ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న నదులు, వాగులు

author img

By

Published : Sep 26, 2020, 5:15 PM IST

Updated : Sep 26, 2020, 5:27 PM IST

VJA_State wide rains_overall
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న నదులు, వాగులు

రాష్ట్రవ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలతో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పొలాల్లో భారీగా వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు గల్లంతయ్యారు, ఒక విద్యార్థి చనిపోయాడు.

రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలోని 7 జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. చాలా చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల్లోకి వరద నీరి పంట నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో వెళ్లాయి. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు గల్లంతయ్యారు, ఒక విద్యార్థి చనిపోయాడు. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

కర్నూలు జిల్లాను కమ్మేసింది...

కర్నూలు జిల్లాలోని కుందూనది ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. నీటి ప్రవాహనికి నదిపై వంతెన మునిగింది. చామ కాలువతోపాటు మద్దులేరు వాగులో నీటి మట్టం పెరగటంతో సమీప గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లమల్లో కురిసిన భారీ వర్షాలకు మహానంది వద్ద పాలేరు వాగు పొంగుతోంది. మహానంది వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధన కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు వచ్చే చేరింది. కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు.

కడప జిల్లాలో కుండపోత

కడపలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం నీటమునిగింది. నగరంలోని రహదారులపై మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. వర్షం కారణంగా కమలాపురం-ఖాజీపేట ప్రధాన రహదారి మూతపడింది. పాగేరు వంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టు పక్కల 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోడూరు మండలంలోని అంకనగొడిగెనూరు చెరువుకు గండి పడటంతో..పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లోయర్ సగిలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీటితో పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

జిల్లాలోని మాండవ్య నది, పాపాగ్ని, పెన్నా, చెయ్యరు, బాహుదా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, ఝరికోన, పిచ్ఛా, శ్రీనివాసపురం రిజర్వాయర్, మైలవరం, గండికోట ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుంది. నదుల నుంచి దిగువ ప్రవహిస్తున్న నీరంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు చేరడంతో ముంపు గ్రామాలలోకి వరద నీరు వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో భారీ వాన

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రహదారుల జలమయమ్యయాయి. పలు చోట్ల విద్యుత్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లమలలో కురిసిన వర్షానికి సాగిలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గండ్లకమ్మవాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ నది వరద ప్రవాహంలో ట్రాక్టర్‌ కొట్టుకుపోగా...ఇద్దరు రైతు కూలీలు ఈదుకుంటూ వచ్చి సురక్షితంగా బయటపడ్డారు. వరినాట్లు వేసుకునేందుకు తెచ్చుకున్న వరి నారు వాగులో కొట్టుకు పోయాయి. సబ్జా తదితర పంటలు కోతకు వచ్చి ఉండగా... రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద తూర్పువాగు ఉద్ధృతికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు ఒకరిని కాపాడగా...మరో విద్యార్థి చనిపోయాడు.

పశ్చిమగోదావరి జిల్లాలో జోరు వాన

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండ వాగులు పొంగుతున్నాయి. బుట్టాయగూడెం-జీలుగుమిల్లి సరిహద్దులో కారుతో సహా వాగులో పడి పందిరి మామిడిగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి కంచర్ల రాము గల్లంతయ్యారు. కారులో ఉన్న మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. జల్లేరు, బైనేరు, వెదుళ్ల వాగు, పెద్రాల వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

అనంతపురం జిల్లాలో ఆకాశానికి చిల్లుపడినట్టు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తాయి. పలు మండల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడిపత్రి-గుత్తి ప్రధాన రహదారిపై రెండు ప్రాంతాల్లో వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రతి యేటా కరవు, వర్షాభావ పరిస్థితులతో నష్టపోయే జిల్లా రైతులు ఈ సారి భారీ వర్షాలతో నిండా మునిగారు.

గుంటూరు జిల్లాలో వానలే వానలు

గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 64.1 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. పెదపరిమి-తుళ్లూరు మధ్య ఉన్న కొటేళ్ల వాగు స్థాయిని మించి ప్రవహిస్త్తోంది. నీటి ప్రవాహంతో తుళ్లూరు-పెదపరిమి మధ్య రాకపోకలు స్తంభించాయి. వాగులో కారు చిక్కుకోగా..స్థానికులు ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. వాగు వద్ద పోలీసులును కాపలా ఉంచిన అధికారులు...భారీ వాహనాలను మినహా ఇతర వాటిని అనుమతించటం లేదు.

కృష్ణా జిల్లాలో చెదుమదురు జల్లులు

కృష్ణా జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, పాలేరు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 11 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దిగువకు 25 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఆనకట్ట వద్ద మరో అడుగు నీటి మట్టం పెరిగితే లింగాల వంతెనపై నుంచి నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. తక్కెళ్ళపాడు వద్ద వరి పొలాలు నీటమునిగాయి.

ఇదీచదవండి

రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

Last Updated :Sep 26, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.