ETV Bharat / business

కరోనా కాలంలో అప్పు కావాలా? ఇవి తెలుసుకోండి...

author img

By

Published : Apr 6, 2020, 4:04 PM IST

కరోనా.. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న వైరస్‌ ఇది. చాలామంది ఆర్థిక పరిస్థితినీ తలకిందులు చేసింది. ఉద్యోగుల వేతనాల్లో కోత, వ్యాపారాలు సాగక, పనులు దొరకక అసంఘటిత రంగాల్లోని వారికి ఆదాయం తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. చేతిలో అత్యవసర నిధి ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా.. లేని వారికి ఇప్పుడు అప్పు చేయక తప్పని పరిస్థితి. మరి, ఈ సమయంలో ఎక్కడ, ఎలాంటి అప్పులు లభిస్తాయి. వాటిని ఎలా తీసుకోవాలి? ఓసారి చూద్దాం..

DEBT POLICIES
'ఎలాంటి అప్పు అయితే బాగుంటుందో తేల్చుకోండి!'

వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో ఇచ్చే వ్యక్తిగత రుణం, వేతన ఖాతా ఉన్నవారికి ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా అప్పు తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ అవసరాలు, నగదు లభ్యత చూసుకొని అప్పు చేయాలా, వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి.

క్రెడిట్‌ కార్డు రుణం..

క్రెడిట్‌ కార్డు సంస్థలు ఎంపిక చేసిన కార్డుదారులకు అప్పును మంజూరు చేస్తాయి. వెబ్‌సైటులో లేదా కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఎంత మేరకు అప్పు వస్తుందో తెలుసుకోవచ్చు. అవసరమైతే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్పు కావాలని అడిగిన 2-3 రోజుల్లో మీ ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. ప్రాసెసింగ్‌ ఖర్చులు ఉన్నప్పటికీ.. ఎటువంటి ఇతర పత్రాలు అవసరం ఉండదు. మిగిలిన బ్యాంకు అప్పులతో పోలిస్తే వడ్డీ ఎక్కువ. ఏదైనా కారణం వల్ల సమయానికి వాయిదా చెల్లించకపోతే అపరాధ రుసుములు అధికంగానే ఉంటాయి.

  • ఈ కార్డు ద్వారా నగదు తీసుకోవడం చాలా సులువు. కార్డు మీద ఇచ్చిన పరిమితిలో 20-30శాతం వరకూ నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. కార్డును వాడి, ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. నగదును విత్‌డ్రా చేసుకున్నప్పుడు కొంత రుసుముతోపాటు, సుమారు 36 శాతం వరకూ వార్షిక వడ్డీ విధిస్తారు. ఖర్చులు ఎక్కువ కాబట్టి, ఇతర అవకాశాలేమీ లేని అత్యవసర సమయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి.

వేతన ఖాతాతో..

ఉద్యోగం చేసే వారికి వేతన ఖాతా ఉంటుంది. ఇలాంటి ఖాతాలున్న వారికి చాలా బ్యాంకులు 2-3 నెలల జీతం వరకూ ఓవర్‌డ్రాఫ్ట్‌గా వాడుకునే వీలును కల్పిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలాంటి వాటిల్లో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌ లేదా ఏటీఎం ద్వారా వెంటనే పొందవచ్చు. ఇలా తీసుకున్న మొత్తాన్ని 6-12 నెలల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ కాబట్టి, వడ్డీ ఎక్కువగా ఉన్నా.. మీరు తీసుకున్న మొత్తానికే వడ్డీ విధిస్తారు. కొన్ని బ్యాంకులు వీటిపై ప్రాసెసింగ్‌ ఖర్చులనూ వసూలు చేస్తున్నాయి.

SOME MORE GOOD DEBT POLICIES AND THEIR PROCESSE
బ్యాంకుల వడ్డీరేట్ల వివరాలు

వ్యక్తిగత రుణం కోసం..

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు మిగతా హామీ లేని రుణాలతో పోలిస్తే కాస్త వడ్డీ తక్కువగానే ఉంటుంది. తిరిగి చెల్లించేందుకూ ఎక్కువ సమయం ఇస్తారు.

