ETV Bharat / city

AMARAVATHI FARMERS MAHAPADAYATRA IN NELLORE : పాదయాత్రలో ఉద్రిక్తత... పోలీసులతో రైతుల వాగ్వాదం

author img

By

Published : Dec 5, 2021, 2:04 AM IST

Updated : Dec 5, 2021, 8:23 AM IST

నెల్లూరు జిల్లాలోని రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత
నెల్లూరు జిల్లాలోని రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

Amaravathi Farmers padayatra in nellore : అమరావతి రైతుల మహాపాదయాత్రపై మరోసారి పోలీసులు కాఠిన్యాన్ని ప్రదర్శించారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా రైతులు సొంత రక్షణ వ్యవస్థగా ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లపై దాడి చేశారు. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చినవారితోనూ వాగ్వాదానికి దిగారు. రైతులపై పూలు చల్లకుండా నియంత్రించేందుకు ఆయా వాహన డ్రైవర్లను బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు.

పాదయాత్రలో ఉద్రిక్తత... పోలీసులతో రైతుల వాగ్వాదం

Amaravathi Farmers padayatra in nellore : ఉత్సాహంగా ముందుకు సాగుతున్న అమరావతి మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. 34వ రోజు శనివారం నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన రైతులకు మద్దతుగా పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులు ఇరువైపులా బస్సులు, లారీలను వదలడం వివాదాస్పదంగా మారింది. ఈ సమయంలో పాదయాత్రలో రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు దాడి చేశారు. శివ అనే బౌన్సర్‌పై సీఐ నాగమల్లేశ్వరరావు దాడి చేయటంతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా రైతులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల పోలీసులు అనుచితంగా మాట్లాడుతూ.. పలుమార్లు వేలు చూపించి బెదిరించారని మహిళలు ఆరోపించారు.

ఉద్దేశపూర్వకంగానే అడ్డు తగులుతున్నారు...

రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారితోనూ పోలీసులు వాగ్వాదానికి దిగారు. నాయుడుపాళెం రోడ్డు దగ్గర రైతులపై పూలు చల్లతున్న స్థానికులను అడ్డుకున్నారు. పూలు చల్లడానికి వీల్లేదని సీఐ నాగమల్లేశ్వరరావు దుర్భాషలాడటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు భయపడేది లేదని, ఇలాంటి బెదిరింపులు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి పడుతున్నామన్నారు. రైతుల సహనాన్ని పరీక్షించేందుకు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని, కానీ మా సంకల్పానికి ఎలాంటి విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఓర్చుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. పోలీసుల తీరును ఇంతటితో వదలమని, శుక్రవారం నాటి ఘటనలపై ప్రైవేటు కేసులు నమోదు చేస్తామని ఐకాస ప్రతినిధులు తెలిపారు. పాదయాత్రలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.

జన నీరాజనాల నడుమ ఘన స్వాగతం...

Amaravathi Farmers padayatra in nellore : అమరావతి రైతుల 34వ రోజు మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో జన నీరాజనాల మధ్య సాగింది. అఖండ జనసందోహం పెద్దఎత్తున అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చింది. మేము సైతం అంటూ ఊరూరా ప్రజలు ఘనస్వాగతం పలికారు. అన్ని వర్గాల వారు మమేకమై పాదయాత్రలో భాగస్వాములయ్యారు. యాత్ర బృందంతో కలిసి కిలోమీటర్ల దూరం నడిచారు. జయహో అమరావతి అంటూ నినదించారు. శనివారం యాత్ర సైదాపురం దగర నుంచి గుడూరు మండలం పుట్టంరాజు కండ్రిక వరకు దాదాపు 14కి.మీ సాగింది.

నేడు పీఆర్.కండ్రిగ నుంచి పాదయాత్ర...

నేడు 35వ రోజు మహా పాదయాత్ర క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పుట్టంరాజు కండ్రిక దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి గొల్లపల్లి మీదుగా వెంకటగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించి వెంకటరెడ్డి పల్లి, అంబలపూడి, బాలాయపల్లి వరకూ సాగనుంది. అక్కడ భోజన విరామం అనంతరం యాచవరం మీదుగా, వెంగమాంబపురం చేరుకుంటుంది. దాదాపు 15కిలోమీటర్లు నడవనున్న రైతులు రాత్రికి వెంగమాంబపురంలోనే బస చేయనున్నారు.

ఇవీచదవండి.

Last Updated :Dec 5, 2021, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.