ETV Bharat / city

High Court on Jagan Govt: 'వాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలు.. హై కోర్టు న్యాయమూర్తులకూ లేవు'

author img

By

Published : Jul 24, 2021, 6:58 AM IST

40 , 50 మందిని సలహాదారులను నియమించుకోవడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, ఇతర ప్రయోజనాలు, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొంది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని పేర్కొంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

high court
హైకోర్టు

ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారులనే పేరుతో 40 , 50 మందిని నియమించుకోవడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, ఇతర ప్రయోజనాలు, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా? అని వ్యాఖ్యానించింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని పేర్కొంది. గతంలో నియమితులైన సలహాదారులు మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపింది. ప్రస్తుతం కొంత మంది సలహాదారులు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొంది . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు .. ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి . గవర్నర్ ముఖ్యకార్యదర్శి , ఎస్ఈసీ నీలం సాహ్ని తరపు న్యాయవాదుల వాదనల కోసం విచారణ ఈ నెల 28 కి వాయిదా పడింది. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి. శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు.

సీఎం రాసిన లేఖతో ఎస్ఈసీ నియామకం

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎస్ఈసీ నీలం సాహ్ని నియామకం జరిగిందన్నారు . ఆ నియామకాన్ని ప్రశ్నించే హక్కు ఓటరుగా , భారత పౌరుడిగా పిటిషనర్‌కు ఉంది . ఎస్ ఈసీ నియామకంతో వ్యక్తిగతంగా నష్టపోకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు వ్యాజ్యం దాఖలు చేయవచ్చన్నారు . ఇదే తరహాలో తెదేపా నేత వర్ల రామయ్య జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల విషయంలో దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత ఉంది అని హైకోర్టు పేర్కొంది . స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించాలని సుప్రీం స్పష్టంచేసింది . నీలం సాహ్ని సీఎస్ గా పనిచేశారు . ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సేవలు అందించారు . ఎస్ ఈ సీ నియామకం కోసం గవర్నర్ కు ముఖ్యమంత్రి పంపిన పేర్లలో ఆమెను ప్రతిపాదిస్తూ లేఖ రాశారు . ఎస్ఈసీ నియామకం గవర్నర్ విచక్షణాధికారం మేరకు జరగాలి . ముఖ్యమంత్రి రాసిన లేఖతో ఆమె ప్రత్యేక అర్హత పొందినట్లు అయ్యింది . ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆమె నియామకం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించినట్లు కాదన్నారు . ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నియామక ఉత్తర్వులను రద్దు చేయండి ' అని కోరారు.

ఈ సందర్భంగా ఎస్ఈసీ నియామకానికి సంబంధించి చట్ట నిబంధనలు ఏమి చెబుతున్నాయో న్యాయమూర్తి పరిశీలించారు . అర్హత ఏమిటో , ఎవరు నియమితులు అయ్యేందుకు అర్హులో విచారణ సందర్భంగా చర్చ జరిగింది . ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్ఈసీగా నియమితులు అయ్యేందుకు అర్హులని ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొంటే .. స్వతంత్ర అభ్యర్థి ఎస్ ఈ సీ గా నియమితులు కావాలని ఏవిధంగా కోరుకుంటారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.

'ఎస్ఈసీ నియామకం నిమిత్తం ముఖ్యమంత్రి పేర్లను సూచించినా ... వాటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం గవర్నర్‌కు లేదని ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ అన్నారు . ఎస్ఈసీగా సాహ్ని నియామక విషయంలో పద్ధతిని అనుసరించామని వాదించారు . పరిపాలనాపరమైన నిపుణులైన వారు ఎస్ఈసీగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి .. గవర్నర్ కు పేర్లను పంపారు . ఎస్ ఈ సిగా నియామకానికి ముందు నీలం సాహ్ని ప్రభుత్వంతో పనిచేశారనే కారణంతో ఆమె స్వతంత్ర వ్యక్తి కాదు అని పిటిషనర్ చెప్పడం సరికాదన్నారు . నియమితులయ్యాక స్వతంత్రంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం ' అని అన్నారు.

ఎలాంటి నిబంధనలు లేవు: ఏజీ

ఈ సందర్భంగా నీలం సాహ్ని .. ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా పనిచేయడంపై చర్చకు వచ్చింది . సలహాదారుల విధులు , అర్హత విషయంలో ప్రభుత్వం వద్ద ఏమైనా నిబంధనలు ఉన్నాయా ? అని న్యాయమూర్తి ప్రశ్నించారు . ఎలాంటి నిబంధనలను లేవని ఏజీ బదులిచ్చారు . వివిధ రంగాల్లో నిపుణులైన , తగిన వారిని నిర్దిష్ట కాలానికి సలహాదారులుగా నియమిస్తారన్నారు . అర్హతల గురించి చట్టం లేదన్నారు . ఫలానా వాళ్లను నియమించకూడదనే నిషేధం లేదన్నారు . ప్రజా ఖజనానా నుంచి పారితోషకం వారికి చెల్లిస్తారన్నారు . సలహదారుల విధుల విషయమై వారి నియామక జీవోలో పేర్కొన్నారన్నారు . న్యాయమూర్తి స్పందిస్తూ .. 41 మందిని సలహాదారులుగా నియమించారని , రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలని కదా అని వ్యాఖ్యానించారు.

ఐఏఎస్లో ఎందుకు?: న్యాయమూర్తి

ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యేందుకు కేవలం ఐఏఎస్ లే ఎందుకు .. ఇతర విభాగాల నుంచి అర్హులయిన వారిని ఎందుకు నియమించకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు . ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు . ఏజీ స్పందిస్తూ .. గత 45 ఏళ్లుగా దేశంలోని ఒకటి , రెండు రాష్ట్రాల మినహాయ మిగిలిన రాష్ట్రాల్లో ఐఏఎస్ ప్లే సంప్రదాయబద్ధంగా ఎన్నికల కమిషనర్లుగా నియమితులు అవుతున్నారన్నారు . ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఐఏఎస్ ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారన్నారు.

ఇదీ చదవండి:

IAS officers transfers: రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.