ETV Bharat / business

పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్​.. వరాలిస్తారా?

author img

By

Published : Jan 31, 2022, 5:01 AM IST

Updated : Jan 31, 2022, 7:03 AM IST

Union Budget Expectations: ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్​లో పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తిచేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొందని చెప్తున్నారు.

budget
పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్​ కసరత్తు.. వరాలిస్తారా?

Union Budget Expectations: కేంద్ర బడ్జెట్టు పై అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు, ఆకాంక్షలు ఉన్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం తనకున్న పరిమితుల మేరకు ప్రతిపాదనలకు తుదిరూపునివ్వనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవచ్చనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా, పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తిచేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయసభల సభ్యులనుద్దేశించే చేసే ప్రసంగంతో రెండు విడతల సమావేశాలకు నాంది పడుతుంది. తొలివిడత ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, మలి విడత మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ఈ పత్రం భవిష్యత్తు వేగాన్ని చాటిచెప్పనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె తన నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఎన్నెన్నో ఆశలు

గత రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొంది. గత రెండేళ్లలో ఉన్నత వర్గాల ఆదాయాలు పెరిగి, మధ్య తరగతి నుంచి కిందిస్థాయి వర్గాల ఆదాయాలు పడిపోయినట్లు గణాంకాలు చెబుతుండటంతో అల్పాదాయ వర్గాలు ఆర్థిక చేయూత కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాయి. కేంద్రం నుంచి ఏం వరాలు కురుస్తాయా? అని ప్రజలు ఆశిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలపై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌తో ప్రతిపక్షాలపై నిఘాకు కేంద్రం కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు అదే అంశంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని పట్టుబట్టేందుకు సిద్ధమయ్యాయి.

నిలదీతకు సిద్ధంగా ఏకతాటిపైకి

నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, సరిహద్దుల్లో చైనా చొరబాట్లపైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి భావసారూప్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. నిర్మలా సీతారామన్‌ 2020-21లో రూ.30,42,230 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2019-20 అంచనాలకంటే ఇది 10% అధికం. 2021-22లో రూ.34,83,236 కోట్ల పద్దును తీసుకొచ్చారు. ఇది ముందు సంవత్సరం కంటే 14.49% ఎక్కువ. ఇప్పుడు కూడా సగటున అదే స్థాయిలో బడ్జెట్‌ పరిమాణం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.

అప్పులు కూడా పెరుగుతాయి

మహమ్మారి చుట్టుముట్టినా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్లు ఆశ్చర్యకర రీతిలో పెరిగాయి. పెరిగిపోయిన అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అప్పులను కూడా అదే స్థాయిలో చేయక తప్పని పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త బడ్జెట్‌లోనూ బహిరంగ మార్కెట్‌ రుణాలు రూ.12 లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. తాజా ఆర్థిక సంవత్సరం చివరినాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు 6.8%కి చేరవచ్చన్నది అంచనా. కేంద ప్రభుత్వ మధ్యకాలిక ఆర్థిక విధానం ప్రకారం 2026 నాటికి దీన్ని 4.5%కి తేవాలన్నది లక్ష్యం. ఏటా 60 బేసిస్‌ పాయింట్లు తగ్గించుకోవాలన్నది లెక్క. ఈ లెక్కన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును 6.3%కి పరిమితం చేయడానికి ప్రయత్నించవచ్చని అంచనా.

వినూత్న సంస్కరణలకు అవకాశం లేనట్లే

సంక్షేమ పథకాలపై కేంద్రం చేస్తున్న ఖర్చును దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈసారి వినూత్న సంస్కరణల జోలికి పోయే అవకాశం ఉండదని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక వృద్ధిరేటుతో ముందుకు సాగుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్‌ ఆ పేరును నిలబెట్టుకోవడానికి వీలుగా ఆర్థిక మంత్రి ఆర్థిక వృద్ధి, ఆర్థిక సంఘటితత్వానికి ప్రాధాన్యం ఇవ్వడానికే మొగ్గుచూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదిలా 14% వృద్ధితో ప్రవేశపెడితే బడ్జెట్‌ రూ.39.6 లక్షల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు.

ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకపోవచ్చు!

గత రెండేళ్ల పద్దులను బట్టిచూస్తే కొత్త బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యయ పద్దును రూ.39 లక్షల కోట్లుగా చూపే సూచనలు కనిపిస్తున్నాయి. వేతన జీవులు, వివిధ పారిశ్రామిక వర్గాలు నిర్మలా సీతారామన్‌ నుంచి ఎక్కువ ప్రయోజనాలను ఆశిస్తున్నప్పటికీ ఆమె మాత్రం రక్షణాత్మక ధోరణిలోనే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార రాయితీ, ఎరువుల రాయితీ, ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్‌లాంటి పథకాలకు భారీ మొత్తాల్లో కేటాయింపులు జరపాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి పోయే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ, నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌, నగదీకరణ, బ్యాడ్‌బ్యాంక్‌లపై దృష్టి సారించినందున ఈ బడ్జెట్‌ వాటి దృష్టి కోణంలోనే సాగొచ్చని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ హైడ్రోజెన్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకూ చేయూతనిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

200 కి.మీ. వేగంతో సెమీ హైస్పీడ్‌ రైళ్లు

గంటకు 180-200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్‌ రైళ్లను ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా. స్వర్ణ చతుర్భుజి మార్గంలో వీటిని నడిపేందుకు వీలుగా కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే 75 వారాల్లో 75 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెడతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 15న ప్రకటించినందున వాటిపైనా ప్రత్యేక ప్రకటన ఉండొచ్చని అంచనా. అందుబాటులోని వనరులను దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్‌ స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, మధ్యకాలిక వృద్ధికి ఊతమిచ్చే పద్దును తీసుకొచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే రాబోయే బడ్జెట్‌ 2021-22 బడ్జెట్‌కు కొనసాగింపుగా ఉంటుంది తప్పితే ఊహాతీతంగా ఉండదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఆర్థిక సర్వేలో ఏం ఉంటుంది? ఆ లెక్కలతో మనకు పనేంటి?

Last Updated : Jan 31, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.