ETV Bharat / city

రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి

author img

By

Published : Aug 21, 2022, 5:15 PM IST

Yuva Sangarshana Yatra రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఆరోపించారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి
రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి

BJYM Yuva Sangarshana Yatra: రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. విజయవాడలో బీజేవైఎం 'యువ సంఘర్షణ యాత్ర' ముగింపు సభలో పాల్గొన్న నేతలు.. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరులన్నింటినీ దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వైకాపా ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయన్నారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి

"ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లేవు. మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా జగన్​ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఏపీలో మా ప్రభుత్వం వచ్చాక అన్ని మాఫియాల ఆట కట్టిస్తాం. అవినీతిలో ఏపీది నాలుగో స్థానం, తెలంగాణది రెండో స్థానం. మోదీ ప్రభుత్వం ఏపీకి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదు. ఒక్క రాజధానికే డబ్బు లేదు.. 3 రాజధానులు ఎలా కడతారు?. జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారు." - అనురాగ్ ఠాకూర్‌, కేంద్రమంత్రి

BJP leaders: జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా ఉన్న పార్టీ భాజపానే అని రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. జగన్ భయపడేది ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమేనని తెలిపారు. సీఎం జగన్ తనను తాను పులిగా అభివర్ణించుకున్నారని మరోనేత సత్యకుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు జగన్‌ అనేక రకాల హామీలు గుప్పించి ప్రజలను మోసం చేశారన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వాలంటీర్ల పేరుతో వైకాపా శ్రేణులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని దుయ్యబట్టారు.

ట్విటర్​లో ట్రెండింగ్: భాజపా యువసంఘర్షణ యాత్ర హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండవుతుంది. 'Yuva Against Jagan' పేరిట హ్యాష్‌ట్యాగ్‌ ట్వీటర్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వైకాపా ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తూ భాజపా యువ సంఘర్షణ యాత్ర చేపట్టింది.

దుర్గమ్మ సేవలో కేంద్రమంత్రి: బీజేవైఎం 'యువ సంఘర్షణ యాత్ర' ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రికి ఆలయ ఆర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి సేవలో అనురాగ్ ఠాకూర్​తో పాటు సోము వీర్రాజు, సునీల్ దేవదర్, విష్ణువర్థన్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.