ETV Bharat / business

Budget 2023 : బీమా ప్రీమియం భారం నుంచి కాస్త ఊరట లభించేనా?

author img

By

Published : Jan 23, 2023, 5:45 PM IST

Budget 2023 : అన్ని ఖర్చులతో పాటు బీమా ప్రీమియంలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో బీమా పథకాలపై కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సామాన్యులు ఆశిస్తున్నారు. బీమా పరిశ్రమలు కూడా సామాన్యులకు ప్రయోజనాలను అందించాలని కోరుతున్నారు.

budget 2023 steps to boost insurance penetration
budget 2023 steps to boost insurance penetration

Budget 2023 : వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కుటుంబ బడ్జెట్‌లో బీమా సంబంధిత ఖర్చులు కీలకంగా మారాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ నుంచి సామాన్యులు బీమా సంబంధిత ఉపశమనాలను ఆశిస్తున్నారు. బీమా పరిశ్రమ కూడా సామాన్యులకు ప్రయోజనాలను అందించాలని కోరుతోంది. ఫలితంగా పరిశ్రమ వృద్ధి చెంది అందరికీ బీమా పథకాలు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది.

సెక్షన్ 80డీ పరిమితి పెంపు..
ప్రస్తుతం, 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D కింద తమకు, వారి జీవిత భాగస్వామికి, ఆధారపడిన పిల్లలకు లేదా తల్లిదండ్రుల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.25,000 ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపును పొందవచ్చు. తల్లిదండ్రుల వయసు 60 కంటే తక్కువ అయితే, వారి బీమా ప్రీమియం రూ. 25,000లపై ప్రత్యేక మినహాయింపూ ఉంటుంది. ఒకవేళ 60 ఏళ్లు పైబడిన వారైతే ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంది.
వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఎక్కువ హామీ మొత్తానికి బీమా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాంటప్పుడు ప్రీమియం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని సామాన్యులు కోరుతున్నారు. పైగా ఎక్కువ మంది బీమా తీసుకోవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.

జీవిత బీమా కోసం ప్రత్యేక సెక్షన్‌..
వ్యక్తిగత పాలసీదారుడు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. జీవిత బీమా ప్రీమియంలతో పాటు 80సీ కింద 'యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌'లు సహా ఇతర పెట్టుబడులు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీసీ కింద ఒక వ్యక్తి యాన్యుటీ లేదా పెన్షన్ ప్లాన్‌ల కోసం చేసే చెల్లింపులపై మినహాయింపునకు అనుమతిస్తోంది. మొత్తం మినహాయింపు పరిమితిని నిర్ణయించడానికి సెక్షన్ 80సీసీసీ కింద మినహాయింపులను కూడా 80సీతో కలుపుతున్నారు. ప్రస్తుతం, సెక్షన్ 80సీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్, జీవిత బీమా ప్రీమియంలు, ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్ ఫండ్‌లు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ సహా మరికొన్ని పెట్టుబడులపై మినహాయింపులను అనుమతిస్తోంది.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ.. 80సీ గరిష్ఠ పరిమితి తొమ్మిదేళ్లుగా రూ. 1.5 లక్షలుగానే ఉంది. ఈ నేపథ్యంలో జీవిత బీమాను ప్రజలకు మరింత చేరువచేసేందుకు సెక్షన్ 80డీ తరహాలో జీవిత బీమా ప్రీమియం మినహాయింపు కోసం ప్రత్యేక విభాగం ఉండాలని నిపుణులు కోరుతున్నారు.

పింఛను ప్లాన్‌లకూ 80సీసీడీ
జాతీయ పింఛను పథకం లో చేసే పెట్టుబడిపై రూ. 50,000 వరకు ప్రస్తుతం, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ప్రత్యేక పన్ను మినహాయింపు ఉంది. కానీ జీవిత బీమా కంపెనీలు అందించే పింఛను లేదా యాన్యుటీ ప్లాన్‌లకు (సెక్షన్ 80సీసీసీ) మాత్రం ప్రత్యేక మినహాయింపు లేదు. వాటిని సెక్షన్ 80సీ కింద ఇచ్చే రూ. 1.5 లక్షల పరిధిలోనే కలిపేశారు. అయితే, సెక్షన్ 80సీసీడీ కింద ఇచ్చే మినహాయింపును బీమా సంస్థలు అందించే పింఛను, యాన్యుటీ ప్రీమియంలకు కూడా విస్తరించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

జీఎస్‌టీ తగ్గించాలి..
భారతదేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తిని మెరుగుపరచడానికి, 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్ను ను తగ్గించడం ద్వారా బీమా పాలసీలను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావచ్చని బీమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత 18 శాతం జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడం అందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇతర బీమాలకూ మినహాయింపులు..
ప్రస్తుతం, జీవిత బీమా ప్రీమియం కోసం సెక్షన్ 80సీ కింద మినహాయింపు అందుబాటులో ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియంలకు సెక్షన్ 80డీ కింద మినహాయింపు ఇస్తున్నారు. కానీ, ప్రయాణ బీమా, గృహ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీల్లో చెల్లించే ప్రీమియంలపై మాత్రం ఎలాంటి మినహాయింపు అందుబాటులో లేదు. వీటికి కూడా పన్ను మినహాయంపులను వర్తింపజేయాలనే డిమాండ్‌ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.