన్నారు. వారెవరో ఓ సారి తెలుసుకుందాం.

pooja hegde movies
పూజా హెగ్డే సినిమాలు

"కళ శాశ్వతం. అందుకే చేస్తే ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుంటున్నా" అంటుంది ఓ అందం. "ఇప్పటి దాకా కమర్షియల్‌ చిత్రాలే చేశా.. ఇకపై నటిగా సవాల్‌ విసిరే పాత్రలతోనే ప్రయాణించాలనుకుంటున్నా" అంటుంది మరో సోయగం. వీరికి పూర్తి భిన్నమైన నాయికలూ ఉన్నారు. అవకాశాలు దక్కినా.. అనుకోని కారణాల వల్ల సినిమాలు ఆగి డైరీ ఖాళీ అయినవాళ్లు కొందరు. ఇప్పుడీ భామలంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. సరైన కథలు దొరికితే సై అంటూ జోరు చూపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది

.

పూజా హెగ్డేకు ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. కొన్నాళ్ల క్రితం వరకు వరుస విజయాలతో జోరు చూపిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా వరుస పరాజయాలు అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన 'రాధేశ్యామ్‌', 'బీస్ట్‌', 'ఆచార్య' పూజాకు చేదు ఫలితాల్ని అందించాయి. దీనికి తోడు కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమాల విషయంలో ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాథ్‌ కలయికలో మొదలైన 'జనగణమన' అర్ధంతరంగా ఆగిపోగా.. పవన్‌ - హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో చేయాల్సిన 'భవదీయుడు భగత్‌సింగ్‌' ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది తేలడం లేదు. ఇప్పుడామె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్‌.. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందుతోన్నచిత్రమే. ఇదీ కొత్తగా ఒప్పుకున్నదేమీ కాదు. ఏడాది కిత్రం ఖరారైన చిత్రమే. అందుకే ఇది పూర్తయ్యేలోపు మరో మంచి కథ వెతికి పట్టుకోవాలని ఎదురు చూస్తోంది పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం హిందీలో 'సర్కస్‌', 'కిసీ కా భాయ్‌.. కిసీ కి జాన్‌' చిత్రాల్లో నటిస్తోంది.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో 'పక్కా కమర్షియల్‌', 'థ్యాంక్‌ యూ', 'తిరు" చిత్రాలతో వరుస పరాజయాలు అందుకొంది రాశీ ఖన్నా. అయితే ఇటీవల వచ్చిన 'సర్దార్‌'తో ఈ ఫ్లాప్‌ల పరంపరకు చెక్‌ పెట్టింది ఆమె. కొన్నాళ్లుగా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్న ఆమె.. శర్వానంద్‌ - కృష్ణచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. కొన్ని నెలల క్రితమే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు మరో కథను వెతికి పట్టుకోవడం రాశీకి అనివార్యంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'యోధ' అనే హిందీ చిత్రంతో పాటు 'ఫర్జీ' అనే వెబ్‌సిరీస్‌ ఉంది. ఈ రెండూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఆలస్యమైనా ఫర్వాలేదు

.

'స్టార్‌ నాయిక' అనే స్థాయిని ఎప్పుడో అధిగమించింది సాయిపల్లవి. 'కథ మొత్తాన్ని తన భుజాలపై మోయగల నటి' అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకుంది. కెరీర్‌ ఆరంభం నుంచి ఆమె ఇలాంటి కథలతోనే ప్రయాణం చేస్తూ వచ్చింది. అయితే అలాంటి కథలు అన్నిసార్లూ అందుబాటులో ఉండవు. తనలోని నటిని తట్టిలేపే కథల కోసం.. సవాల్‌ విసిరే పాత్రల కోసం నెలలకు నెలలు ఎదురు చూడాల్సి రావొచ్చు. ప్రస్తుతం సాయిపల్లవి సినీ డైరీని గమనిస్తే.. ఆమె ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది 'విరాటపర్వం', 'గార్గి' చిత్రాలతో మురిపించిన ఈ అమ్మడు.. ఇప్పటి వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. ఆలస్యమైనా తన స్థాయికి తగ్గ కథతోనే తెరపైకి రావాలని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపింది.

కమర్షియల్‌ చిత్రాల్లో కనిపించినా.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే అలరించే ప్రయత్నం చేస్తుంటుంది నటి నివేదా థామస్‌. కెరీర్‌ ఆరంభం నుంచి ఆమెది ఇదే పంథా. అయితే ఇప్పుడీ భామ నాయికా ప్రాధాన్య చిత్రాల వైపు దృష్టి సారించింది. ఇటీవలే 'శాకిని డాకిని'తో అదృష్టం పరీక్షించుకున్న ఈ అమ్మడు.. చేదు ఫలితాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు మరో కొత్త కథతో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఇందుకు తగ్గ కథల్ని వెతికి పట్టుకోవడంలోనే బిజీగా ఉంది నివేద. మలయాళంలో 'ఎంతాడ సాజి' అనే ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపింది.

ఇవీ చదవండి: పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్​.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరిస్తున్నారని

'కాంతారా' కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సినిమా తెలుసా?.. త్వరలోనే తెలుగులో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.