'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!

author img

By

Published : Jul 29, 2022, 8:23 AM IST

gold

Gold demand 2022: ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణమండలి అంచనా వేసింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం, దిగుమతి సుంకాల పెంపు వల్ల బంగారం గిరాకీ తగ్గే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది.

Gold demand 2022: ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థిక అనిశ్చితులు, ధరల భారంతో జీవనవ్యయాలు అధికమవ్వడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం, దిగుమతి సుంకాల పెంపు వల్ల పుత్తడి ధర ఇతర దేశాలతో పోలిస్తే మరింత పెరగడం వంటివి వినియోగదారుల సెంటిమెంటును ప్రతికూలంగా మార్చే అవకాశం ఉందని తాజా నివేదికలో పేర్కొంది. అయితే రుతుపవనాలు బాగుంటాయనే అంచనాలు, పరిమిత శ్రేణిలోనే ధరల పెరుగుదల ఉండే పరిస్థితులు బంగారానికి అనుకూలించవచ్చని తెలిపింది. ఈ ఏడాది మొత్తంమీద 800 టన్నుల పసిడికి గిరాకీ లభించవచ్చని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ పీఆర్‌ సోమసుందరం తెలిపారు. 2021లో 797 టన్నుల పుత్తడికి గిరాకీ లభించిందన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ వల్ల బంగారానికి మరింత పారదర్శక విపణిగా భారత్‌ మారడమే కాక, అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

డబ్ల్యూజీసీ తాజా నివేదిక ప్రకారం..

  • ఏప్రిల్‌-జూన్‌లో దేశీయంగా 170.7 టన్నుల పసిడికి గిరాకీ లభించింది. 2021-22 ఇదే త్రైమాసిక గిరాకీ 119.6 టన్నులతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. విలువ పరంగా చూస్తే ఇది రూ.51,540 కోట్ల నుంచి 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరింది.
  • అక్షయతృతీయకు తోడు వివాహాది శుభకార్యాల కోసం 140.3 టన్నుల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. కొవిడ్‌ రెండోదశ పరిణామాల వల్ల ఇబ్బంది పడిన 2021 ఇదే త్రైమాసిక గిరాకీ 94 టన్నుల కంటే ఇది 49 శాతం అధికం. విలువ పరంగా చూస్తే రూ.40,610 కోట్ల నుంచి 60 శాతం పెరిగి రూ.65,140 కోట్లకు చేరింది.
  • ఏడాది వ్యవధిలో పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేసిన పసిడి 25.4 టన్నుల నుంచి 20% పెరిగి 30.4 టన్నులకు చేరింది. విలువ రూపేణ ఇది రూ.10,930 కోట్ల నుంచి 29 శాతం అధికమై రూ.14,140 టన్నులకు చేరింది.
  • పసిడి పునర్వినియోగం 19.7 టన్నుల నుంచి 18 శాతం పెరిగి 23.3 టన్నులుగా నమోదైంది.
  • దిగుమతులు కూడా 131.6 టన్నుల నుంచి 34 శాతం అధికంగా 170 టన్నులకు చేరాయి.
  • భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 2021 మొత్తంమీద 77 టన్నుల బంగారం కొనుగోలు చేస్తే, 2022 జనవరి-జూన్‌లో 15 టన్నులు సమీకరించింది.
  • 10 గ్రాముల బంగారం ధర ఈ ఏడాది మార్చి ఆఖరుకు రూ.43,994 అయితే, జూన్‌ చివరకు రూ.46,504కు చేరింది.

అంతర్జాతీయంగా గిరాకీ 8 శాతం తగ్గింది: ఏప్రిల్‌-జూన్‌లో అంతర్జాతీయంగా పసిడికి 948.4 టన్నుల మేర గిరాకీ లభించింది. 2021 ఇదే కాల గిరాకీ 1031.8 టన్నుల కంటే ఇది 8% తక్కువని డబ్ల్యూజీసీ వెల్లడించింది. పసిడి ట్రేడెడ్‌ ఫండ్‌ల నుంచి పెట్టుబడులు తరలిపోవడం, కేంద్రబ్యాంకుల కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణాలుగా తెలిపింది. ఔన్సు (31.10 గ్రాముల) బంగారం సగటు ధర 1816 డాలర్ల నుంచి 1870 డాలర్లకు పెరిగింది.

అనిశ్చితి నేపథ్యంలో ఆదుకుంటుందనే నమ్మకంతో పసిడిపైకి పెట్టుబడులు వస్తాయనేది సానుకూల అంచనాగా డబ్ల్యూజీసీ తెలిపింది. అయితే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతుండటం, డాలర్‌ మరింత బలోపేతం అవుతున్నందున, జులై-డిసెంబరులో పసిడి రాణించేందుకు ఆటంకాలు తప్పవని వివరించింది.

ఇవీ చదవండి: మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్​.. అపోలో నుంచి నలుగురు!

రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్​' వడ్డీ రేట్లు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.