  • క్రమం తప్పని ఆదాయం ఉన్నవారందరూ ఈ రుణాలను తీసుకునేందుకు అర్హులు. ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఫారం-16 తప్పనిసరి. బ్యాంకులను బట్టి ఇతర అర్హతలు మారినా, రుణ గ్రహీత వయసు, ఆదాయపన్ను రిటర్నుల ప్రకారం ఆదాయం, ఉద్యోగం చేసే సంస్థ లేదా వృత్తి, సిబిల్‌ స్కోరులాంటివి తప్పనిసరిగా పరిశీలిస్తారు. సిబిల్‌ స్కోరు 600కన్నా తక్కువగా ఉంటే అప్పు వచ్చే అవకాశాలు తక్కువ. వేతన ఖాతా ఉన్న వారికి కొన్ని నిబంధనలలో వెసులుబాటుతోపాటు, వడ్డీ తగ్గవచ్చు. పింఛను తీసుకునే వారూ అర్హులే.
  • అవససం ఏమిటన్నది అడగకుండానే అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. మిగిలిన అప్పులు కావాలంటే ఏదైనా హామీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ, ఎలాంటి తనఖాలు, హామీలు లేకుండా.. మార్జిన్‌తో నిమిత్తం లేకుండా ఈ అప్పు తీసుకోవచ్చు.
  • కనీసం రూ.25,000 నుంచి మొదలుకొని 24 నెలల ఆదాయం వరకూ అప్పు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో 27 నెలల ఆదాయం వరకూ ఇస్తారు. చాలా బ్యాంకులు వారి దగ్గర వేతన ఖాతా ఉన్న వారికే రుణం ఇస్తాయి. ఎస్‌బీఐలాంటివి నిబంధనలకు లోబడి తమ వద్ద వేతన ఖాతా లేని వారికీ రూ.20లక్షల వరకూ రుణం ఇస్తున్నాయి.
  • అప్పు తీసుకున్న తర్వాత నుంచి 12-84 నెలలపాటు వాయిదాలు చెల్లించాలి. వ్యవధికి ముందే రుణం తీర్చాలనుకుంటే.. ముందస్తు చెల్లింపు రుసుము విధిస్తారు. వాయిదాలు సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది.
  • ఈ రుణాలకు ఎలాంటి హామీ ఉండదు కాబట్టి, వడ్డీ ఎక్కువగా ఉంటుంది. సిబిల్‌ స్కోరు బాగుంటే వడ్డీలో కొంత రాయితీ రావచ్చు. వడ్డీ మాత్రమే కాకుండా ఇతర నిబంధనలు, ప్రాసెసింగ్‌ ఫీజు, ముందస్తు చెల్లింపు రుసుములను చూసి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు అన్ని బ్యాంకుల అప్పు వివరాలను అందిస్తున్నాయి. వీటిని ఒకసారి పరిశీలించి, దరఖాస్తు చేసుకోవడం మంచిది.
  • అన్ని పత్రాలు ఇచ్చిన తర్వాత 2-7 పనిదినాల్లో రుణం మంజూరవుతుంది. చాలా బ్యాంకుల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో ఇదివరకే అప్పు తీసుకున్న వారికి టాపప్‌ రుణం అందిస్తున్నాయి. ఈ తరహావి త్వరగా అందుతాయి.
  • అసంఘటిత రంగంలో పనిచేసే వారికీ కొన్ని ప్రముఖ బ్యాంకులు వ్యక్తిగత రుణాలను ఇస్తున్నాయి. లావాదేవీలను బట్టి, ఎంత రుణానికి అర్హులో బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా అందిస్తాయి. కొన్ని బ్యాంకులు యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి.
  • ఇప్పటికే క్రెడిట్‌ కార్డు ద్వారా లేదా వేతన ఖాతాలో ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకొని, ఎక్కువ వడ్డీ చెల్లించే వారు.. తక్కువ వడ్డీకి లభించే వ్యక్తిగత అప్పులు తీసుకొని, వాటిని పూర్తిగా చెల్లించవచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
  • అత్యవసరంగా డబ్బు కావాలనుకుంటే.. బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణం తీసుకోవచ్చు. పసిడి విలువలో 70 శాతం వరకూ ఇస్తారు. సిబిల్‌ స్కోరుతో పనిలేదు. ఆదాయ వివరాలూ అడగరు. ఇతర రుణాలతో పోలిస్తే.. దీనిపై వడ్డీ తక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. రుసుములూ అంత ఎక్కువగా ఉండవు. నెలనెలా వడ్డీ చెల్లిస్తే రుణం అధికంగా వస్తుంది.

- ఫణి శ్రీనివాసు, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

ఇదీ చదవండి: 28 శాతం తరిగిపోయిన ముకేశ్​ అంబానీ ఆస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.