ITR Filing: ఆదాయపు పన్ను.. ఏ ఫారం.. ఎవరి కోసం?

author img

By

Published : Sep 4, 2021, 1:00 PM IST

ITR Filing
ITR Filing ()

2020-21 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను(ITR Filing) సమర్పించేందుకు సెప్టెంబర్​ 30 చివరి తేదీ. అయితే ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి పలు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి ఎన్ని రకాలో ఇప్పుడు చూద్దాం..

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR Filing) దాఖలు చేయాల్సిన సమయం ఇది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఈ గడువు సెప్టెంబరు 30. అయితే, చివరి నిమిషంలో హడావుడి పడకుండా.. ముందే రిటర్నులు సమర్పించడం ఎంతో అవసరం. చాలామంది తమ రిటర్నులను దాఖలు(ITR Filing) చేసేందుకు ఏ ఫారం వినియోగించాలని సందేహిస్తుంటారు. ఏ ఫారం ఎవరికి వర్తిస్తుంది.. ఎవరు ఉపయోగించకూడదో తెలుసుకుందాం..

ఐటీఆర్‌-1: భారతీయ పౌరులై, రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్‌-1ను ఉపయోగించేందుకు వీలుంటుంది. అయితే, మూలధన లాభం (క్యాపిటల్‌ గెయిన్స్‌) ఉండకూడదు. దీంతోపాటు వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభం/నష్టం వచ్చినప్పుడూ ఈ ఫారం ఉపయోగించడానికి వీల్లేదు. వేతనం ద్వారా ఆదాయం, ఒక ఇంటి నుంచి ఆదాయం, ఇతర మార్గాల ద్వారా (వడ్డీ) ఆదాయంలాంటివి ఉన్నప్పుడే ఐటీఆర్‌-1 ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వేతనం ద్వారా ఆదాయం కాకుండా.. వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించి, అందులో ఖర్చులను చూపించాలనుకున్నప్పుడు ఐటీఆర్‌-1 వర్తించదు.

ఐటీఆర్‌-2: ఐటీఆర్‌ -1 ఫారం వర్తించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఐటీఆర్‌-2ని వినియోగించవచ్చు. వ్యాపారం, వృత్తిద్వారా ఆదాయం ఆర్జించే వారికి ఇది సరిపోదు. డివిడెండ్లు, ఇతర ఆదాయాలు వచ్చిన వారూ ఈ ఫారాన్ని వినియోగించేందుకు వీలుంది. కొంతమంది షేర్ల నుంచి వచ్చిన లాభాలను ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఇది పొరపాటు.

ఐటీఆర్‌ 3: ఇది కాస్త క్లిష్టమైన ఫారం. వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు ఈ ఫారంలో తమ రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ.50లక్షలు దాటినప్పుడూ ఈ ఫారాన్ని వాడాల్సి ఉంటుంది. క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్నవారూ.. ఈ ఫారాన్ని వినియోగించవచ్చు. దీన్ని సొంతంగా పూర్తి చేయడం కాస్త కష్టమే. కాబట్టి, నిపుణులను సంప్రదించడం మేలు.

ఐటీఆర్‌-4: దీన్నే సుగమ్‌ అనీ పిలుస్తారు. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, భాగస్వామ్య సంస్థలు అంచనా ఆధారంగా ఆదాయాన్ని పేర్కొనే వారు ఈ ఫారాన్ని వినియోగించుకోవచ్చు.
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం ఒక్కటే కాదు.. వాటిని సరైన ఫారాల్లోనే దాఖలు చేయాలి. లేకపోతే అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.