ETV Bharat / city

పిల్లల భాష, ఉచ్చరణపై మరింత శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్​

author img

By

Published : Sep 26, 2022, 5:41 PM IST

CM Jagan
ముఖ్యమంత్రి జగన్

CM Jagan review on women and child welfare: అన్ని అంగన్‌వాడీలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్​వైజర్ల పోస్టుల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశించారు. జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.

CM Jagan review on women and child welfare: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ల నిర్వహణ నిధి (టీఎంఎఫ్), పాఠశాలల నిర్వహణకు ఏర్పాటు చేసిన ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీలకు కూడా ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో సీఎం చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సీఎం సమగ్రంగా సమీక్షించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్నాయని సమాచారం ఉందన్న సీఎం.. నివారణకు పగడ్బందీ విధానాలు అమలు చేయాలన్నారు. నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌ చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు.

అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం...లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్ఠంగా పర్యవేక్షణ చేయాలన్నారు. అంగన్‌వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబరుతో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఉంచాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్ఛరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా ప్రీ ప్రైవరీ-1, ప్రీ ప్రైమరీ-2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలని, ఉభయభాషా పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలన్న సీఎం జగన్​.. కల్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న సీఎం.. దీనికోసం లబ్ధిదారులైన వధువు, వరుడు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామన్నారు.

సూపర్​వైజర్ల పోస్టుల భర్తీ: సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని అధికారులు... సీఎంకు తెలిపారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తునట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిసాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని, పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

భవిత సెంటర్​: దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం జగన్​ ఆదేశించారు. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలన్న సీఎం.. జువైనల్‌ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మానసిక వైకల్యంపై వైద్యులు టెంపరరీ సర్టిఫికెట్లు జారీ చేసినా, వారికి పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా జులై, డిసెంబర్లలో మంజూరు ప్రక్రియ జరగాలన్నారు. దీంట్లో భాగంగా మానసిక వైకల్యంపై టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ డిసెంబరు పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్​ నిర్దేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.