'రచయితకు ప్రతి పాట సవాలే.. ఆ రెండు సాంగ్​లు విని బాలయ్య, చిరు ఎంతో మెచ్చుకున్నారు'

author img

By

Published : Jan 5, 2023, 8:00 AM IST

lyricist  rama jogayya sastry latest interview

'ఖలేజా', 'నేను శైలజ', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలకు హిట్​ సాంగ్స్​ అందించిన లిరిసిస్ట్​ రామ జోగయ్య శాస్త్రి ఈ ఏడాది సంక్రాంతికి దిగనున్న 'వాల్తేర్​ వీరయ్య', 'వీర సింహా రెడ్డి' లోని పాటలను తన రచనలతో ప్రాణం పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని ముచ్చట్లు ఇవిగో..

"ఇక్కడందరూ సమర్థులే. మాలో సమర్థతని వెలికితీసే కాన్వాస్‌ దొరికినప్పుడే 'ఇదిగో ఇది చేశాం' అని మేం చెప్పుకోవడానికి.. ప్రపంచం గుర్తించడానికీ వీలవుతుంది. ఇప్పుడున్న కమర్షియల్‌ లెక్కల్లో అలాంటి సందర్భాలు మాకు తక్కువగానే వస్తున్నాయి" అన్నారు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. 1200కిపైగా పాటలు రాసిన ఆయన.. ఈ సంక్రాంతికొస్తున్న 'వీరసింహారెడ్డి', 'వాల్తేర్‌ వీరయ్య', 'వారసుడు' చిత్రాలకి పాటలు రాశారు. 'వీరసింహారెడ్డి', 'వారసుడు' పాటలన్నీ ఆయనే రాయగా, 'వాల్తేరు వీరయ్య'లో ఓ పాట రాశారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు రామజోగయ్య శాస్త్రి.

"సంక్రాంతి సినిమాలకి పాటలు రాయడం అలా కుదిరిందంతే. మనం అనుకుంటే జరగదు. సినిమాలో పాటలన్నీ నేనే రాసినా, లేదంటే ఒక్క పాటే రాసినా దర్శకుడి కల..అతని విజన్‌కి తగ్గట్టు అడుగులు వేయడమే ముఖ్యం. అతని పరిధికి తగ్గట్టుగా నేనెంత గొప్పగా రాస్తాననేది నాకు సంబంధించిన విషయం. కాకపోతే పాటలన్నీ ఒక్కరే రాయడంలో ఓ సౌలభ్యం ఉంటుంది. పూర్తిగా కథ చెబుతారు. ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భాలున్నాయి? ఏ మాట వాడాం అనేది ఓ స్పష్టత ఉంటుంది. దానికి తగ్గట్టుగా సమన్వయంతో ఆరు పాటలు పక్కాగా రాసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకొక్కరూ ఒక్కో పాట రాస్తే ఆ సమన్వయాన్ని దర్శకుడు చూసుకోవల్సి ఉంటుంది".

  • "మూడు చిత్రాల్లో రాసిన పాటలు ఏ పాటకి ఆ పాటే అన్నట్టుగా ఉంటుంది. 'అఖండ' సినిమాకి రాసే అవకాశం నాకు దక్కలేదు. గోపీచంద్‌ మలినేని 'క్రాక్‌' సినిమాలోనూ ఓ పాట మిస్‌ అయ్యింది. లోపలున్న ఆ పట్టుదలతోనే ఈసారి 'వీరసింహారెడ్డి' పాటలపై చూపించా. ఇప్పటికే విడుదలైన మూడు పాటలూ ఆదరణ పొందాయి. 'వాల్తేరు వీరయ్య' కోసం 'నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువ' అని పాట రాశా. ఈ లిరిక్స్‌లో సౌండింగ్‌ సరదాగా అనిపించింది. దేవిశ్రీప్రసాద్‌తో చెప్పగానే, దాని చుట్టూ ఓ కాన్సెప్ట్‌ అనుకుని ట్యూన్‌ ఇచ్చారు. అద్భుతంగా వచ్చింది. రచయితగా ప్రతి పాట ఓ సవాలే. చిరంజీవి పాట విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనోభావాలు.. పాట చిత్రీకరణ సమయంలో నేను సెట్లోనే ఉన్నా. ఆ పాట విని బాలకృష్ణ కూడా అభినందించారు".
  • "పెద్దలు వేటూరి, సిరివెన్నెలని ముందు పెట్టుకుని చూస్తే నాలుగు అడుగులు వేయాలనుకున్న మేం ఆరడుగులు వేస్తాం. వాళ్ల తర్వాత ఎవరు అనే లెక్కల జోలికే వెళ్లకూడదు. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. సరైన కాన్వాస్‌, సరైన సందర్భం వచ్చినప్పుడే మా ప్రతిభ బయటికొస్తుంది. అలా అని అది కావాలి, ఇది కావాలని చెప్పడం కాదు. అలాంటి గొప్ప పనులు ఎన్ని చేస్తున్నాం అనేదే నా ప్రశ్న".
  • "యువతరం చాలా మంది రచనవైపు వస్తున్నారు. ఇంట్లో కూర్చుని గడ్డివాము, మామిడితోట మీద ఓ పాట రాసి నేనూ రాస్తాననుకోవడం కాదు. దర్శకుడికి ఓ విజన్‌ ఉంటుంది. అతను బయటికి చెప్పలేడు. చెప్పగలిగితే అతనే రాసుకుంటాడు. అతని మనసులో ఉన్నది గ్రహించి, వాళ్ల విజన్‌ని బేరీజు వేసుకుని మన ఊహకు అందిన మేరకు రాస్తే అది అవునో కాదో చెబుతాడు. కాదంటే దానికి మరో ప్రత్యామ్నాయం మన దగ్గర ఉండాలి. మనకు మనమే ప్రశ్న వేసుకుని, ఒకటికి నాలుగు పదాలు పుట్టించే ఓర్పు, పట్టుదల ఉండాలి. ఆలోచన, భావన ఎంత గొప్పగా ఉన్నా, వ్యక్తీకరణ సులభంగా ఉండాలి. అదే టెక్నిక్‌. మనకు ఆ లక్షణం ఉందా? లేదా అనేది చూసుకోవాలి".
  • ఇదీ చదవండి:
  • 'అవతార్​-3' కథ చెప్పేసిన జేమ్స్​ కామెరూన్​​.. ఈ సారి ఎలా ఉండబోతుందంటే?
  • సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య.. ఎన్ని సార్లంటే?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.