ETV Bharat / state

విశాఖలో లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

author img

By

Published : Aug 21, 2022, 4:08 PM IST

Lokesh Press Conference తెదేపా నేత నారా లోకేశ్‌ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన ఆయన్ను అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి విశాఖ చేరుకొని అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుమతి లేదంటూ ఆయన మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అడ్డుకున్నారు. 151 నోటీసు ఇచ్చినందున ఈ మీడియా సమావేశానికి అనుమతి లేదని చెప్పారు.

లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

Nara Lokesh Press Conference విశాఖలో నారా లోకేశ్‌ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 151 నోటీసు ఇచ్చినందున మీడియా సమావేశానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల వైఖరిపై మండిపడ్డ నారా లోకేశ్.. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించట్లేదని తెలిపారు. పోలీసుల తీరుపై లోకేశ్‌, తెదేపా నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మీడియా సమావేశాన్ని అడ్డుకుని నారా లోకేశ్‌ను పోలీసు వ్యానులో విశాఖ విమానాశ్రయం తరలించారు.

లోకేశ్ మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

"ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యలు సమర్థనీయం కాదు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించట్లేదు. విశాఖకు గౌరవంగానే వచ్చాను గౌరవంగానే వెళ్తా. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది. కూల్చివేతల జగన్‌ నిరంకుశ పాలన సాగుతోంది. జగన్‌.. రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అయ్యన్న ఇంటిని జేసీబీతో కూల్చారు. విశాఖ గీతం వర్సిటీ భూభూగంలోని ప్రహరీ గోడ కూల్చారు. నోటీసులు లేకుండా అర్ధరాత్రి వెళ్లి ప్రహరీ గోడ కూల్చారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై అనేక రకాలుగా పోరాడుతున్నాం. ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు నిలదీస్తే జేసీబీ వస్తోంది. జేసీబీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జగన్‌ నిలుస్తున్నారు."- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

మీ అనుమతి తీసుకోవాలా ?: తన పర్యటన అడ్డుకోవటానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపై పెట్టాలని నారా లోకేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. శాంతిభద్రతలు కాపాడటంపై శ్రద్ధ పెడితే పరిస్థితులు బాగుండేవని హితవు పలికారు. పలాసలో పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకోవటం బాధాకరమన్నారు. కార్యకర్తలను కలవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా ? అని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పలాసలో విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాడుతాం. నన్ను అరెస్ట్ చేయించి ఊరంతా తిప్పి జగన్ ఆనందిస్తున్నారు. నా పర్యటనను అడ్డుకోవడానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపై పెట్టాలి. శాంతిభద్రతలు కాపాడటంపై శ్రద్ధ పెడితే పరిస్థితులు బాగుండేవి. పేదల ఇళ్లు కూల్చడంతో జగన్‌ ఫ్యాక్షన్‌ బుద్ధి బయటపడింది. పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. పౌరుల హక్కులు కాలరాసేలా వ్యవహరించడం దుర్మార్గం." -నారా లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

లోకేశ్ అరెస్టుతో ఆందోళన: అంతకుముందు నారా లోకేశ్‌ను శ్రీకాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస వెళ్తున్న ఆయన్ను ఆమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జాతీయరహదారిపై తెదేపా శ్రేణుల ఆందోళనకు దిగాయి. పోలీసులు, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి లోకేశ్‌ నిరసన తెలిపారు. పోలీసులకు లోకేశ్ కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేశ్‌తో పాటు కళా వెంకట్రావు, చినరాజప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎచ్చెర్ల మండలం జేఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.