ETV Bharat / business

'2047 కల్లా అమెరికా సరసన భారత్‌'

author img

By

Published : Jul 25, 2021, 7:02 AM IST

స్వాతంత్య్ర దినోత్సవ శత వసంతాల (100వ) నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల సరసన భారత్‌ నిలుస్తుందనే విశ్వాసాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తం చేశారు. 3 దశాబ్దాల నుంచి అమలవుతున్న ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని ప్రజలందరికీ  సమానంగా దక్కలేదని ఆయన పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల్లోనూ సంపద సృష్టి జరిగేలా ఓ భారతీయ నమూనాను అభివృద్ధి చేయాలని ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ముకేశ్‌ పేర్కొన్నారు.

mukesh ambani
ముకేశ్​ అంబానీ

అట్టడుగు వర్గాల్లోనూ సంపద సృష్టి జరిగేలా ఓ భారతీయ నమూనాను అభివృద్ధి చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆకాంక్షించారు. 3 దశాబ్దాల నుంచి అమలవుతున్న ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని ప్రజలందరికీ సమానంగా దక్కలేదని తెలిపారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఆర్థిక సంస్కరణల అమలు తీరుపై ముకేశ్‌ భావనలివీ..

సంస్కరణల వల్లే

దేశ ఆర్థిక వ్యవస్థ దిశ, గమ్యాన్ని మార్చేలా సాహసోపేత, దూరదృష్టితో కూడిన నిర్ణయాలను 1991లో భారత్‌ తీసుకుంది. నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రభుత్వ రంగానికి సమానంగా ప్రైవేట్‌ రంగానికి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కల్పించింది. లైసెన్స్‌ రాజ్‌కు చరమగీతం పాడింది. వాణిజ్య, పారిశ్రామిక విధానాలను సరళీకరించింది. కేపిటల్‌ మార్కెట్‌లు, ఆర్థిక రంగాల్లో సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు వ్యాపార సామర్థ్యాలను పెంపొందించే ఇంధనంగా ఉపయోగపడ్డాయి. వేగవంత వృద్ధి శకానికి నాంది పలికాయి. ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేందుకూ ఇవి తోడ్పడ్డాయి. 1991లో 88 కోట్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 138 కోట్లకు పెరిగినప్పటికీ.. పేదరికం రేటు సగానికి సగం తగ్గిందంటే అది సంస్కరణల చలవే.

జీడీపీ 10 రెట్లు పెరిగింది

1991లో దేశ జీడీపీ 26,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటే, ఇప్పుడు 10 రెట్లకు మించి 2.87 లక్షల డాలర్ల స్థాయికి చేరింది. విదేశీ మారక ద్రవ్యం కోసం వెతుకులాడే పరిస్థితి నుంచి 61,200 కోట్ల డాలర్ల నిల్వలు ఏర్పడ్డాయి. 2051 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరూ సిరిసంపదలతో తులతూగేలా ఆర్థిక సమానత్వమున్న దేశంగా ఎదగడంపై ఇప్పుడు భారత్‌ దృష్టి పెట్టాలి.

ఎదురుచూపులకు చరమగీతం

కీలక మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పుడు మన దగ్గర ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయి. ఎన్నో పరిశ్రమలు, సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు టెలిఫోన్‌ లేదా గ్యాస్‌ కనెక్షన్‌ కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. కంపెనీలు ఒక కంప్యూటరు కొనాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు కోరుకున్న వెంటనే ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. నిజంగా ఆ సమయంలో ఇవన్నీ మాకు ఊహకు కూడా అందని మార్పులే.

పెద్ద కలలు కనడం నేర్చుకున్నాం

పెద్ద పెద్ద కలలు కనాలి.. వాటిని నిజం చేసుకోవాలనే విషయాన్ని గత మూడు దశాబ్దాల్లోని అనుభవాలు మనకు నేర్పించాయి. మనం ఇప్పుడు కనాల్సిన పెద్ద కల ఏమిటంటే.. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి అంటే 2047 కల్లా ప్రపంచంలోని మూడు అగ్రగామి దేశాల్లో మనం దేశం ఉండేలా చేయాలి. అమెరికా, చైనాల అంత ధనిక దేశంగా భారత్‌ అవతరించేందుకు కృషి చేయాలి. ఇది సాధ్యం కావాలంటే ప్రపంచంతో కలిసి నడుస్తూనే, స్వయం సమృద్ధిని సాధించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు ఆర్థిక సంస్కరణల ఫలాలు అందరికీ సమానంగా దక్కలేదు. ఈ అసమానతలను అంగీకరించకూడదు.. మున్ముందూ కొనసాగకూడదు. ఆర్థిక వ్యవస్థ కింద ఉన్న వర్గంలోనూ సంపద సృష్టించే భారతీయ విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి.

సంతోషమే.. నిజమైన సంపద

ఎన్నో ఎళ్లుగా మనం సంపదను వ్యక్తిగత, ఆర్థిక కోణంలోనే చెబుతూ వస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, నివాసం, పర్యావరణ భద్రత, క్రీడలు, సంస్కృతి, కళలు, స్వయం సమృద్ధి అవకాశాలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి సంతోషంలోనే నిజమైన సంపద దాగి ఉంది. ఇది సాధ్యం కావాలంలే ఐశ్వర్యం, సంరక్షణ ప్రమాణాలను పునఃనిర్వచించి.. ఆ మార్పులను వ్యాపారాలు, సమాజంలో తీసుకు రావాలి.

ఆవిష్కరణలకు గమ్యస్థానం

విపణులను విస్తరిస్తే ఏ దేశమైనా సంపదపరంగా ఉన్నతం అవుతుంది. ఒక ఖండం అంత విశాలంగా ఉండటం మన దేశానికి ఓ గొప్ప వరం. దేశంలోని 100 కోట్ల వరకు ఉన్న మధ్యతరగతి ఆదాయాలు పెరిగితే వృద్ధి పరంగా మనం అద్భుతాలే చేయొచ్చు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్‌ నాయకత్వం వహిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. వ్యవసాయం, ఎంఎస్‌ఎమ్‌ఈలు, నిర్మాణరంగం, పునరుత్పాదక ఇంధనం, కళలు లాంటి వాటికీ సాంకేతికత రూపుతేవడాన్ని వేగవంతం చేయాలి. ఆవిష్కరణలకు గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దాలి. ఆధునిక సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలకు కృషి చేస్తే.. వేగవంత వృద్ధికి అవి ఉపయోగపడతాయి. అధిక నాణ్యత కలిగి, అత్యంత చౌక ఉత్పత్తులు, సేవలను కంపెనీలు అందించేందుకు ఈ ఆవిష్కరణలు దోహదపడతాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.