ETV Bharat / city

Sadhana Deeksha: కరోనా విపత్తును సీఎం తేలిగ్గా తీసుకున్నారు:చంద్రబాబు

author img

By

Published : Jun 29, 2021, 6:52 PM IST

Sadhana Deeksha
Sadhana Deeksha

కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) తేల్చి చెప్పారు. యుద్ధప్రాతిపదికన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న కొవిడ్‌ మరణాలు, బాధితులకు ప్రభుత్వం అందించిన సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మే నెలలో రాష్ట్రంలో చోటుచేసుకున్న కొవిడ్‌ మరణాల పేర్లు, వివరాలు వెల్లడించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్‌ విసిరారు.

కొవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో 'సాధన దీక్ష(Sadhana Deeksha)' పేరిట నిరసనకు దిగారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కొవిడ్‌ మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ సాధన దీక్షలో పాల్గొన్న తెదేపా శ్రేణులు జూమ్‌ ద్వారా అధినేత నిరసనకు మద్దతు పలికారు.

ప్రతి తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి తక్షణ సాయంగా 10 వేలు ఆర్థిక సాయం, కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నష్టపోయిన వివిధ రంగాల వారికి నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు(chandrababu) డిమాండ్‌ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం అందించడంతోపాటు... ఆక్సిజన్‌ మరణాలన్నింటికి ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి వారి కుటుంబాలకు 25 లక్షలు, విధి నిర్వహణలో చనిపోయిన కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు 50లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.

విపత్తు వేళ హోల్ సేల్​గా దోపిడీ

మీగడంతా సీఎం జగన్ రెడ్డి(CM Jagan) మింగేసి.. పేదలకు మజ్జిగ పోస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని హోల్ సేల్​గా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తామడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా దిశ చట్టాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకే వేరే కార్యక్రమాలు సీఎం పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రజల తరపునే తమ పోరాటమన్న చంద్రబాబు... పెట్రోల్, డీజిల్, నిత్యవసరాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి పన్నుల భారం ఎందుకు మోపారని నిలదీశారు. బంగారు గుడ్డు పెట్టే అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో వేసిన ఎస్ఆర్ఎం, విట్ విత్తన ఫలితాలు విద్యార్థులకు బంగారు భవిష్యత్తుగా మారిందన్నారు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవని సీఎం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. చేసే అవినీతిలో 10శాతం వదులుకుంటే ప్రజాసమస్యలు పరిష్కరించడం పెద్ద కష్టమేమీకాదని చంద్రబాబు హితవు పలికారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కొవిడ్ వచ్చిన వారికి 2వేల రూపాయలు, చనిపోయిన వారి దహన సంస్కారాలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు:

పరిపాలించే సత్తా ఉంటే ఉన్న చట్టాలు సరిపోతాయని దిశ చట్టాన్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్​ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఆరోపించారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని మండిపడ్డారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని దుయ్యబట్టారు. 5కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండ వాదం చేశారని విమర్శించారు. 16.53లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో తోక ముడిచారని ఎద్దేవా చేశారు.

మద్యం దుకాణాలు తెరిచి దుర్మార్గంగా వ్యవహరించారు:

ప్రతి ఏటా మే నెలలో రాష్ట్రంలో సగటు మరణాలు 27వేలు ఉంటే.. ఈ ఏడాది 1.27లక్షలు నమోదయ్యాయని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. మే నెలలో లక్షమందిపైగా కొవిడ్​తో చనిపోతే 12వేలు మాత్రమే అని ప్రభుత్వం తప్పుడు లెక్కలిచ్చిందని మండిపడ్డారు. మూడో దశ హెచ్చరికలు ఉన్నా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేవని ధ్వజమెత్తారు. కరోనా తీవ్రతలో మద్యం దుకాణాలు తెరిచి దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టి ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. కరోనాతో చనిపోయిన మృతదేహాలకు సరైన గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. శ్మశానాల్లో రిజర్వేషన్లు, అంత్యక్రియల ధరల పెంపు వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయన్న చంద్రబాబు.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే రెండేళ్ల నుంచి జగన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టలేదని విమర్శించారు.

భారత్ బయోటెక్​కు కులం రంగు పూశారు:

కరోనాకు వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్(Bharat Biotech)​కు కులం రంగు పూయటం నాగరికతా అని చంద్రబాబు నిలదీశారు. ఆదాయాలు కోల్పోతున్న ప్రజానీకానికి కొనుగోలు శక్తి పెంచకుండా ఇంకా లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు, కార్మికులు, టీచర్లు ఇలా అనేక రంగాల వారు పనిలేకుండా అవస్థలు పడుతున్నారని వాపోయారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు జయలలిత ఫొటో పెట్టి కొనసాగించడం రాజకీయ సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఏపిలో 5 రూపాయలకే పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుపై కొట్టారని దుయ్యబట్టారు. న్యాయమైన డిమాండ్లు కోరిన విద్యార్థులపై అత్యాచారం కేసు పెట్టారని ధ్వజమెత్తారు. అసలు అత్యాచార నిందితుల్ని పట్టుకోలేక ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. తప్పుడు కేసులు పెడతుంటే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

చంద్రబాబుతోపాటు దీక్షలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, ఫరూక్, వర్ల, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, బోండాఉమామహేశ్వరరావు, అనిత, బీదా రవిచంద్ర, మంతెన సత్యన్నారాయణ రాజు, టీడీ జనార్దన్, గుమ్మడి సంధ్యారాణి, అశోక్ బాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Mis-C: ఆరోగ్యశ్రీ పరిధిలోకి 'మిస్-సి'...రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.