ETV Bharat / city

KCR On Debts: ప్రస్తుతం భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లు: తెలంగాణ సీఎం కేసీఆర్​

author img

By

Published : Mar 15, 2022, 9:01 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​
తెలంగాణ సీఎం కేసీఆర్​

KCR On Debts: తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ఆర్‌బీఐ చెబుతోందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కరోనా సాకు కాదన్న కేసీఆర్... కరోనా కంటే ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారిందని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

KCR On Debts: చట్టసభల్లో చర్చల సరళి మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. సమకాలీన, సామాజిక ధోరణులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్‌ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం దేశంలో ప్రబలి ఉందని సీఎం చెప్పారు. పార్లమెంటు, రాష్ట్రాల్లో బడ్జెట్‌ ప్రవేశపెడితే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. బడ్జెట్‌ అద్భుతంగా ఉందని అధికారపక్ష నేతలు చెబుతుంటారని.. బడ్జెట్‌లో పసలేదని విపక్ష నేతలు తమ అభిప్రాయం చెబుతారని కేసీఆర్​ అన్నారు. ఏళ్ల తరబడి ఇదే విధమైన ధోరణి కొనసాగుతోందన్నారు. సమకూర్చుకున్న నిధుల వినియోగంపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న కేసీఆర్.. ప్రపంచంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పారు.

"స్వాతంత్య్రం వచ్చాక దేశ తొలి బడ్జెట్‌ రూ.190 కోట్లు మాత్రమే. దేశ తొలి బడ్జెట్‌లో రూ.91 కోట్లు రక్షణ నిధికి కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రాల బడ్జెట్‌ రూ.లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌ను ప్రభుత్వ, ప్రైవేటు బడ్జెట్‌గా పరిగణించవచ్చు. ప్రైవేటు బడ్జెట్‌ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నిల్వలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్‌ విషయానికి వచ్చేసరికి తారుమారు అవుతుంది. రంగాలవారీగా చేయాల్సిన ఖర్చుల ఆధారంగా ప్రణాళిక తయారీ చేస్తారు. బడ్జెట్‌ ప్రణాళిక మేరకు నిధుల కూర్పు ఉంటుంది." - కేసీఆర్

తెలంగాణది 25వ స్థానం..

తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ఆర్‌బీఐ చెబుతోందని టీఎస్ సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామన్నారు. అప్పులు చేసే రాష్ట్రాల క్రమంలో 25వ స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశం విత్త విధానాన్ని నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమేనన్న ప్రభుత్వం.. ఇందులో కొద్ది మేర మాత్రమే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.

వారివి అణచివేసే చర్యలే..

కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలుగా ప్రస్తుత కేంద్ర విధానం ఉందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ధోరణి ఉందని విమర్శించారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలో ఉందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రాలను అణచివేసే చర్యలను కేంద్రం చేపడుతోందని మండిపడ్డారు.

భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లు..

ప్రస్తుతం భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లు

కేంద్ర పనితీరు తెలంగాణ కంటే దిగజారిపోయిందని ఆరోపించిన కేసీఆర్.. ప్రస్తుతం భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 58.5 శాతం అప్పులు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రాలు మాత్రం 25 శాతంలోపు అప్పు తీసుకోవాలని అంటోందని చెప్పారు. కేంద్రం ఇష్టానుసారం నిధుల సమీకరణ చేస్తోందని ఆరోపించిన కేసీఆర్​.. రాష్ట్రాలను తొక్కిపెడుతోందని మండిపడ్డారు.

తీవ్రంగా వ్యతిరేకించాం..

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధానాలను రాష్ట్రాలు ఖండించాలని కోరారు. సివిల్‌ సర్వీసు అధికారుల విషయంలో నిబంధనలు మారుస్తామన్నారని కేసీఆర్​ చెప్పారు. అధికారులను ఎప్పుడైనా వెనక్కి తీసుకునేలా నిబంధనలు తెస్తామంటున్నారన్నారు. అధికారులను వెనక్కి రప్పించడంపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరిందని చెప్పిన కేసీఆర్​.. దానిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు.

