ETV Bharat / business

కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు!

author img

By

Published : Oct 10, 2021, 3:42 PM IST

దేశంలో వంట నూనెల ధరల మంటకు చెక్​ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితిలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనితో త్వరలోనే ధరలు సాధారణ స్థాయికి దిగిరావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Cooking oil prices now
వంట నూనెలు

దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ.. వ్యాపారుల వద్ద నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. 2022 మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.

'కేంద్రం తాజా నిర్ణయంతో వంట నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించే విషయం' అని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిల్వలు ఎంత? వాటిని ఎలా వినియోగిస్తున్నారు అనే అంశాలను పరిగణించి పరిమితులపై నిర్ణయం తీసుకోవాలని ఇందులో సూచించింది కేంద్రం.

ఇప్పటికే ఎన్​సీడీఈఎక్స్​ ప్లాట్​ఫామ్​పై..మస్టర్డ్​ ఆయిల్ ట్రేడింగ్​ అక్టోబర్​ 8 నుంచి నిలిపివేశారు.

వారికి మినహాయింపు..

అయితే కొంతమంది ఎగుమతి, దిగుమతిదారులకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం. డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్ ట్రేడ్​.. ఎక్స్​పోర్టర్​- ఇంపోర్టర్​ కోడ్​ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది.

చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే.. ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్​లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలని కేంద్రప్రభుత్వం వెబ్​సైట్​లో అప్​డేట్​ చేయాలని కోరింది.

ప్రస్తుత ధరలు ఇలా..

  • దేశంలో సన్​ ఫ్లవర్​ నూనె లీటర్​.. సగటున ప్రస్తుతం రూ.170.09గా ఉంది. గత ఏడాది (రూ.122.82)తో పోలిస్తే ఇది 38.48 శాతం ఎక్కువ.
  • పామ్​ ఆయిల్​ ధర కూడా 38 శాతం పెరిగి రూ.132.06 వద్దకు చేరింది. గత ఏడాది అక్టోబర్​లో దీని ధర రూ.95.68గా ఉంది.
  • సోయా నూనె సగటు ధర అక్టోబర్​ 9 ప్రకారం.. లీటర్​కు రూ.154.95 వద్ద ఉంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 45.15 శాతం ఎక్కువ. 2020 అక్టోబర్​లో ఈ నూనె రూ.106గా ఉంది.

ఈ స్థాయి ధరలు ఎందుకు?

దేశీయంగా వంట నూనెల ధరలు కేవలం ఏడాది కాలంలో 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా సరఫరా తగ్గటం వంటివి ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి: ఫ్లిప్​కార్ట్​ ఆఫర్లకు​ నేడే లాస్ట్​​.. త్వరపడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.