ETV Bharat / business

రిలయన్స్‌ 'ఆర్‌-గ్రీన్​'‌ కిట్​తో 2గంటల్లో రిజల్ట్!‌

author img

By

Published : Oct 2, 2020, 5:39 PM IST

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్​కు చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్.. సరికొత్త ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం 2 గంటల్లోనే ఫలితాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. దీనికి ఆర్​-గ్రీన్​ అని పేరు పెట్టింది. ఈ కిట్​ను ఐసీఎంఆర్​ అనుమతి కోసం పంపించింది.

Reliance develops RT-PCR kit that can give COVID-19 results in 2hrs
రిలయన్స్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్​తో 2గంటల్లో రిజల్ట్!‌

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో.. వ్యాపార దిగ్గజం రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్.. ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం 2 గంటల్లోనే ఫలితాలను పొందవచ్చని సంస్థ తెలిపింది.

సార్స్‌ కోవ్‌-2ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశ్వసనీయ పరీక్ష విధానం ఆర్‌టీ- పీసీఆర్‌(రియల్‌ టైమ్‌ రిజర్వ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలీమెర్సీ చైన్‌ రియాక్షన్‌). ఈ పరీక్షల్లో ఫలితం రావడానికి 24గంటల సమయం పడుతుంది. అయితే, ప్రస్తుతం రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌(ఆర్‌ఏటీ)ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. 15-30 నిమిషాల్లో దీని ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఈ విధానంలో కొన్ని లోపాలు ఉన్నా, దీన్నే విస్తృతంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రత్యేకంగా ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ఆర్‌-గ్రీన్‌ కిట్‌గా నామకరణం చేశారు.

దీని పనితీరు, నాణ్యతను విశ్లేషించేందుకు ఇప్పటికే ఐసీఎంఆర్‌కు పంపగా, అక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై ఐసీఎంఆర్‌ ఇంకా స్పందించలేదు. అదే సమయంలో వినియోగానికి అనువుగా ఉంటుందన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వలేదు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆర్‌-గ్రీన్‌ కిట్‌ 98.7శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని వెల్లడించినట్లు సమాచారం. పరీక్ష ఫలితం రావడానికి మాత్రం 2 గంటల సమయపడుతుంది. ఇక రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ చేసిన మరో అధ్యయనం ప్రకారం 2020 చివరి నాటికి దేశంలో కరోనా వల్ల మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలిపింది.

ఇదీ చూడండి: కరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.