ETV Bharat / city

నేను చేయాల్సింది చేస్తున్నాను.. ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి: సీఎం జగన్​

author img

By

Published : Jul 18, 2022, 10:29 PM IST

cm jagan
cm jagan

CM Jagan Review: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు సహా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు చేపట్టకపోవడం.. తూతూ మంత్రంగా తిరుగుతున్న వారి పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సూచించిన సీఎం.. పార్టీకి నష్టం కల్గితే తానేం చేయలేనని.. గెలిచేవారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు.

Gadapa Gadapaku Mana Government: 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్‌షాప్‌ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా జిల్లా ఇన్ చార్జీలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సమీక్షించారు. ఎమ్మెల్యేలు పాల్గొనడం సహా జరుగుతోన్న తీరు పై పార్టీ చేయించిన సర్వే నివేదికలను సీఎం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వారీగా పనితీరును తెలియజేశారు. ఇప్పటివరకు మాజీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కేవలం 10 రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం, కొందరు తూతూ మంత్రంగా గ్రామాల్లో పర్యటించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేనిపక్షంలో.. గ్రాఫ్ మెరుగుపరచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు.

ఈ సందర్బంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. నిధులు లేమి వల్ల రోడ్లు, డ్రైనేజీలు, సహా పలు సమస్యలు పరిష్కరించలేకపోతున్నట్లు సీఎంకు చెప్పారు. స్పందించిన సీఎం ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు ఇస్త్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వీటితో సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి ఉత్తర్వులను వెంటనే విడుదల చేసినట్లు తెలిపారు.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమన్న సీఎం..జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటామన్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని సీఎం ఆదేశించారు. మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్న సీఎం..రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయని, వారికి న్యాయం జరగాలంటే.. మనం తిరిగి అధికారంలోకి తిరిగి రావాలన్నారు. మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు రావాలన్న సీఎం.. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని అక్కడా విజయం సాధించాలన్నారు.

తాను చేయాల్సింది అంతా చేస్తున్నానని, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి. సంక్షేమ పథకాలను సకాలంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం.. ఇద్దరమూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు.గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు.. గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. -జగన్​, ముఖ్యమంత్రి

కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని.. గడప గడపకూ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం 175 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలని సీఎం ఆదేశించారు.

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌ ఇవ్వలేదు: గడప గడపకు కార్యక్రమం అమలులో వెనుకబడిన వారు పనితీరు మెరుగు పరచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలెవరికీ సీఎం వార్నింగ్‌లు ఇవ్వలేదన్నారు. పార్టీకి ఇబ్బంది కల్గించే విధంగా చేసుకోవద్దని.. అలాంటి పరిస్థితి వస్తే కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిపారు. వైకాపా ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండేందుకు రాలేదని.. ఎమ్మెల్యేల గ్రాఫ్‌ని ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజల్లో తిరిగితేనే ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరుగుతుందని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించడం వృథా అన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.