ETV Bharat / entertainment

హీరోయిన్స్ అందం.. విజయానందం.. హిట్టు కొట్టి.. కెరీర్​లో నిలదొక్కుకొని..

author img

By

Published : Dec 15, 2022, 7:32 AM IST

చిత్రసీమకి కొన్నిసార్లు విజయాలే ప్రామాణికం. ప్రతిభ ఎంతున్నా సరే వెనక విజయం ఉందా లేదా అన్నదే కీలకం. ఒక మంచి విజయం  దక్కిందంటే చాలు అవకాశాలు వెల్లువెత్తుతాయి. అదే ఒక్క పరాజయం ఎదురైనా ప్రయాణం వెంటనే ఒడుదుడుకులకి లోనవుతుంది. కథానాయికల విషయంలో ఇది మరింత వేగంగా పక్కాగా అమలయ్యే విషయం. ఎప్పుడూ జోరు మీద కనిపించే స్టార్‌ భామలకి అప్పుడప్పుడూ ఒకట్రెండు పరాజయాలు ఎదురైనా ఆ ప్రభావం పెద్దగా కనిపించదేమో కానీ ద్వితీయ శ్రేణి కథానాయికలకి మాత్రం అది ఎదురు దెబ్బే. వాళ్ల అవకాశాలు గల్లంతవుతాయి,  పారితోషికాలు తగ్గుతాయి. అందుకే వీళ్లు మిగతా భామలకంటే కూడా ఆచితూచి అడుగులేస్తుంటారు. అయినా సరే పలువురు నాయికల కెరీర్‌ 'ఈసారి విజయం తప్పనిసరి' అనే స్థితిలోకి వెళ్లింది. అలాంటి వాళ్లలో ఎంతమంది విజయాల్ని అందుకున్నారు? ఎంతమంది కెరీర్‌ని నిలబెట్టుకున్నారు?

cinema news heroines latest movie updates
అనుపమ పరమేశ్వరన్‌, మీనాక్షి దీక్షిత్‌, అను ఇమ్మానుయేల్

ఈసారి స్టార్‌ కథానాయికల కంటే ద్వితీయ శ్రేణి కథానాయికలకి అవకాశాలు ఎక్కువగా లభించాయి. వాటిని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో చాలా వరకు విజయవంతం అయ్యారు. అనుపమ పరమేశ్వరన్‌ ఈ ఏడాది ఆరంభంలో 'రౌడీబాయ్స్‌'చిత్రంతో సందడి చేసింది. ఆమె 2020, 21లో తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 'రౌడీబాయ్స్‌'తో ఆమె చేసిన సందడి ఆకట్టుకుంది. విజయం మాత్రం 'కార్తికేయ2'తో దక్కింది. త్వరలో '18పేజీస్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'టక్‌ జగదీష్‌', 'వరుడు కావలెను' చిత్రాలతో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన రీతూవర్మ ఈసారి 'ఒకే ఒక జీవితం'తో విజయం రుచి చూసింది. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల్ని అంది పుచ్చుకుంటున్న కేథరిన్‌ ఈసారి మూడు చిత్రాలతో సందడి చేసింది. 'మాచర్ల నియోజకవర్గం', 'భళా తందనాన' చిత్రాలతో సరైన ఫలితం అందకపోయినా, 'బింబిసార'తో విజయం నమోదు చేసింది.

cinema news heroines latest movie updates
కేథరిన్‌, నేహారెడ్డి

ఊరించి ఊరించి..
పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌ తదితర అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడిన అను ఇమ్మానుయేల్‌కి విజయం మాత్రం ఎప్పట్నుంచో ఊరిస్తూ వచ్చింది. ఈసారి ఆమె 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంతో మంచి ఫలితాన్ని అందుకుంది. బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా సాధించిన వసూళ్లు అంతంతమాత్రమే అయినా అను ఇమ్మానుయేల్‌ నటనకి మాత్రం మంచి పేరొచ్చింది. మీనాక్షి దీక్షిత్‌ 'ఖిలాడి'తో రవితేజకి జోడీ కట్టగానే అందరి దృష్టి ఆమెపైనే పడింది. కానీ ఆ చిత్రం సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితేనేం 'హిట్‌ 2'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె విజయాన్ని అందుకుని కెరీర్‌ని నిలబెట్టుకుంది. అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ పరిచయం చేసిన నేహాశెట్టి ఎట్టకేలకి 'డిజె టిల్లు'తో విజయం అందుకుంది. రాజ్‌తరుణ్‌తో కలిసి చేసిన 'స్టాండప్‌ రాహుల్‌' సినిమాతో విజయం దక్కకపోయినా, 'స్వాతిముత్యం'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది వర్ష బొల్లమ్మ. 'అశోకవనంలో అర్జునకళ్యాణం' సినిమాతో రుక్సర్‌ థిల్లాన్‌ కూడా దాదాపు ఫామ్‌ అందుకున్నట్టే.

cinema news heroines latest movie updates
రీతూవర్మ, వర్ష బొల్లమ్మ

ఫలితం రాలేదు
ఒకప్పుడు విజయాల్ని రుచి చూసినా అందం అభినయంతో పరిశ్రమని ప్రభావితం చేసినా కొద్దిమంది కథానాయికలు ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. వాళ్లకి ఈ ఏడాది కూడా అంతగా కలిసిరాలేదు. రెజీనా, నివేదా థామస్‌ కలిసి 'శాకిని ఢాకిని'అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ అది బాక్సాఫీసుపై అంతగా ప్రభావం చూపించలేదు. రెజీనా 'ఆచార్య'లో ప్రత్యేక గీతం చేసినా ఆమెకి వచ్చిన గుర్తింపు అంతంతమాత్రమే. 'జాతిరత్నాలు'తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న ఫరియా అబ్దుల్లా 'బంగార్రాజు'లో ప్రత్యేకగీతం చేసి అలరించినా కథానాయికగా మాత్రం 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌' సినిమాతో పరాజయాన్ని చవిచూసింది. 'థ్యాంక్‌ యూ', 'టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా అవికాగోర్‌కి విజయం మాత్రం దక్కలేదు. పాయల్‌ రాజ్‌పూత్‌ 'తీస్‌మార్‌ ఖాన్‌', 'జిన్నా' సినిమాలు చేసింది. ఫలితం మాత్రం దక్కలేదు. 'ఓదెల రైల్వేస్టేషన్‌' సినిమాతో వచ్చిన హెబ్బా పటేల్‌ అందం కూడా అంతగా ఆకర్షించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.