ETV Bharat / city

ప్రొటోకాల్ పాటించకపోవడం...ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమే: అచ్చెన్నాయుడు

author img

By

Published : Jul 27, 2021, 6:16 PM IST

ప్రోటోకాల్ పాటించకపోవడం...ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమే: అచ్చెన్నాయుడు
ప్రోటోకాల్ పాటించకపోవడం...ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమే: అచ్చెన్నాయుడు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వకుండా రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, నిలదీస్తే ఆస్తుల ధ్వంసం చేపట్టడం దారుణమని ఆక్షేపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులకు అధికారులు కనీస గౌరవం ఇవ్వకుండా రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల నేతలు గెలుపొందిన చోట వైకాపా నేతలే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా, కార్పొరేటర్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, హక్కుల్ని కాలరాస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, నిలదీస్తే ఆస్తుల ధ్వంసం చేపట్టడం దారుణమని ఆక్షేపించారు.

పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన వర్ల రామయ్య...

ప్రతిపక్షాల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 హక్కును కాలరాసే విధంగా తెదేపా నేతల పట్ల పోలీసుల వ్యవహారశైలి ఉందని.. డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల్ని గృహనిర్బంధించటాన్ని వర్ల రామయ్య ఖండించారు. చెత్త పన్నుకు నిరసన తెలపాలనుకోవటమే ఆయన చేసిన నేరమా? అని ప్రశ్నించారు. తెదేపా చేపట్టే నిరసన కార్యక్రమాలను సెక్షన్ 30పోలీస్ యాక్ట్, 144సెక్షన్​లతో నిరోధిస్తున్నారని మండిపడ్డారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ప్రతిపక్షనేతలను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

నిధులు దోచుకుంటున్నారు: గుమ్మడి సంధ్యరాణి

పీకల్లోతు కష్టాల్లో పోలవరం నిర్వాసితులుంటే చలనం లేనట్లుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం విడుదల చేసిన నిధుల్ని దారి మళ్లించి దోచుకున్నారని ఆరోపించారు. గిరిజనుల సమస్యలు, కష్టాలు పట్టనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిహారం చెల్లింపులో వివక్ష చూపటం దుర్మార్గమన్నారు.

వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరోసభ్యులు కొల్లురవీంద్ర ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం చెబుతుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తూతుమంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేసి మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని కొల్లురవీంద్ర నిలదీశారు.

రోడ్లన్నీ గుంతలమయం: డోలా బాలవీరాంజనేయ స్వామి

రాష్ట్రంలో గత రెండేళ్లలో నిధులు దుర్వినియోగం, అవినీతి వల్లే రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని తెదేపా శాసనసభాపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. "రహదారుల దుస్థితిపై గతప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవటం సిగ్గు చేటు. తెదేపా ప్రభుత్వ హయాంలో 24,679కిలోమీటర్ల మేర రహదార్ల నిర్మాణం జరిగితే, జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో వేసింది కేవలం 300కిలోమీటర్ల రోడ్లే. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలన్నింటినీ రద్దు చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటంతో కాంట్రాక్టర్లు ఎవ్వరూ రోడ్ల టెండర్లలో పాల్గొనట్లేదు. ఈ ఏడాది బడ్జెట్ లో 10,900కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు రూ.481కోట్లు కేటాయించారు. వీటిలో పాత బకాయిలకు రూ.388కోట్లు పోగా మిగిలింది రూ.92కోట్లు మాత్రమే. రూ.84వేలతో సగటున ఒక కిలోమీటర్ రోడ్డు మరమ్మతు ఎలా చేపడతారు. రహదారి ప్రమాదాలు తగ్గించే విధంగా మరమ్మతులు చేయకుంటే తెదేపా పోరాటం కొనసాగుతుంది." అని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిధుల మళ్లింపు: సయ్యద్ రఫీ

కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.750కోట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దారి మళ్లించారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ "రూ.750కోట్లు ఏమయ్యాయో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నెలరోజుల్లో నిధుల్ని తిరిగి కార్మిక సంక్షేమ నిధిలో జమ చేయకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం. నిధుల దారిమళ్లినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కార్మిక మంత్రి జైరామ్ తన పదవికి రాజీనామా చేయాలి. మంత్రికి అవినీతికి పాల్పడటం పై ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమం పట్ల లేదు. కార్మికుల నుంచి సెస్ రూపేణా వసూలు చేసే సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న సంక్షేమ నిధి సొమ్మును కార్మికుల బాగు కోసం ఖర్చు చేయకపోవటం దుర్మార్గం. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానాల వల్ల పనుల్లేక 60మంది కార్మికులు చనిపోతే ఏ ఒక్కరి కుటుంబానికీ పరిహారం కూడా చెల్లించలేదు." అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1,540 కరోనా కేసులు, 19 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.