'నాటు నాటు'కు ఆస్కార్​.. ఇప్పటివరకు ఈ అవార్డును​ గెలుచుకున్న ఇండియన్స్​ ఎవరంటే?

author img

By

Published : Mar 13, 2023, 8:50 AM IST

oscars awards 2023

Oscars 2023 : ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది తెలుగు చిత్రంలోని 'నాటనాటు' సాంగ్​. ఈ నేపథ్యంలో గతంలో ఏయే భారతీయ చిత్రాలు ఏయే విభాగాల్లో ఆస్కార్‌లను సొంతం చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

Oscars 2023: ప్రపంచ చలన చిత్రరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును మన తెలుగు పాట.. నాటునాటు సొంతం చేసుకుంది. భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన ఈ క్షణం సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించింది. ఈ నేపథ్యంలో గతంలో ఏయే భారతీయ చిత్రాలు ఏయే విభాగాల్లో ఆస్కార్‌లను వశం చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

భారత తొలి ఆస్కార్‌ విజేతగా భాను అథైయా చరిత్ర పుటల్లో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె ఆ పురస్కారం స్వీకరించారు. 1982లో విడుదలైన 'గాంధీ' సినిమాకి గానూ బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగంలో ఆ ప్రతిష్టాత్మక అవార్డును ఆమె అందుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆంగ్ల చిత్రమది. దర్శకుడు సహా ఎక్కువమంది ఇంగ్లాండ్‌ వారు ఈ సినిమాకి పని చేశారు. భానుతోపాటు కొందరు భారతీయులు ఆ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్‌ మొల్లో, భాను అథైయా సంయుక్తంగా గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా వ్యవహరించి ఆస్కార్‌ పొందారు.

భారత చలనచిత్ర జగత్తు దశను, దిశను మార్చిన దర్శక దిగ్గజం సత్యజిత్‌ రే. 'పథేర్‌ పాంచాలి', 'అపరాజితో', 'పరశ్‌ పాథర్‌', 'కాంచన్‌జంగా', 'చారులత'సహా 36 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. స్కీన్ర్‌ ప్లే రచయిత, కథారచయిత, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళా దర్శకుడు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఆయన నిష్ణాతులు. సినీ రంగానికి సత్యజిత్‌ రే చేసిన విశేష సేవలను గుర్తించిన 'అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్' 1992లో ఆయనకు గౌరవ పురస్కారంను ప్రకటించింది. అనారోగ్య కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోయిన సత్యజిత్‌రేకు ఆయన చికిత్స పొందిన కోల్‌కతాలోని ఆస్పత్రిలోనే ఆస్కార్‌ను అకాడమీ అందించింది. ఈ గౌరవ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఆయనే.

1992 తర్వాత భారతీయులు ఆస్కార్‌ను అందుకోవడానికి దాదాపు 17 ఏళ్లు పట్టింది. 2009లో జరిగిన 81వ ఆస్కార్‌ వేడుక ఆ లోటును భర్తీ చేసింది. ఒకట్రెండు కాదు ఏకంగా మూడు ఆస్కార్‌ అవార్డులను ముగ్గురు భారతీయులు అందుకున్నారు. అది కూడా ఒకే సినిమాకి! అదే 'స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌'. ఈ చిత్రానికిగానూ 'బెస్ట్‌ సౌండింగ్‌ మిక్సింగ్‌' కేటగిరీలో కేరళకు చెందిన రసూల్‌.. రిచర్డ్‌ ప్రైక్‌, ఇయాన్‌ ట్యాప్‌తో కలిసి ఆస్కార్‌ పురస్కారం స్వీకరించారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' చిత్రంలో 'జయహో' పాటకుగాను గేయ రచయిత గుల్జార్‌. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌కు ఆస్కార్‌ దక్కింది. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలోనూ రెహమానే ఆస్కారు అందుకున్నారు. తద్వారా రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా రెహమాన్‌ రికార్డు సృష్టించారు. దిల్లీకి చెందిన నిర్మాత గునీత్‌ మోన్గా నిర్మించిన 'పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ ఏ సెంటెన్స్‌' ఉత్తమ డాక్యుమెంటరీగా 2019లో ఆస్కార్‌ గెలుచుకుంది.

ఇవీ చదవండి : ఆస్కార్‌ రేసు.. ఇప్పటివరకు నామినేట్‌ అయిన భారతీయ చిత్రాలివే..

OTT సబ్‌స్క్రిప్షన్‌ లేదా?.. అయితే ఈ ఛానెళ్లలో ఆస్కార్ ఈవెంట్‌ను చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.