ETV Bharat / city

పోతిరెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు ఆపకపోతే.. మేం ఆనకట్ట నిర్మిస్తాం: కేసీఆర్

author img

By

Published : Oct 6, 2020, 7:38 PM IST

Updated : Oct 6, 2020, 9:15 PM IST

If AP projects do not stop, we will build a dam at Alampur-Peddamarur said cm kcr
If AP projects do not stop, we will build a dam at Alampur-Peddamarur said cm kcr

19:35 October 06

కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ ఆపాలి: తెలంగాణ సీఎం

పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల విషయంలో ఏపీ తన పద్ధతిని మార్చుకోపోతే బాబ్లీ తరహాలో కృష్ణానదిపై అలంపూర్-పెద్దమారూర్ వద్ద కొత్త ఆనకట్ట నిర్మిస్తాం. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాం. నది జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా వ్యవహరిస్తామంటే ఇకనుంచి కుదరదు. జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొస్తే తాము సంపూర్ణంగా సహకరిస్తాం.    

                            - కేసీఆర్​, తెలంగాణ ముఖ్యమంత్రి

నదీ జలవివాదాలపై రెండు గంటలపాటు జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో.. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో వివరించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు సహా కేంద్ర వైఖరిపై.. తమ వాదన వినిపించారు.  

నాటి అన్యాయాల ఫలితమే.. ఉద్యమం

    నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమని కేసీఆర్ గుర్తుచేశారు. భారత యూనియన్​లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణకు అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైన వాటాను పొందే హక్కు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా సాధించుకుంటామని పేర్కొన్నారు. పలు ఫిర్యాదులు చేసినా, కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  

మేం అప్పటి నుంచే వ్యతిరేకం..

ఆయకట్టు, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు గండిపెడుతూ నిర్మిస్తున్న.. పోతిరెడ్డిపాడు కాలువను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని కేసీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  

అందుకే సుప్రీ కోర్టుకు..

నదీజలాల కేటాయింపుల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని.. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే కేంద్రానికి లేఖ రాశామన్న కేసీఆర్ గుర్తుచేశారు. ఏడాది గడచినా కేంద్రం స్పందించకపోవడంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-89 కింద కృష్ణానదీ జలాల వివాద ట్రైబ్యునల్​కు విధివిధానాలు ఖరారు చేసి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి కోరారు.  తమ నీటి అవసరాలు తీరకుండా బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఆంధ్రప్రదేశ్​కు లేదని కేసీఆర్​ అన్నారు. ఈ విషయంలో కేంద్ర జల్​శక్తి శాఖ, కృష్ణానదీ యాజమాన్య బోర్డు.. ఏపీకి చేసిన సూచనలను సరైనవిగా సీఎం అభిప్రాయపడ్డారు.  

పాత ప్రాజెక్టులే..

తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని కేసీఆర్​ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైందని వివరించారు. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేనని.. ఎలాంటి రహస్యం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు.  

డీపీఆర్​లు ఇస్తాం.. కానీ..

నిర్మాణ క్రమానికి అనుగుణంగా స్వల్పమార్పులు జరిగినందునే.. డీపీఆర్​లు ఇచ్చేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని కేసీఆర్​ తెలిపారు. తమ అభ్యంతరాలు, కేంద్రం పంపిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న అక్రమ ప్రాజెక్టు పనులను కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా నిర్మాణాలను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి షెకావత్​ను కోరారు.  

బాబ్లీ తరహాలో..

ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో.. అక్రమ నీటి ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తే.. రైతుల సాగునీటి అవసరాల కోసం బాబ్లీ తరహాలో కృష్ణానదిపై అలంపూర్​-పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మించి తీరతామని కేసీఆర్ హెచ్చరించారు. ప్రతిపాదిత ఆనకట్ట ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వస్తే.. తాము సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. బోర్డులు సమర్థంగా పనిచేయాలంటే.. తొలుత నీటి కేటాయింపులు చేసి.. వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

సీఎంల సంతకాల తర్వాతే..

మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశ వివరాలను సరిగా నమోదు చేయలేదన్న కేసీఆర్​.. ప్రస్తుత సమావేశం.. చర్చ, నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదుచేయాలని కేసీఆర్ సూచించారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్​ను అధికారికంగా విడుదల చేయాలని కోరారు.  

అధికారులకు అభినందనలు..

ఆరేళ్లుగా పెండింగ్​లో ఉన్న ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం తెలంగాణ ఒత్తిడి మేరకు పరిష్కారం కావడం రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తమ ఫిర్యాదులు ట్రైబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సీఎం చెప్పారు. రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.  

Last Updated :Oct 6, 2020, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.