ETV Bharat / city

రెండు జిల్లాల్లో కుంభవృష్టి.. స్తంభించిన రాకపోకలు

author img

By

Published : Nov 12, 2021, 6:27 AM IST

heavy rains in nellore and chittor districts
heavy rains in nellore and chittor districts

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి మొదలైన వాన.. గురవారం అర్దరాత్రి వరకూ తగ్గలేదు. గాలుల తీవ్రతకు చాల చోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం.. గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు, కాలువలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువ కావడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకూ అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి ఘాట్‌రోడ్లు రెండింటినీ శుక్రవారం ఉదయం వరకు మూసేశారు. రేణిగుంట విమానాశ్రయం, రుయా ఆసుపత్రి నీటమునిగాయి.

నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతిని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. తూర్పు, పడమర ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. రహదారులపై వృక్షాలు కూలిపడ్డాయి. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 13 మండలాల్లో 402 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో ఆనకట్టపై గేట్లను దాటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గాలులకు భారీ వృక్షాలు భవనాలపై పడటంతో నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్‌ శిరీష, కమిషనరు గిరీష సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాలోని జలాశయాల గేట్లన్నీ దాదాపు ఎత్తేశారు. రామచంద్రాపురం మండలం పీవీపురం వాగులో సరళ అనే మహిళ గల్లంతు కావడంతో గ్రామస్థులు గాలిస్తున్నారు.

నెల్లూరు జిల్లా తడలో జాతీయ రహదారిపై వర్షం నీటిలో మొరాయించిన వాహనాన్ని నెడుతున్న పోలీసులు


విమానాలకు అంతరాయం..
తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఆరు విమానాలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట వచ్చే ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక తిరిగి హైదరాబాద్‌ వెళ్లింది. విద్యాసంస్థలన్నింటికీ గురు, శుక్రవారాలు సెలవు ప్రకటించారు. తిరుపతి - చెన్నై రైలుమార్గంలో పుత్తూరు మండలం తడుకు సమీపంలో రైల్వేట్రాక్‌ వరదనీటిలో మునిగింది. ఇక్కడ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ నడుపుతున్నారు. తిరుపతి రుయాసుపత్రి నీట మునిగింది. తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి లోపల ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు ప్రయాణికులను వెలుపలికి తరలించారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు, వాటిని తొలగిస్తున్న సిబ్బంది


తిరుమల రెండు ఘాట్‌రోడ్ల మూసివేత
భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లను మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది. వీటిని గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు ఘాట్‌రోడ్లలో విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించారు.

మెట్ల మార్గంలో వరద ప్రవాహం

నెల్లూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు
నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో 10 నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. 8 పునరావాస కాలనీల్లో 400 మందికి ఆశ్రయం కల్పించారు. సోమశిల రిజర్వాయరుకు వచ్చే వరద 28వేల క్యూసెక్కులకు పెరగడంతో.. అవుట్‌ ఫ్లోను పెంచారు. దొరవారిసత్రం రైల్వేస్టేషన్‌లో సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో.. హావ్‌డా, బెనారస్‌, పినాకిని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి. సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చింది. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతులో నీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* తమిళనాడుకు చెందిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. చెన్నై నుంచి మచిలీపట్నం వైపు చేపల వేటకు వెళ్లినవారు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు బోటు మరమ్మతులకు గురైంది. మైపాడు బీచ్‌కు సమీపంలో ఆగిపోవడంతో లంగరు వేసి నిలిపివేశారు. వారిని శుక్రవారం బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేశామని జేసీ హరేంధిరప్రసాద్‌ తెలిపారు.

తిరుపతిలోని స్కావెంజర్స్‌ కాలనీలో ఇంటిలోకి నీరు చేరడంతో సామగ్రి తడవకుండా చూసుకుంటున్న ఓ కుటుంబం
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో నేలవాలి నీట మునిగిన వరి పంట

కడపను వణికించిన వాయుగుండం


కడప జిల్లా పుల్లంపేట వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పుల్లంగేరు

కడప జిల్లాలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రైల్వేకోడూరు మండలంలో 10.72 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఓబులవారిపల్లెలో 10.2 సెం.మీ, చిట్వేలి 7.6, రాజంపేట 7.3, రాయచోటి 7.1లో సెం.మీ. వర్షం కురిసింది. పింఛ జలాశయం మూడు గేట్లు ఎత్తి నదిలోకి 12 వేల క్యూసెక్కులను వదిలారు. అన్నమయ్య జలాశయం నుంచి నదిలోకి 9,640 క్యూసెక్కులను విడుదల చేశారు.

నేడూ రాష్ట్రంలో భారీ వర్షాలు

వాయుగుండం చెన్నై సమీపంలో తీరం దాటడంతో... దాని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. అండమాన్‌ తీరంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణశాఖ పేర్కొంది. ఇది మరింత బలపడి 17న కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఎస్పీడీసీఎల్‌కు భారీనష్టం

స్పీడీసీఎల్‌కు రూ.3.20 కోట్ల నష్టం వాటిల్లింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల పరిధిలో నష్ట వివరాలను సంస్థ ప్రకటించింది. అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. జిల్లాలవారీగా కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేస్తూ సంస్థ సీఎండీ హరనాథరావు ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి: RAINS IN TIRUMALA: తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు.. కనుమ దారులు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.