ETV Bharat / entertainment

'ఆ నటి వల్లే ఈరోజు నేనీ స్థాయిలో'

author img

By

Published : Jun 25, 2022, 5:18 PM IST

కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్‌, వెంకటేశ్‌.. ఇలా స్టార్​ హీరోలందరితో పనిచేసిన సీనియర్​ నటి వై.విజయ.. తన కెరీర్ గురించి మాట్లాడారు. సీనియర్​ నటి విజయశాంతి ఇచ్చిన సలహాతోనే ఆర్థికంగా తన జీవితం సాఫీగా సాగుతున్నట్లు తెలిపారు. ఇంకా పలు విషయాలను తెలిపారు. అవన్నీ ఆమె మాటల్లోనే....

senior actress Y vijaya
సీనియర్​ నటి వై విజయ

Senior Actress Y.Vijaya Vijayasanthi: గతంలో స్టార్‌ హీరోలందరితో కలిసి నటించిన సీనియర్​ నటి వై.విజయ.. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. 'ఎఫ్‌-2', 'ఎఫ్‌-3' సినిమాలతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సీనియర్​ నటి విజయశాంతి ఇచ్చిన సలహాతోనే ఆర్థికంగా తాను బాగున్నట్లు తెలిపారు.

"నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేశా. అప్పుడు నాకున్న సంపాదనతో చెన్నైలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. సావిత్రమ్మ(Savitri) జీవితం గురించి తెలుసుకున్నప్పుడు సినిమా అనేది జీవితాంతం ఉండదని అర్థమైంది. అదే సమయంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారుతోంది. దాంతో మా ఆయన, నేనూ.. మాకంటూ ఒక ఆదాయం ఉండాలని అనుకున్నాం. ఆ ఆలోచనతో పెట్టుబడులు పెట్టాం. దేవుడి దయ వల్ల మాకున్న దానిలో మేము ఆనందంగా జీవిస్తున్నాం. మరో విషయం ఏంటంటే.. ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే ఒక రకంగా నటి విజయశాంతి కూడా ఓ కారణం. మేమిద్దరం కలిసి సినిమాలు చేసే రోజుల్లో.. షూట్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా.. కాసేపు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా, ఓసారి తను పెట్టుబడుల విషయంపై మాట్లాడింది. ఆమె ఇచ్చిన ఆలోచనతో మేము తంజావూరులో ఒక కల్యాణమండపం, కాంప్లెక్స్‌ కట్టాం. ఇప్పుడు వాటి నుంచి వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్నాం" అని విజయ వివరించారు.

1961 నుంచి వై.విజయ ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఇప్పటివరకూ సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్‌, వెంకటేశ్‌.. ఇలా స్టార్‌హీరోలందరితోనూ పనిచేశారు. 'మా పల్లెలో గోపాలుడు', 'ప్రతిఘటన', 'లేడీస్‌ టైలర్‌', 'కలియుగ పాండవులు', 'ఏప్రిల్‌ 1 విడుదల', 'స్వాతి ముత్యం', 'రాంబంటు', 'సుస్వాగతం', 'రాజా' సినిమాల్లోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారిన విజయ.. భవిష్యత్తులో మంచి సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

ఇదీ చూడండి: నాగార్జున ధైర్యం చేయడం వల్లే అది సాధ్యమైంది: స్టార్​ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.