ETV Bharat / city

ఏపీ వదిలి తెలంగాణకు వస్తా.. మాజీ మంత్రి జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Sep 24, 2021, 8:27 PM IST

జేసీ దివాకర్​​ రెడ్డి
జేసీ దివాకర్​​ రెడ్డి

మాజీమంత్రి, ఎపీ తెదేపా నేత జేసీ దివాకర్​​ రెడ్డి (JC Diwakar Reddy).. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్​ను కలిశారు. ఆంధ్రప్రదేశ్​ను వదిలేసి తెలంగాణకు వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రాయల తెలంగాణ కావాలని జైపాల్​ రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని.. దాని వల్ల తాము చాలా నష్టపోయామని మనసులో మాటలు వెల్లడించారు.

అటు కేసీఆర్​ ఇటూ కాంగ్రెస్​ నేతలతో జేసీ చర్చలు

మాజీ మంత్రి, ఎపీ తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల‌పై తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ.. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. సీఎంతో కాసేపు ముచ్చటించారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో సరదాగా మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు కలవలేదని.. అందుకే ఇప్పుడు కలిసి మాట్లాడినట్టు స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని.. రాయలసీమను కూడా తెలంగాణలో కలిపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రాయల తెలంగాణ కావాలంటే ఒప్పుకోలే..

ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానని జేసీ దివాకర్‌రెడ్డి(JC Diwakar Reddy).. వ్యాఖ్యానించారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని తెలిపారు. రాయల తెలంగాణ కావాలని జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని పేర్కొన్నారు. జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడన్న దివాకర్‌రెడ్డి(JC Diwakar Reddy).. .. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ గురించి తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ రాజకీయంగా అభివృద్ధి చెందిందని జేసీ తెలిపారు.

నీతి లోపించింది..

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా సీఎల్పీలో మాట్లాడొద్దని జేసీకి భట్టితో పాటు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సూచించారు. పార్టీకి నష్టం కలిగే మాటలు సీఎల్పీలో మాట్లాడొద్దని.. వ్యతిరేకంగా మాట్లాడాలంటే బయట మాట్లాడుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ఆ మాటలకు స్పందించిన జేసీ.. తాను పుట్టింది, పెరిగింది, అభివృద్ధి చెందింది కూడా కాంగ్రెస్ పార్టీలోనేన‌ని వివ‌రించారు. రాజకీయ నాయకులలో నీతి లోపించిందని, జనాలను తప్పు దోవ పట్టించేది రాజకీయ నాయకులేన‌ని జేసీ అభిప్రాయపడ్డారు. తాను 1980లో సమితి ప్రెసిసెంట్ పదవి​ కోసం రూ.10వేలు ఖర్చు చేస్తే... ఇప్పుడు ఎంపీగా నిలపడితే రూ.50 కోట్లు ఖర్చవుతోంద‌న్నారు.

జగన్​ అనుకుంటే వచ్చేస్తాయంతే...

"ఏపీ సీఎం జగన్ మొదట్లో.. సీఎస్​ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్​లను అన్న అని పబ్లిక్​గా పిలిచాడ‌ు. ఇలా జగన్​ తప్ప.. ఏ సీఎం పిలవడు. ఆఖరికి అదే సుబ్రహ్మణ్యంను బాపట్ల కాలేజీలో రిజిస్ట్రార్​గా వేశాడు. ఐఏఎస్​లకే గ్యారెంటీ లేద‌ు. చీఫ్ సెక్రటరీనే తీసి కళాశాలల్లో పాఠాలు చెప్పుకోమన్నాడు. గతంలో చెన్నారెడ్డి మాటల్లో చెబితే.. జగన్ చేతల్లో చూపిస్తున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్​ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఏపీలో స్థానిక సంస్థల ఫ‌లితాలు నాకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదు. జగన్ అనుకున్నాడు.. ఆ ఫ‌లితాలు వచ్చాయి అంతే..! పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఓటు 4 నుంచి 5 వేలకు పోతుంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్కొక్కరు రూ.50 కోట్లు ఖర్చు చేశార‌ు. అధికారంలో లేని వ్యక్తి.. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి 15 నుంచి 20 కోట్లు ఇచ్చాడ‌ని.. జగన్​కు హైదరాబాద్ నుంచి కూడా డబ్బులు లారీలలో వచ్చాయి." - జేసీ దివాకర్​ రెడ్డి, మాజీ మంత్రి

ఇదీ చదవండి: Sajjala: ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన ఒక్కటయ్యాయి: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.