ETV Bharat / business

ట్విట్టర్​ను మస్క్​ ఏం చేయబోతున్నాడు?

author img

By

Published : Apr 27, 2022, 8:56 AM IST

twitter elon musk news
twitter elon musk news

Elon Musk On Twitter: ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్​ మస్క్​.. ప్రముఖ సోషల్​ మీడియా నెట్​వర్క్​ ట్విట్టర్​ను కొనుగోలు చేసి సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే మూడో అతిపెద్ద కొనుగోలుగా రికార్డు సృష్టించింది. ట్విట్టర్​లో మార్పులు తెస్తానని చెప్పిన మస్క్​ ఏం చేయబోతున్నాడో చూద్దాం!​ ​

Elon Musk On Twitter: సామాజిక మాధ్యమం ట్విట్టర్​ కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ చేసిన మొత్తం ప్రపంచ సాంకేతిక రంగంలో సంచలనమే అయ్యింది. 44 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్ల)తో కుదుర్చుకున్న ఒప్పందం, అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే, మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా నిలవనుంది. ఇంతకుముందు..

  • గేమింగ్‌ సంస్థ యాక్టివిజన్‌ బిజార్డ్‌ను 68.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5.15 లక్షల కోట్ల) కు కొనుగోలు చేసే ప్రక్రియను ఈ ఏడాది జనవరిలోనే మైక్రోసాఫ్ట్‌ పూర్తి చేసింది. సాంకేతిక రంగంలో అతిపెద్ద కొనుగోలు లావాదేవీ ఇప్పటివరకు ఇదే.
  • 2015లో నెట్‌వర్క్‌ స్టోరేజీ దిగ్గజం ఈఎంసీ కార్ప్‌ను 67 బిలియన్‌ డాలర్లకు డెల్‌ కొనుగోలు చేసి, డెల్‌ టెక్నాలజీస్‌గా మారింది. ఈ లావాదేవీ రెండో అతిపెద్ద మొత్తంగా ఉంది.
  • అమెరికాలోని చిప్‌ తయారీ సంస్థ బ్రాడ్‌కామ్‌ను పోటీ సంస్థ అవాగో టెక్నాలజీస్‌ 37 బిలియన్‌ డాలర్లతో 2015లో కోనుగోలు చేయడం ద్వారా, అతిపెద్ద సెమీకండక్టర్‌ సరఫరాదారుగా మారింది. ఇప్పటివరకు ఈ లావాదేవీ టెక్‌ రంగంలో మూడో అతిపెద్దదిగా ఉండగా, ట్విట్టర్​లావాదేవీ వల్ల నాలుగో స్థానానికి చేరుతోంది.
  • 2020 అక్టోబరులో చిప్‌ తయారీ సంస్థ ఎక్స్‌లింక్స్‌ను మరో పోటీ సంస్థ ఏఎమ్‌డీ 35 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఇంటెల్‌తో పోటీపడే స్థాయికి ఏఎండీ చేరింది.
  • ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం రెడ్‌హ్యాట్‌ను 2019 జులైలో ఐబీఎం సంస్థ 34 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి, క్లౌడ్‌ సేవల రంగంలో దూసుకెళ్తోంది.

