ETV Bharat / business

చైనా కంపెనీలకు షాక్.. రూ.12వేల లోపు ఫోన్లపై నిషేధం?

author img

By

Published : Aug 9, 2022, 7:35 AM IST

CHINA MOBLIES BAN: చైనా మొబైల్ సంస్థలపై కేంద్రం కత్తిదూయనుందా?.. ఇకపై రూ.12వేల లోపు ఫోన్లు విక్రయాలపై పరిమితులు విధించనుందా? అంటే.. విశ్వనీయ వర్గాలు ఔననే అంటున్నాయి. భారత్​ రెండో అతిపెద్ద మొబైల్ విపణి కాగా.. ఈ మార్కెట్​ను కోల్పోవడం చైనా సంస్థలకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

CHINA MOBLIES BAN
CHINA MOBLIES BAN

China Mobiles ban India: దేశీయంగా అత్యధికంగా విక్రయమయ్యేవి రూ.12,000 లోపు (150 డాలర్లు) సెల్‌ఫోన్లే. స్థానికంగా అస్లెంబ్లింగ్‌/తయారీ చేపట్టిన దేశీయ సంస్థలు కూడా ఈ మోడళ్లే రూపొందిస్తుంటాయి. అయితే షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా సంస్థల దూకుడుతో, దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌ వంటివి మనుగడకు కష్టపడుతున్నాయి. విడిభాగాలు సహా, ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు పోటీ ఇవ్వలేక, పలు దేశీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపేస్తున్నాయి.

అందుకే దేశీయ తయారీదార్లను కాపాడుకునేందుకు వీలుగా రూ.12,000లోపు విభాగంలో చైనా సంస్థల ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా పరిమితులు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ విపణి అయిన మన దేశంలో, ఈ విభాగాన్ని కోల్పోవాల్సి వస్తే చైనా కంపెనీలకు శరాఘాతమే అవుతుంది. దేశీయంగా విక్రయమయ్యే ఈ ఫోన్లలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. చైనా సంస్థల తీరు పారదర్శకంగా లేదని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల పేర్కొనడం గమనార్హం.

ఏం జరగనుంది?
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తుందా.. లేదంటే అనధికారికంగా ఈ విషయాన్ని చైనా కంపెనీలకు చేరవేస్తుందా.. అనేది వెల్లడవ్వాల్సి ఉందని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

రూ.12,000 లోపు ఫోన్లు ఇక్కడ విక్రయించవద్దని చైనా సంస్థలను కట్టడి చేస్తే, షియామీ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు ఈ ఏడాది 11-14 శాతం (2-2.5 కోట్లు) తగ్గే అవకాశం ఉందన్నది మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ విశ్లేషణ. షియామీ తయారు చేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో 66 శాతం వరకు 150 డాలర్ల కంటే ధర తక్కువగా ఉండేవే.

పన్ను అధికారుల దాడుల అనంతరమే
షియామీతో పాటు ఒపో, వివో సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై అనుమానాలతో, పన్ను అధికారులు దాడులు నిర్వహించి, వేల కోట్ల రూపాయలకు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. నగదును విదేశాలకు అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఈ కంపెనీలపై నమోదయ్యాయి. గతంలో హువావే టెక్నాలజీస్‌ కంపెనీ, జెడ్‌టీఈ కార్ప్‌కు సంబంధించిన టెలికాం పరికరాలను దేశీయంగా విక్రయించవద్దని నిషేధం విధించినపుడు కూడా, ప్రభుత్వం ఎలాంటి అధికారిక విధానాన్ని తీసుకురాలేదు. అయితే ఈ పరికరాల కొనుగోళ్లలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించింది. యాపిల్‌ సంస్థ తయారు చేసే ఐఫోన్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. శామ్‌సంగ్‌కూ పెద్ద ఇబ్బంది ఉండదు.

తగ్గిన షేరు
ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్ల విక్రయంపై భారత్‌లో నిషేధం విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో షియామీ షేరు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్‌లో సోమవారం 3.6 శాతం నష్టపోయింది. ఈ ఏడాది లోఇప్పటికే ఈ షేరు 35 శాతం వరకు క్షీణించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.