ETV Bharat / city

కిలిమంజారోని అధిరోహించిన తెలుగుతేజం అచంట ఉమేష్‌

author img

By

Published : Apr 7, 2021, 4:02 AM IST

ttt player climbs Kilimanjaro
కిలిమంజారోను అధిరోహించిన తెలుగుతేజం

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. అందుకు తగిన ప్రణాళిక, కఠిన సాధన తప్పని సరి అంటున్నాడు రాజమహేంద్రవరానికి చెందిన ఆచంట ఉమేష్.. తనూ ఆ సూత్రాన్ని అనుసరించే అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఓ వైపు టేబుల్‌ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడిగా పేరు సంపాదించినా.. పర్వాతారోహణ చేయాలనే కోరిక కలిగింది. ఇంకేముంది.. ప్రపంచంలోనే ఎత్తున శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను దిగ్విజయంగా అధిరోహించి.. చరిత్ర లిఖించాడు.

అభిరుచి, సాధించాలనే పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్నాడు.. ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడు. ఇతని పేరు ఆచంట ఉమేష్‌. స్వస్థలం రాజమహేంద్రవరం. చిన్నప్పటి నుంచి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిడిగా ఉన్న ఈ యువకుడు.. అనూహ్యంగా పర్వతారోహణ వైపు మళ్లాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించి... రికార్డు సృష్టించాడు.

చిన్న వయస్సు నుంచే క్రీడలపై మక్కువ..

చిన్నవయస్సు నుంచి టేబుల్ టెన్నిస్‌లో క్రీడపై మక్కువ పెంచుకున్న ఉమేష్‌.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆ ప్రతిభ ఆధారంగానే 2010లో భారత తపాలా శాఖలో ఉద్యోగం సంపాదించాడు.

400 పతకాలు సొంతం..

జాతీయ స్థాయిలో 30 సార్లు ఏపీకి ప్రాతినిధ్యం వహించిన ఉమేష్‌.. అంతర్జాతీయ పోటీల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఒమెన్ ఓపెన్ ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న ఈ యువ ఆటగాడు.. అమెరికాలో జరిగిన బటర్ ఫ్లై క్యారీ కప్ డివిజన్ బి ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. ఇలా వివిధ టోర్నమెంట్లలో 400 వరకు పతకాలు సాధించి.. టెబుల్‌ టెన్నిస్‌ అంటే తనకెంత ఇష్టమో తెలియజేశాడు.

కిలిమంజారోను అధిరోహించిన తెలుగుతేజం

పర్వతారోహణ చేయాలనే కోరిక..

ఓ వైపు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించే ఆట.. మరో వైపు ఉద్యోగం. అలా సాఫీగా సాగిపోతుండగా.. ఉమేష్‌కు మనస్సు మరో సాహస క్రీడ వైపు మళ్లింది. చాలా తక్కువ మంది ఆసక్తి చూపించే.. పర్వతారోహణ చేయాలనే కోరిక కలిగింది. ఏదైనా కావాలనుకుంటే ఎంత కష్టమైనా సాధించేతత్వం ఉన్న ఉమేష్‌కు ఆ ఆలోచన కుదురుగా ఉండనివ్వలేదు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్​లోని నిమాస్​లో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం.. అదే రాష్ట్రంలోని 16 వేల అడుగుల ఎత్తుండే మీరాతాంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. దాంతో తన కోరిక నెరవేరిందని సంతృప్తి చెందాడు.

'నేనేందుకు అధిరోహించకూడదు'

విజయం రుచి చూశాక.. ఎవరైనా కుదురుగా ఉండలేరు. ఈ కుర్రాడు కూడా అలానే.. తనతో పాటు శిక్షణ తీసుకున్న వాళ్లు పర్వతారోహణలో రికార్డు సాధించడంతో.. తానెందుకు పర్వతారోహణను కొనసాగించకూడదు అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే.. స్థానికంగా ఉన్న కొండలు ఎక్కుతూ సాధన చేశాడు. ఆ సమయంలోనే పెద్ద లక్ష్యం వైపు పయనించాడు.

పర్వత శిఖరంపై భారత జాతీయ జెండా రెపరెపలు..

తనలో ముద్రవేసుకున్న పర్వతారోహణలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో.. గత నెలలో టాంజానియాలోని ప్రపంచ ప్రఖ్యాత కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలని నిర్ణ యించుకున్నాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు, దాతల సాయంతో మార్చి 26న కిరిమంజారో శిఖారాగ్రం చేరి.. అందరినీ అబ్బురపరిచాడు.. ఈ యువ పర్వతారోహకుడు. పర్వత శిఖరంపై అతిపెద్ద భారత జాతీయ జెండాను రెపరెలాడించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

'అదే ఈ స్థాయికి తీసుకొచ్చింది'

ఏదైనా పనిని మనస్ఫూర్తిగా తీసుకుంటే.. అందులో అత్యుత్తమంగా రాణించే వరకూ వదలడు.. ఉమేష్‌. ఆ పట్టుదలే.. తనని ఇంతవరకు తీసుకువచ్చిందని చెబుతున్నాడు.. ఉమేష్‌. ఇతను సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. యువత, ప్రజా ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

'ఆ సమయాన్ని క్రీడలకు వెచ్చిస్తే..'

ఏదైనా సాధించాలనే కలలు కనటమే కాదు.. వాటిని సాధించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించాలని సూచిస్తున్నాడు ఉమేష్‌. స్మార్ట్‌ ఫోన్లకు, సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయాన్ని శారీరక వ్యయామాలు, క్రీడలకు ఉపయోగిస్తే.. మంచి భవిష్యత్ సొంతమవుతుందని చెబుతున్నాడు.

ఇదీ చదవండి:

చెత్త సేకరణ వాహనాల్లో వెంటిలేటర్ల తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.