ETV Bharat / city

TABLE TENNIS PLAYER:టేబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి

author img

By

Published : Jan 4, 2022, 1:02 PM IST

టెబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి
టెబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి

TABLE TENNIS PLAYER: అయితే క్రికెట్‌, లేదంటే టెన్నిస్‌ అన్నట్లు ఉన్న యువత.. ఇప్పుడిప్పుడే విభిన్న క్రీడల్లో రాణిస్తున్నారు. దేశీయంగా ప్రాచుర్యం లేని క్రీడలను ఎంచుకుని.. ఆయా ఆటలకు తమ ప్రదర్శనతో పేరు తీసుకు రావాలని భావిస్తున్నారు. అలా.. టేబుల్‌ టెన్నిస్‌లో భవిష్యత్‌ ఆశాకిరణంలా కనిపిస్తోంది.. విజయవాడకు చెందిన కాజోల్‌ సునార్‌. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో 100కు పైగా పతకాలు సాధించిన ఈ యువతి.. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా సాధన చేస్తోంది.

టేబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి

TABLE TENNIS PLAYER:ఆటలంటే చిన్నప్పుడు పిల్లలందరికీ ఇష్టమే. ఒక్కొక్కరూ ఒక్కో క్రీడలో ఉత్తమంగా రాణిస్తుంటారు. కానీ.. పెద్దవుతున్న కొద్దీ వేరువేరు వ్యాపకాల వైపు మళ్లుతుంటారు. చాలా తక్కు మందే ఎంచుకున్న క్రీడల్లో మెరుస్తుంటారు. అలా.. పాఠశాల వయసు నుంచే క్రీడల్లో రాణిస్తోంది.. విజయవాడకు చెందిన కాజోల్‌ సునార్‌.

ఈ యువతి తండ్రి నీమ్ బహదూర్.. దశాబ్దాల క్రితమే నేపాల్‌ నుంచి విజయవాడకు వలస వచ్చి స్థానిక కేబీఎన్‌ కాలేజీలో వాచ్‌మెన్‌గా చేరాడు. దాంతో చిన్నప్పటి నుంచి బెజవాడలోనే చదువుకుంది.. కాజోల్‌. ఈ యువతి.. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆటల్లో చురుగ్గా ఉండేది. ఆ కారణంగానే.. పీటీ ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించే వాళ్లు. అలా.. చిన్నప్పుడే టేబుల్‌ టెన్నిస్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది

తన సీనియర్లు ఆటల పోటీల్లో విజయం సాధించినప్పుడు.. పొందే పతకాలు, ఇతరులు అందించే ప్రశంసలు చూసి కాజోల్‌ స్ఫూర్తి పొందేది. టేబుల్‌ టెన్నిస్‌లో తీవ్రంగా సాధన చేస్తుండేది. ఆటపై ఇష్టంతో.. రోజులో ఎక్కువ సమయం.. టేబుల్‌ దగ్గరే గడుపుతుండేది. ఆ ప్రయత్నాలకు.. ఫలితంగా తొలి సారి జిల్లా స్థాయి పోటీల్లో పతకం నెగ్గింది. అప్పుడే విజయం అందించే సంతోషం తెలిసింది.. అంటోంది ఈ యువతి.


విజయాలే కాదు.. ఆ తర్వాత ఎదురైన అపజయాలు ఆమెకు ఎంతో నేర్పాయి. తన సానుకూలతలే కాదు.. లోపాల్ని కళ్లకు కట్టాయి. దాంతో.. ఆటలో మరింత నైపుణ్యం సాధించింది. గెలుపునైనా, ఓటమినైనా ఒకేలా తీసుకునే క్రీడా స్ఫూర్తిని పొందింది. అందుకే.. ఓడిన ప్రతీ సారి మరింత సాధన చేస్తూ.. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది.


క్రీడాకారిణిగా.. మంచి గుర్తింపునిచ్చింది మాత్రం రాష్ట్ర స్థాయి పోటీలే. పొటీపడిన తొలి రాష్ట్ర స్థాయి పోటీల్లోనే బంగారు పతకం సాధించిన కాజోల్‌. టేబుల్‌ టెన్నిస్‌లో అడుగడుగూ ఎక్కుతూ వస్తోంది. ప్రస్తుతం.. తన తండ్రి వాచ్‌మెన్‌గా పని చేసిన కాలేజిలోనే డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న కాజోల్‌... రాష్ట్రంలో ఎక్కడ పోటీలకు వెళ్లినా పతకం తప్పక వస్తుందనే స్థాయికి ఎదిగింది.

కనురెప్పపాటులోనే బాల్‌ని ప్రత్యర్థి పైకి తిప్పి పంపే కాజోల్‌.. ఇప్పటి వరకు 100కుపైగా పతకాలు సాధించింది. వీటిలో రాష్ట్ర స్థాయిలో60కి పైగా వివిధ పతకాలు సాధించి.. పతకాల వేట కొనసాగిస్తోంది. కాజోల్‌ అన్నయ్య, అక్కయ్యలు కూడా క్రీడల్లోనే ఉన్నారు. తండ్రి సంపాదన అరకొరగానే ఉన్నా.. పిల్లల ఇష్టం ప్రకారమే ప్రోత్సహిస్తున్నారు.

కాజోల్‌ ఆట తీరుకు.. కోచ్‌ సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, తల్లిదండ్రులు, స్నేహితులు ఆమె విజయాలను ఆస్వాధిస్తున్నారు. ఇంకా పెద్ద పోటీల్లో పతకాలు సాధించాలని కోరుకుంటున్నారు.

త్వరలో జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.. కాజోల్‌. ఈ క్రీడల్లో దేశానికి పతకం తేవడమే లక్ష్యంగా సాధన చేస్తోంది.

ఇదీ చదవండి: RGV TWITTER: ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.