డబుల్ ఇంజిన్ గ్రోత్‌ కథలు..

డబుల్ ఇంజిన్ గ్రోత్‌ కథలు చాలా ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న యూపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని శాసనసభలో వెల్లడించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలుందని.. అదే యూపీలో తలసరి ఆదాయం రూ.71 వేలే ఉందని చెప్పారు. యూపీ కంటే తెలంగాణలో వృద్ధి రేటు చాలా ఎక్కువ పేర్కొన్నారు. డబుల్‌ ఇంజిన్ ఉన్న యూపీలో మాతాశిశుమరణాల రేటు ఎక్కువని సీఎం కేసీఆర్​ చెప్పారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శుభవార్త..

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శుభవార్త

తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్​ ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ సమ్మె వంటి పొరపాట్లు చేయవద్దని హెచ్చరించారు. వీఆర్‌ఏలను కూడా ఇరిగేషన్‌ విభాగంలోకి తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు. వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇచ్చి లష్కర్​ పోస్టులోకి తీసుకుంటామని ప్రకటించారు. సెర్ప్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇస్తామన్నారు. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇచ్చేందుకు సర్కార్​ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యం చేయమని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం..

తెలంగాణలో ఉన్న మూడు మెడికల్‌ కళాశాలలను 33కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో 13 వర్సిటీలు ఉంటే మరో 11 వర్సిటీలు నెలకొల్పామన్నారు. దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకమన్న కేసీఆర్‌.. మార్చి 31 లోపు 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందనుందని స్పష్టం చేశారు. దళిత బంధుతో పాటు దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పోడు భూముల సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకుంటామని కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన విద్యార్థులకు కేసీఆర్​ గుడ్​న్యూస్​..

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన విద్యార్థులకు కేసీఆర్​ గుడ్​న్యూస్

ఉక్రెయిన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల భవిష్యత్‌పై.. కేంద్రానికి సరైన ప్రణాళిక లేదని సీఎం విమర్శించారు. అక్కడి నుంచి 710 మందికి రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నామన్న సీఎం.. వాళ్ల భవిష్యత్​ దెబ్బతినకుండా చదివించుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్​ను.. కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు.

"దేశంలో వైద్య విద్య చాలా ఖరీదుగా మారింది. ఇక్కడ కోటీ రూపాయల వరకు ఖర్చయితే.. ఉక్రెయిన్​లో 25 లక్షల్లోనే వైద్య విద్య పూర్తవుతుంది. అందుకే చాలా మంది అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. అక్కడికి ఎందుకు వెళ్లారంటే.. ఇక్కడ అవకాశాలు లేవని అక్కడికి వెళ్లారు. ఇప్పటికీ అక్కడ యుద్ధం ముగిసిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. అతికష్టం మీద మొత్తానికి 710 మంది విద్యార్థులను టికెట్ల ధరలు భరించి తిగిరి రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నాం. కానీ.. ఇప్పుడు వాళ్ల భవిష్యత్​ ఏంటీ..? వాళ్ల చదువు మధ్యలోనే ఆగిపోవాలా..? మళ్లీ ఉక్రెయిన్​ వెళ్లే పరిస్థితి ఉందా..? ఏం జరగాలి..? తెలంగాణ ప్రభుత్వంగా.. నేను ప్రకటిస్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే లేఖ కూడా రాస్తాం. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా మేం భరించి.. ఇక్కడ చదివిస్తాం. వాళ్ల చదువు ఆగిపోకుండా.. భవిష్యత్​ దెబ్బతినకుండా.. చదివిస్తాం. ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్​.. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. దీని మీద కూడా కేంద్ర మంత్రులు రకరకాల నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరుకు చెందిన నవీన్​ అనే విద్యార్థి చనిపోతే.. వాళ్ల తల్లిదండ్రులు బాధలో ఉండే ఇంకా బాధపెట్టే మాటలు మాట్లాడారు." - కేసీఆర్​

ఇదీచూడండి: RRR: పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.