ETV Bharat / business

వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ.. గ్రాట్యుటీ ఎక్కువ.. జులై 1 నుంచి కొత్త రూల్స్!

author img

By

Published : Jun 26, 2022, 12:55 PM IST

నూతన కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే కొత్త చట్టాలపై ప్రైవేటు ఉద్యోగులకు అనేక సందేహాలున్నాయి. కొత్త చట్టాల్లో ఏముంది? రోజువారీ పనివేళలు, వీక్లీఆఫ్​ల పరిస్థితేంటి? జీతం ఏమైనా తగ్గుతుందా? రిటైర్మెంట్​ తర్వాత గ్రాట్యూటీ పెరుగుతుందా? సెలవుల సంగతేంటి? ఈ సందేహలపై సమాధానాలు తెలుసుకుందాం రండి.

Key changes in take-home salary, work hours, leaves from July 1
Key changes in take-home salary, work hours, leaves from July 1

కేంద్ర ప్రభుత్వం.. జులై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా కేంద్రం మార్చింది. ఈ కొత్త చట్టాల ప్రయోజనాలు.. ప్రైవేటు రంగ కార్మికులందరికీ అందుతాయని ప్రభుత్వం చెబుతుండగా, వీటి వల్ల కార్మికులకు, ఉద్యోగులకు వాటిల్లే నష్టం ఎక్కువని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉద్యోగుల జీవితాల్లో వచ్చే ప్రధాన మార్పులేంటి? అసలు వాటి పరిస్థితేంటో చూద్దాం రండి.

రోజువారీ పని వేళలు పరిస్థితి ఏంటి?
నూతన కార్మిక చట్టాల ప్రకారం రోజువారీ పనిసమయం 12 గంటలకు పెరగనుంది. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలి. ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటలపాటు పనిచేయాలని కంపెనీలు ఉద్యోగులను కోరవచ్చు.

నాలుగు రోజులు పని చేస్తే వీక్లీ ఆఫ్​లు ఎన్ని మరి?
వారంలో నాలుగు రోజులు పనిచేస్తే 3 వీక్లీ ఆఫ్​లు ఉంటాయి. అయితే ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంటల పాటు పని చేయాలి. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారానికి ఒకటే వీక్లీ ఆఫ్‌ ఉంటుంది.

జీతం పరిస్థితేంటి? మార్పు ఏమైనా ఉంటుందా?
కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగి గ్రాస్ జీతంలో 50% బేసిక్ పే ఉండాలని చెబుతోంది. పీఎఫ్‌కు ఇచ్చే వాటా పెరుగుతుంది. దీంతో, కొంత మంది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గిపోయే అవకాశముంది.

ప్రైవేటు ఉద్యోగులకు అలవెన్సులే ఎక్కువ కదా? మరెలా?
పీఎఫ్​ వాటా పెరగడం వల్ల.. చేతికొచ్చే జీతం తగ్గబోతుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు అలవెన్సులే ఎక్కువ కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుంది. కొత్త కోడ్​ ప్రకారం 50 శాతానికి అలవెన్సు​లు మించకూడదు.

పదవీ విరమణ తర్వాత వచ్చే గ్రాట్యూటీ పెరగనుందా?
కొత్త చట్టం వల్ల కార్మికులకు పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యూటీ ఎక్కువగా లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు మెరుగైన జీవితం గడిపేందుకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

సెలవుల మంజూరులో ఏమైనా మార్పు ఉంటుందా?
నూతన కార్మిక చట్టాలతో ఏడాదిలో ఇచ్చే సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంతకుముందులాగే కొత్తగా ఉద్యోగంలో చేరినవారు 180 రోజులు దాటిన తర్వాత లీవులు పొందొచ్చు. అయితే ప్రస్తుతం 240 రోజులు దాటిన తర్వాతే సెలవులు వస్తున్నాయి.

ఈ కొత్త కార్మిక చట్టాలు అన్ని రాష్ట్రాల్లో అమలవుతాయా?
వచ్చేనెల ఒకటి నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్రం దృఢ సంకల్పంతో ఉన్నప్పటికీ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఆ మేరకు నియమ నిబంధనలను రూపొందించాయి. ఈ చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా ఈ చట్టాలను నోటిఫై చేయాల్సి ఉంటుంది.

కొత్త చట్టాలు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయా?
ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేవలం ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే.

ఇవీ చదవండి: గృహరుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

ఫారం-16 అందుకున్నారా?.. అయితే ఈ వివరాలు సరిచూసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.