ETV Bharat / city

భవిష్యత్ తరాల కోసమే యుద్ధం.. వారితోనే నా పోరాటం: చంద్రబాబు

author img

By

Published : Jul 13, 2022, 7:40 PM IST

Chandrababu
Chandrababu

Chandrababu review : క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృట్టిసారించి వారంలోగా నియామకాలు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు.. ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేమని హెచ్చరించారు. వైకాపా సర్కారు కొండల్ని, చెరువుల్ని అక్రమంగా తవ్వేస్తుందని.. ఈ అక్రమ తవ్వకాలపై సీఎస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్ తరాల కోసమే యుద్ధం.. వారితోనే నా పోరాటం: చంద్రబాబు

Chandrababu review : క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించి, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్, యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జోనల్ ఇన్‌ఛార్జ్‌లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జోన్-1 ఇన్‌ఛార్జ్‌ బుద్ధా వెంకన్న, జోన్-2 ఇన్‌ఛార్జ్‌ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్-3 ఇన్‌ఛార్జ్‌ డోలా బాలవీరాంజనేయస్వామి, జోన్-4 ఇన్‌ఛార్జ్‌ అనగాని సత్యప్రసాద్, జోన్-5 ఇన్‌ఛార్జ్‌ అమర్నాథ్ రెడ్డిలకు పలు ఆదేశాలు ఇచ్చారు. వీరితో పాటు ఈ సమీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ప్రోగ్రామ్స్ కమిటీ ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.

జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా చేసేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు. చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపేనని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అడవుల నరికివేతపై 75 ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. పద్ధతి ప్రకారం ఇసుక తవ్వకాలు చేపట్టకుండా వాతావరణ సమస్యలకు తెరలేపారని దుయ్యబట్టారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. సమాజమే శాశ్వతమని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పేనని హెచ్చరించారు.

ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు.ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేం.మైనింగ్ మంత్రే అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమాలు ప్రశ్నిస్తున్న నాపై కేసులు పెడుతున్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారతి సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారు. కొండల్ని, చెరువుల్ని అక్రమంగా తవ్వేస్తున్నారు.కుప్పంలోనూ ఇదే తరహాలో వైకాపా అక్రమ మైనింగ్ జరుపుతోంది. అక్రమ తవ్వకాలపై సీఎస్‌ సమాధానం చెప్పాలి. తుపానులు రాకుండా మడ అడవులు సహాయపడతాయి. కాకినాడలో అలాంటి మడ అడవులను నాశనం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసమే నా యుద్ధం.. సమాజానికి చెడు చేసే వ్యక్తులతోనే నా పోరాటం. --చంద్రబాబు తెదేపా అధినేత

తాజా సర్వేల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 20వ స్థానానికి పడిపోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజలకు జగన్ అంటే కంపరం పుట్టింది కనుకే.. 20 స్థానంలోకి వెళ్లారని విమర్శించారు. శ్రీలంకలో పాలకులు పారిపోయినా... ప్రజల ఆగ్రహం చల్లారాలేదని గుర్తించాలన్నారు. వైకాపా గ్రాఫ్ పడిపోయిందంటూ....వారికే రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. గడప గడపకు ఎత్తిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు.

అంతకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఫోటో ఎగ్జిబిషన్ : కొండల్ని మింగేస్తున్న వైకాపా భూబకాసురులు పేరిట తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విశాఖ రుషికొండ ధ్వంసం ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దు బమిడికలొద్దిలో భారతీ సిమెంట్ కోసం లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఫోటోలు ప్రదర్శనలో ఉంచారు. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని.... కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి... కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను తవ్వేశారని ఫోటో ప్రదర్శనలో పెట్టారు. కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా బండపల్లె కొండను పెద్దిరెడ్డి అనుచరులు మాయం చేశారంటూ ఫోటోలు ప్రదర్శనలో ఉంచారు. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 62మంచి చనిపోయారని ప్రదర్శనలో తెలిపారు. విజయనగరం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వైకాపా నేతలు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఫొటో ప్రదర్శనలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.