ప్రస్తుతం యథాతథంగా కార్యకలాపాలు: ట్విట్టర్​ కార్యకలాపాలు ఎప్పటిలాగానే జరుగుతాయని కంపెనీ ఛైర్మన్‌ బ్రెట్‌ టైలర్‌, సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. మస్క్‌ ఆధీనంలోకి వెళ్లాక, ట్విటర్‌ ప్రైవేట్‌ కంపెనీ కానున్న నేపథ్యంలో తొలగింపులు చోటుచేసుకుంటాయేమోనని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో సమావేశమైన పరాగ్‌ మాట్లాడుతూ 'ప్రపంచాన్నే ట్విట్టర్​ ప్రభావితం చేస్తోంది. జరుగుతున్న పరిణామాలపై మీ అందరికీ పలు అభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని గుర్తించడం ముఖ్యమే. ప్రస్తుతానికి ట్విట్టర్​ ఎప్పటి మాదిరిగానే పనిచేస్తుంది. వేతనాలు ఇప్పటి మాదిరిగానే ఉండొచ్చు. అయితే భవిష్యత్తు విధానాలు, పని సంస్కృతిపై మాత్రం హామీ ఇవ్వలేను' అని పేర్కొన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఈ లావాదేవీ పూర్తవడానికి 3-6 నెలల సమయం పట్టొచ్చని పరాగ్‌ చెబుతున్నారు. ట్విట్టర్​ బోర్డు ఏకగ్రీవంగా మస్క్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ట్విటర్‌ వాటాదార్లు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.

సీఈఓను తొలగిస్తే: నియంత్రణ మారిన 12 నెలల్లోపు సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ను తొలగిస్తే, ఆయనకు 42 మిలియన్‌ డాలర్ల పరిహారం లభించనుంది.

ట్విట్టర్​ గురించి..:

  • 2006లో జాక్‌ డోర్సె, నోగ్లాస్‌, బిజ్‌స్టోన్‌, ఎవాన్‌ విలియం నేతృత్వంలో మైక్రోబ్లాగింగ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైంది. పదహారేళ్ల ప్రాయంలో ఉన్న ట్విట్టర్​ ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లలో 6వ స్థానం పొందింది.
  • ట్విట్టర్​లో 130 కోట్లకు పైగా ఖాతాలున్నాయి.
  • 140 పదాల్లోనే తమ భావాలను ట్వీట్‌ ద్వారా వ్యక్తీకరించాల్సి ఉంది.
  • రోజుకు 19.2 కోట్ల మంది, నెలకు 39.65 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
  • ఉత్తర అమెరికాతో పాటు జపాన్‌, భారత్‌, జర్మనీలలో ట్విట్టర్​ వినియోగం ఎక్కువ.
  • ట్విట్టర్​ ద్వారా బీటూబీ మార్కెటింగ్‌ ఎక్కువగా జరుగుతుంది. 34% కొనుగోలు ఆసక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతోంది.

లాభదాయకమేనా?: ఫేస్‌బుక్‌ 2021లో 117 బి. డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. గూగుల్‌ ఇదే సమయంలో 256.7 బి. డాలర్ల ఆదాయాన్ని పొందింది. అదే ట్విట్టర్​కు వస్తే, 2021లో సంస్థ ఆదాయం 5 బిలియన్‌ డాలర్ల (రూ.37,500 కోట్లు)కు పైగా నమోదైంది. 2020లో ఆదాయం 3.72 బి. డాలర్లే. ఇపుడు మరింత ఆదాయాన్ని పొందే దిశగా ట్విట్టర్​ కదులుతోంది. రీవ్యూ (న్యూస్‌లెటర్‌ ప్లాట్‌ఫాం)ను కొనుగోలు చేయడం, ట్విట్టర్​ బ్లూ(సబ్‌స్క్రిప్షన్‌ సేవల)ను ప్రారంభించడం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకుంటోంది. మంచి భవిష్యత్‌ ఉంటుందని భావిస్తున్నారు.

ట్విటరే ఎందుకంటే?: ఇంటర్‌నెట్‌ సంక్షిప్త సందేశంగా ట్విట్టర్​ను పేర్కొంటారు. సామాజిక మాధ్యమాల్లో ఆల్ఫాబెట్‌ (గూగుల్‌, యూట్యూబ్‌ మాతృసంస్థ), మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల మాతృ సంస్థ), బైట్‌ టాన్స్‌ (టిక్‌ టాక్‌ మాతృ సంస్థ), ట్విట్టర్​లదే రాజ్యం. బ్రేకింగ్‌ న్యూస్‌, అభిప్రాయాలు, ప్రకటనలు, ట్రోలింగ్‌.. వీటన్నిటికీ ట్విట్టర్​ వారధిలా ఉంటోంది. రియల్‌ టైంలో సమాచారం, వార్తలు, సైన్స్‌, స్పోర్ట్స్‌.. ఇలా అన్నీ వినియోగదారులకు ట్వీట్‌ రూపంలో ఇస్తూ, ప్రాచుర్యంలో తిరుగులేకుండా ఉంది. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రభుత్వాలు, సెలబ్రిటిలందరూ తమ వారధిగా దీనిని వినియోగిస్తున్నారు. ట్విట్టర్​ నియంత్రణలపై మస్క్‌కు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలు కాస్తా తొలుత ఆ సంస్థలో వాటా.. తదుపరి సంస్థనే కొనుగోలు చేసేలా మస్క్‌ను నడిపించాయి.

మస్క్‌ ఏం చేయబోతున్నారు?: ట్విట్టర్​ను కొనుగోలు చేశాక మస్క్‌ ట్విట్టర్​లో కొన్నిటిని మారుస్తారని ఇప్పటికే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటంటే..

  • ట్విట్టర్​ అల్గారిథమ్‌ 'ఓపెన్‌సోర్స్‌'గా మారబోతోంది
  • వినియోగదారులు తమ ట్వీట్‌ను ఎడిట్‌ చేసుకునే, మార్చుకునే వీలుంటుంది
  • వినియోగదారుడు తన ట్వీట్‌ను ఎడిట్‌ చేస్తుంటే, ఎవరైనా ఆ మార్పును గమనించొచ్చు
  • వాక్‌ స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇదే జరిగితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్​లోకి తిరిగి వస్తారన్న అంచనాలూ ఉన్నాయి. (అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నిక సమయంలో, హింసను ప్రేరేపించారనే భావనతో ట్రంప్‌ను ట్విట్టర్​ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే.)
  • ప్రకటనలను తొలగించి, ట్విట్టర్​ వినియోగానికి రుసుము ప్రవేశపెట్టే వీలుంది.

వీటితో పాటు ట్విట్టర్​ బ్లూ వినియోగదార్లకు 'ఒక అథెంటికేషన్‌ చెక్‌మార్క్‌'ను అందించే అవకాశం ఉంది. దీని వల్ల స్పామ్‌ బాట్‌ సమస్య తీరుతుందన్నది ఆయన అభిప్రాయం. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం ఒక రేటింగ్‌ వ్యవస్థను మస్క్‌ తీసుకొస్తారన్న అంచనాలున్నాయి.

ఎప్పుడెప్పుడు.. ఎలా..

  • 2022 జనవరి 31 - మార్చి 14 మధ్య: ట్విట్టర్​లో 5 శాతం వాటా కొన్న మస్క్‌
  • మార్చి 26: కొత్త ప్లాట్‌ఫామ్‌ అవసరమంటూ మస్క్‌ ట్వీట్‌
  • ఏప్రిల్‌ 5: ట్విట్టర్​లో మస్క్‌కు బోర్డు సభ్యత్వం ఆఫర్‌
  • ఏప్రిల్‌ 10: బోర్డు సభ్యుడిగా చేరేందుకు నిరాకరించిన మస్క్‌
  • ఏప్రిల్‌ 14: ట్విట్టర్​ను 43 బిలియన్‌ డాలర్లకు కొంటామని మస్క్‌ ఆఫర్‌
  • ఏప్రిల్‌ 24: మస్క్‌తో ట్విట్టర్​ బోర్డు సంప్రదింపులు
  • ఏప్రిల్‌ 25: మస్క్‌- ట్విట్టర్​ మధ్య 44 బి.డాలర్ల ఒప్పందంపై సంతకాలు
గత పదేళ్లలో ట్విట్టర్​ ఆదాయం

ఇదీ చదవండి: ట్విట్టర్​ను అమ్మేశాం.. మన భవిష్యత్ ఏంటో తెలియదు: ఉద్యోగులతో సీఈఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.