ETV Bharat / business

ఒప్పో, వన్​ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం... కారణం 'నోకియా'!

author img

By

Published : Jul 12, 2022, 8:57 AM IST

Oppo Oneplus ban Germany: ఒప్పో, వన్​ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన నేపథ్యంలో జర్మనీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.

Etv Bharat
Etv Bharat

Oppo Oneplus ban: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఫోన్ల అమ్మకాలపై జర్మనీ నిషేధం విధించింది. ఇకపై జర్మనీలో ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్‌ అమ్మకాలు జరపకూడదని తెలిపింది. నోకియామాబ్‌.నెట్ కథనం ప్రకారం నోకియా కంపెనీ పేటెంట్‌ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్‌ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌పై జర్మనీలో నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొంది. స్థానిక న్యాయస్థానం తీర్పుతో ఒప్పో, జర్మనీ కంపెనీలు ఇక ఎప్పటికీ తమ ఉత్పత్తులను జర్మనీలో అమ్మలేవని తెలిపింది. సదరు పేటెంట్‌కు యూరప్‌ వ్యాప్తంగా నోకియా హక్కుదారు కావడం గమనార్హం. ఇంతకీ నోకియా దేనికి సబంధించిన పేటెంట్‌ కోసం ఒప్పో, వన్‌ప్లస్‌పై ఫిర్యాదు చేసింది? ఇంకా ఏయే దేశాల్లో ఈ కంపెనీలపై నోకియా వేసిన కేసులు విచారణలో ఉన్నాయనేది తెలుసుకుందాం.

నోకియా X ఒప్పో, వన్‌ప్లస్‌
నోకియా కంపెనీ 5జీ నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్‌ చేసే సాంకేతికతకు సంబంధించి పేటెంట్‌ హక్కులను కలిగి ఉంది. దీనికోసం నోకియా సుమారు 129 బిలియన్‌ యూరోల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు నోకియాతో ఒప్పందం చేసుకోకుండా, నోకియా నుంచి లైసెన్స్‌ తీసుకోకుండా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ నోకియా కంపెనీ 2021, జులైలో ఆసియా, యూరప్‌లోని పలు దేశాల్లో కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఒప్పో కంపెనీ, నోకియాతో 2018 నవంబర్‌లో చేసుకున్న ఒప్పందం 2021 జూన్‌తో ముగిసిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. ఒప్పో ఈ లైసెన్స్‌ను పునరుద్ధరించకపోగా, రెన్యువల్ ఆఫర్‌ను కూడా ఒప్పో తిరస్కరించినట్లు నోకియా ఆరోపిస్తోందని నోకియామాబ్‌ తెలిపింది.

ఒప్పో ఏమంటోంది
తాజా తీర్పు నేపథ్యంలో ఒప్పో ఒక ప్రకటన విడుదల చేసింది. "ఒప్పో తన సొంత, థర్డ్‌ పార్టీలకు చెందిన మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తుంది. మొబైల్‌ తయారీ పరిశ్రమలో పేటెంట్ లైసెన్సింగ్‌ సహకారానికి ఒప్పో కట్టుబడి ఉంది. పిటిషన్లు, లాసూట్‌లను ద్వారా లబ్ధి పొందే విధానాన్ని ఒప్పో వ్యతిరేకిస్తుంది" అని చెప్పుకొచ్చింది. తాజా తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఒప్పో చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

నోకియా కంపెనీ మరో సంస్థపై కోర్టులో కేసు గెలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా యాపిల్‌, లెనోవాలపై నోకియా లాసూట్ ఫైల్ చేసింది. వీటికి సంబంధించి రెండు బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని నోకియా కంపెనీకి చెందిన ఎన్‌ఎస్‌ఎన్‌, అల్కాటెల్‌-లూసెంట్‌ అనే సంస్థలకు యాపిల్ చెల్లించింది. తర్వాత యాపిల్‌, నోకియా కంపెనీలు కొత్త సాంకేతికత కోసం కలిసి పనిచేయడం ప్రారంభించాయి. తర్వాత ఒప్పో, నోకియా, యాపిల్ మూడు సంస్థలు కలిసి భారత్‌, అమెరికా, బ్రెజిల్‌, జర్మనీలో ఫిర్యాదు చేశాయి. ఈ వివాదానికి నాలుగు కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగింపు పలికాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.