ETV Bharat / business

హోమ్​ లోన్లకు గిరాకీ.. ఐదేళ్లలో రూ.48లక్షల కోట్లకు విపణి

author img

By

Published : Aug 9, 2022, 6:37 AM IST

Home loan SBI Research: గృహ రుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ లభిస్తోంది. గత ఏడాది కాలంలో దేశంలోని ప్రధాన నగరాల కంటే చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని 'ఎస్​బీఐ రీసెర్చ్' నివేదికలో వెల్లడైంది. మహిళలు సైతం అధికంగా రుణాలు తీసుకుంటున్నారు.

home loan sbi research
home loan sbi research

SBI Research report Home loan: గృహ రుణాలకు దేశంలోని మూడు, నాలుగో శ్రేణి పట్టణాల నుంచి అధిక గిరాకీ ఉన్నట్లు 'ఎస్‌బీఐ రీసెర్చ్‌' తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ.24 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న గృహ రుణాల విపణి, అయిదేళ్లలో రెట్టింపై రూ.48 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల మొత్తం 10 శాతం అధికమైంది. బ్యాంకుల రుణాలు ఈ ఏడాది జూన్‌లో 14.4 శాతం పెరిగాయి. వ్యక్తిగత/ రిటైల్‌ రుణాల్లో 50 శాతం గృహ రుణాలే ఉంటున్నాయి.

మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, దిల్లీ ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, అహ్మదాబాద్‌, పుణె నగరాలకు మొదటి శ్రేణి జిల్లాలుగా ఈ నివేదిక వర్గీకరించింది. రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను ద్వితీయ శ్రేణి జిల్లాలుగా పేర్కొంది. మిగిలిన చిన్న నగరాలు, పట్టణాలను 3-4 శ్రేణి జిల్లాలుగా పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. గ్రామీణ, సెబీ-అర్బన్‌ ప్రాంతాల్లో గృహ నిర్మాణం పెరగడంతో గృహ రుణాలకు గిరాకీ హెచ్చినట్లు ఈ నివేదిక విశ్లేషించింది.

చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
గత ఏడాది కాలంలో దేశంలోని ప్రధాన నగరాల కంటే చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖపట్నం, గౌహతి, రాయ్‌పూర్‌, సూరత్‌, వదోదర, జైపూర్‌, లఖ్‌నవూ, డెహ్రాడూన్‌, తృతీయ శ్రేణి నగరమైన కోయంబత్తూర్‌లలో ఇళ్ల ధరలు అధికంగా పెరిగాయి.

  • ఇంటి నుంచి పనిచేయడం, ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు పనిచేయడం (ఫ్రీ-ల్యాన్స్‌ జాబ్స్‌) వంటి ధోరణులతో చిన్న పట్టణాల్లో ఇళ్లకు గిరాకీ పెరిగింది.
  • మహిళలూ గృహ రుణాలు అధికంగా తీసుకుంటుంన్నారు.

గృహ రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న మూడు, నాలుగో శ్రేణి జిల్లాల్లో పంజాబ్‌, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అధికంగా ఉన్నాయి. గృహ రుణ మొత్తం సగటున రూ.30 - 50 లక్షలు; రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉంటోంది.

చైనాలో ఎదురైన పరిస్థితి తలెత్తకుండా: చైనాలోని అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో అక్కడ గృహ నిర్మాణం, గృహ రుణాల మార్కెట్లో సంక్షోభం నెలకొంది. అక్కడి బ్యాంకులకు దాదాపు 350 - 500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27.65-39.50 లక్షల కోట్ల) తనఖా రుణాలు రానిబాకీలుగా మారే ప్రమాదం తలెత్తింది. దీనివల్ల ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. మనదేశంలో ఇటువంటి ముప్పు తలెత్తకుండా, 'రేరా' చట్టం కాపాడుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఈ చట్టం వల్ల స్థిరాస్తి సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉన్నందున, కొనుగోలుదార్లకు భద్రత కలిగినట్లు వివరించింది. అన్ని స్థిరాస్తి ప్రాజెక్టులు తప్పనిసరిగా 'రేరా' చట్టం కింద నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.