ETV Bharat / bharat

పెట్రోల్​+బ్యాటరీ బండి.. విశేషాలు చాలా అండి.. మరి మీరు చూశారా..!

author img

By

Published : Mar 28, 2023, 11:47 AM IST

HYBRID VEHICLES: ఉన్నత చదువులు చదివితేనే ఆవిష్కరణలను చేయగలం అంటే అది తప్పే అవుతుందని నిరూపించాడు ఆ యువకుడు. చదువులేకున్నా చేసే పనిలో భిన్నంగా ఆలోచిస్తే ఆవిష్కరణలకు కొదవే లేదు అంటున్నాడు. మెకానిక్‌గా పని చేస్తూనే భిన్నమైన వాహనాల్ని రూపొందిస్తూ.., మంచి వ్యాపారంగా మలుచుకున్నాడు. ఆ యువకుడు తయారుచేస్తున్న వాహనాలు ఏంటి..? అతను వ్యాపారం ఎలా సాగుతోందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

HYBRID VEHICLES
HYBRID VEHICLES

HYBRID VEHICLES: చిన్నప్పటి నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. ఇంట్లో అంతా పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో బడికి స్వస్తి పలికి, పనికి కుదిరాడు ఈ నెల్లూరు యువకుడు. అలా చిన్నప్పటి నుంచి దొరికిన పని చేస్తూ జీవనం సాగించాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో తన మేధకు పదునుపెట్టి పెట్రోల్‌, బ్యాటరీలతో నడిచే హైబ్రిడ్‌ వెహికిల్స్‌ రూపకర్తగా మారి వ్యాపారం చేస్తున్నాడు. అతడే సాయి కుమార్..

నెల్లూరులో మెకానిక్‌ సాయి అంటే తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అక్కడి యువతలో అంత క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అందరిలాగా కాక కొత్తగా ఆలోచించి వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఈ యువకుడు. కఠిక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు సొంతకాళ్లపై నిలబడగలిగే స్థాయికి చేరుకున్నాడు.

మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగదారుల సంఖ్య పెరిగింది. కానీ వాటిల్లో చిన్నచిన్న అవరోధాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న. అందుకు సమాధానంగానే అత్యవసర పని పడితే ఉపయోగపడేలా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ బ్యాటరీ కెపాసిటీ పెంచాలనే ఆలోచన పుట్టిందంటున్నాడు సాయి కుమార్.

"పెట్రోల్​+బ్యాటరీతో నడిచే వాటిని హైబ్రిడ్​ వెహికల్​ అంటారు. చైనా నుంచి వచ్చిన బండ్లకు స్పేర్​ పార్ట్స్​ తొందరగా దొరకవు. మరీ ముఖ్యంగా రేంజ్​ అనేది తక్కువ ఉంటుంది. అందుకే రేంజ్​ పెంచాలనుకుని వీటిని తయారు చేస్తున్నా. అలా తయారు చేస్తుండగా హైబ్రిడ్​ వెహికిల్​ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. పెట్రోల్​తో నడవడంతో పాటు బ్యాటరీ స్పేర్​లో ఉంటుంది. పెట్రోల్​ అయిపోతే బ్యాటరీ.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్​ ఇలా దేనితో నైనా నడిపే విధంగా రూపొందించా" -సాయి కుమార్, హైబ్రిడ్ వెహికిల్‌ తయారీదారుడు

అలా బ్యాటరీ రేంజ్‌ పెంచిన తర్వాత హైబ్రిడ్‌ వెహికిల్‌ చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు ఈ యువకుడు. అలా చేయడం ద్వారా పెట్రోల్‌తో వెళ్లే వారు బ్యాటరీని స్పేర్‌గా ఉంచుకుని వెళ్లొచ్చని, మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది తయారు చేశానని చెబుతున్నాడు.

అలా మొదట్లో తనకోసం తయారు చేసుకున్న వాహనానికి మంచి గిరాకీ ఉంటుందనే నమ్మకం కలగడంతో 2017 నుంచి ