ETV Bharat / crime

ఆయుర్వేద గుళికల పేరుతో గంజాయి చాక్లెట్స్​.. నిందితుడి అరెస్ట్​

author img

By

Published : Dec 27, 2022, 3:52 PM IST

Ayurvedic Ganja chocolates
Ayurvedic Ganja chocolates

Ganja Chocolates: ఆయుర్వేద గుళికల పేరిట గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌ వాసిని హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి 164 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Ganja Chocolates : తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌వాసిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. 31 కిలోల 164 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ ఉర్‌హక్‌(41) 2015లో ఉపాధి కోసం నగరం చేరాడు. ఆసిఫ్‌నగర్‌లో మగ్గం పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం యూపీ, బిహార్‌ నుంచి తక్కువ ధరకు గంజాయి చాక్లెట్లు తెచ్చి విక్రయించసాగాడు.

బిహార్‌లో ఒక్కో చాక్లెట్‌ రూ.5కు కొనుగోలు చేసి నగరంలో రూ.20-50 వరకూ విక్రయించేవాడు. ఇటీవల పెద్దమొత్తంలో వాటిని తీసుకొచ్చి తన గదిలో ఉంచి అమ్ముతున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా.. ఎవరూ అనుమానించకుండా గంజాయి చాక్లెట్లు ఉంచే ప్యాకెట్లపై ఆయుర్వేద గుళికలంటూ పెద్ద అక్షరాలుంటాయి. వీటిని ఒంటినొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఉపయోగిస్తారంటూ విక్రయదారులకు చెబుతాడు. వీటి గురించి తెలిసిన వ్యక్తులకు మాత్రమే గంజాయి చాక్లెట్స్‌ పేర అధిక మొత్తంలో అమ్ముతుంటాడు.

సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్‌డీ) రాధాకిషన్‌రావు, దక్షిణమండలం ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ఖలీల్‌ పాషా బృందం ఆసిఫ్‌నగర్‌లోని జాఫర్‌ ఉర్‌హక్‌ నివాసంలో తనిఖీలు చేశారు. చార్మినార్‌ గోల్డ్‌ మునక్కా, విజయవాటి, ఆర్‌డీ శివ మునక్కా పేర్లతో ఉన్న 164 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.