ETV Bharat / city

TEA: అందరూ మెచ్చే ఆ ఒక్క'టీ'.. ఈ పోషకాల టీ

author img

By

Published : Jul 18, 2021, 2:08 PM IST

TEA
టీ

ఉదయం లేవగానే వేడి వేడి పొగలు గక్కుతూ పలకరిస్తుంది. సాయంత్రాలు స్నాక్స్‌తో జత కడుతుంది. స్నేహితులు కలిస్తే... వన్‌ బై టూ అంటూ అభిమానం పంచుతుంది. చుట్టాలు, మిత్రులొచ్చినా మర్యాదలు చేసేది మొదట దీంతోనే... అలసటగా ఉన్నా.... హుషారు కావాలన్నా కప్పు తాగాల్సిందే... ఇన్ని సుగుణాలున్న ఆ ఒక్కటీ... అందరూ నచ్చే టీ... మసాలా దినుసులు, పూలు, పండ్లతో కలిసి పోషకాల తేనీటిగా మారి రుచులను అందిస్తోందిలా!

కశ్మీరీ గవా..

TEA
కశ్మీరీ గవా

కావాల్సినవి: నీళ్లు- మూడు కప్పులు, యాలకులు- ఎనిమిది(చితక్కొట్టి పెట్టుకోవాలి), దాల్చిన చెక్క- ఒకటి, కుంకుమ పువ్వు- కొద్దిగా, చాయిపత్తా- పెద్ద చెంచా, బాదం- అయిదారు (పొడి చేసుకోవాలి), తేనె- పావు కప్పు,

తయారీ: పొయ్యిమీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, కుంకుమపువ్వు, టీపొడి, బాదం పొడి అన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా మరిగించాలి. కప్పులోకి వడగట్టుకుని కుంకుమపువ్వుతో గార్నిష్‌ చేసుకుని తాగితే వావ్‌ అనకుండా ఉండలేరు.

చిక్కని తందూరీ ...

TEA
చిక్కని తందూరీ

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, టీపొడి- రెండు చెంచాలు, ఇలాచీ- నాలుగైదు, అల్లంముక్క- చిన్నది, చక్కెర- మూడు చెంచాలు, పాలు- కప్పు.

తయారీ: స్టవ్‌ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, అల్లంతరుగు వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. దీనికి టీ పొడిని జత చేయాలి. ఇది మరుగుతున్నప్పుడు పాలు కలపాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్‌ చిన్నగా చేసి చక్కెర వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలపాటు చిన్నమంటపై మరిగించాలి. దీన్ని ఒక పాత్రలోకి వడకట్టుకోవాలి. మరో పొయ్యి మీద చిన్నపాటి జాలీ పెట్టి దానిపై బొగ్గులను వేడిచేయాలి. ఈ బొగ్గులపై టీ తాగే ముంతను బాగా కాల్చాలి. బొగ్గులు అందుబాటులో లేకపోతే ముంతను నేరుగా స్టవ్‌పై పెట్టి కూడా వేడిచేయొచ్చు. ఇప్పుడు ఈ వేడి వేడి ముంతలో టీ పోసి తాగితే ఆహా అనకుండా ఉండలేరు.

మనసు దోచే మసాలా..

TEA
మనసు దోచే మసాలా

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మసాలా పొడి- చెంచా, టీపొడి, చక్కెర- రెండు చెంచాల చొప్పున, శొంఠి- రెండు చిన్న ముక్కలు, యాలకులు- నాలుగైదు, లవంగాలు- పావు చెంచా, మిరియాలు- అర చెంచా, దాల్చినచెక్క- అయిదారు, పాలు- కప్పు.

తయారీ: మసాలా దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుని పొడి తయారుచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్‌ పెట్టి నీళ్లు పోసి, మసాలా పొడి వేసి నిమిషంపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చాయిపత్తా వేసి రెండు మూడు నిమిషాలపాటు మరిగించాలి. పాలు పోసి మరికాసేపు మరగబెట్టాలి. చక్కెర జత చేయడం మరవొద్దు. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన మసాలా టీ రెడీ! కప్పుల్లో వడకట్టుకుని తాగేస్తే సరి.

పోషకాల మందార..

TEA
పోషకాల మందార

కావాల్సినవి: మందారపూలు- రెండు, అల్లం ముక్క- ఒకటి (పెద్దది), తేనె- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- నాలుగైదు.

తయారీ: గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి రెండు, మూడు నిమిషాలపాటు మరిగించాలి. కొన్ని పుదీనా ఆకులు, కాస్తంత తేనే కలిపి మరిగించాలి. చివరగా మందార పూలను వేసి నిమిషంపాటు కలిపి కప్పులోకి వడకట్టుకుంటే సరి.

సురుచుల దానిమ్మ..

TEA
సురుచుల దానిమ్మ

కావాల్సినవి: దానిమ్మ గింజలు- అర కప్పు, నీళ్లు- కప్పు, నిమ్మకాయ- సగం ముక్క.గులాబీ రేకలు- కొన్ని, తేనె- చెంచా.

తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, అందులో దానిమ్మ గింజలు వేసి రసం నీళ్లలోకి దిగేలా పప్పుగుత్తి లాంటిదాంతో బాగా మెదపాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. చివరగా కొన్ని గులాబీ రేకలను జతచేసి మరికాసేపు మరిగించాలి. దీన్ని గ్లాసులోకి వడకట్టుకుని, తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే దానిమ్మ టీ సిద్ధమైనట్లే.

కమ్మని కటాన్‌..

TEA
కమ్మని కటాన్‌..

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, అల్లంముక్క, దాల్చినచెక్క- ఒకటి చొప్పున, టీపొడి- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- కొన్ని, తేనె/చక్కెర- రెండు చెంచాలు.

తయారీ: గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోయాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి అల్లం ముద్ద, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో చాయిపత్తాను జత చేయాలి. పుదీనా ఆకులను కూడా వేసుకుంటే టీకు సువాసనలతోపాటు రుచీ పెరుగుతుంది. ఈ ఆకులు వేశాక మంటను తగ్గించి నిమిషంపాటు మరిగించాలి. ఆ తర్వాత కప్పులోకి వడకట్టుకుని తేనె/చక్కెర కలిపి వేడి వేడిగా తాగితే సరి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.