ETV Bharat / entertainment

నందమూరి హీరోల జోష్.. ఆ సెంటిమెంట్​తో గ్రాండ్​ సక్సెస్​

author img

By

Published : Aug 7, 2022, 3:17 PM IST

జీవితంలో మనం అనుకున్నట్లు అన్నీ జరగవు. కానీ పలు సందర్భాల్లో మాత్రం యాధృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి జరిగినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం అది చర్చనీయాంశమైంది. అదేంటంటే..

Nandamuri heroes Baby centiment
నందమూరి హీరోల పాప సెంటిమెంట్​

Nandamuri heroes కరోనా, నిర్మాణ వ్యయాలు, టికెట్ ధరలు, ఓటీటీలో సినిమాల విడుదల, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం.. ఇలా పలు రకాల సమస్యల వల్ల చిత్రసీమ కుదేలైంది. ఈ కారణాలతో పలువురు హీరోలు విజయాలు అందుకోలేక బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టారు. ఒకవేళ కథ బాగున్నా కలెక్షన్లు రాక నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. అయితే ఈ సమస్యలు నందమూరి హీరోలపై ప్రభావం చూపలేకపోయాయి. పైగా వీరు.. తమ చిత్రాలతో తిరిగి చిత్రసీమకు ఊపిరిపోశారనే చెప్పాలి.

రెండో దశ లాక్​డౌన్​ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్​కు వస్తారా అని భయపడుతున్న నేపథ్యంలో బాలయ్య 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్​ వద్ద అఖండ విజయాన్ని అందుకుని సినీపరిశ్రమలో ధైర్యాన్ని నింపారు. దీంతో ప్రేక్షకులు థియేటర్​వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 'ఆర్​ఆర్​ఆర్'​తో వచ్చిన జూనియర్​ ఎన్టీఆర్​ తనలోని పూర్తి నటనను బయటకు తీసి సంచలన విజయాన్ని అందుకోవడం సహా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత కొన్ని సమస్యల వల్ల మళ్లీ వీక్షకులు సినిమా హాళ్లవైపు రావడం మానేశారు. దీంతో చిత్రసీమ మళ్లీ బోసిపోయింది. అయితే మళ్లీ కల్యాణ్​రామ్​ బింబిసారుడిగా వచ్చి థియేటర్లను హౌస్​ఫుల్​ అయ్యేలా చేసి బ్లాక్​బస్టర్​ హిట్​ను అందుకున్నారు. ఈ మూడు చిత్రాల విజయాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూడు సినిమాలు ఒక కామన్ పాయింటో సక్సెస్​ను సాధించడం విశేషం. అదే పాప సెంటిమెంట్.

అసలు వివరాల్లోకి వెళ్తే.. నిజానికి టాలీవుడ్​లో సెంటిమెంట్​లకు పెద్ద పీట వేస్తుంటారు. ఏ సినిమా మొదలు పెట్టినా ముహూర్తం నుంచి గుమ్మడి కాయ కొట్టి.. సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయ్యేంత వరకు సెంటిమెంట్​లు ఫాలో అవుతూ వుంటారు. అయితే మన నందమూరి హీరోల విషయంలో మాత్రం పాప సెంటిమెంట్​​.. యాధృచికంగా జరిగిందో లేదా అనుకున్నారో కానీ.. బాగా వర్కౌట్​ అయింది.

'అఖండ'లో బాలకృష్ణ.. అఘోరా, ఆయన తమ్ముడి పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఈ చిత్రంలో సినిమాలో అఘోరాకు, ఆయన తమ్ముడు(మురళి కృష్ణ) కూతురుకి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులన్ని బాగా ఆకట్టుకున్నాయి. సినిమా కథ దాదాపు ఆ పాప చుట్టూ తిరుగుతుంటుంది. పాపని అఘోరా కంటికి రెప్పలా కాపాడటం, పాప కోసం బాలయ్య మృత్యుంజయ పూజ చేయడం మెప్పిస్తాయి. పవర్​ఫుల్​ యాక్షన్ సినిమాలోనూ ఆ పాప పాత్ర హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఆడియన్స్ సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడానికి ఓ రకంగా ఆ పాప ఎపిసోడ్ కూడా ఓ కారణం.

akhanda baby centiment
అఖండ

ఇక 'ఆర్​ఆర్​ఆర్'​ కూడా అంతే. మల్లి అనే పాప పాత్రతో మొదలై, ఆ పాత్రతోనే ముగుస్తుంది. తల్లికి దూరమై బ్రిటిష్ కోటలో బందీగా ఉన్న ఆ చిన్నారిని తల్లి దగ్గరకు చేర్చేందుకు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతం చేశారు. తన నటనతో ఫ్యాన్స్​ను కట్టిపడేశారు. ఇక ఈ చిత్రంలో నటించిన అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్​చరణ్​ కూడా తన పవర్​ఫుల్​ పెర్​ఫార్మెన్స్​ను బయటపెట్టారు.

RRR baby centiment
ఆర్​ఆర్​ఆర్​

ఈ 'అఖండ', 'ఆర్ఆర్ఆర్' సినిమాల తరహాలోనే సోషియో ఫాంటసీగా వచ్చిన 'బింబిసార'లో కూడా పాప సెంటిమెంట్ ఉంది. క్రూరమైన రాజైన బింబిసారుడు మంచిగా మారడానికి పాప పాత్రే కారణం! 'అఖండ' చిత్రంలో లాగే 'బింబిసార'లో కూడా బింబిసారుడుకి, పాపకి మధ్య వచ్చే సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా నందమూరి హీరోలు నటించిన ఈ మూడు సినిమాలు భారీ విజయాలను అందుకోవడం.. మూడు సినిమాల్లోనూ పాప సెంటిమెంట్ ఉండటం, అవి చిత్రసీమకు మళ్లీ పూర్వవైభవాన్ని ఇవ్వడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Bimbisara baby centiment
బింబిసార

ఇదీ చూడండి: యుద్ధనౌకపై మోహన్​లాల్​... హీరోగా కాదు.. రియల్​ లైఫ్​ 'లెఫ్టినెంట్ కర్నల్​'గా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.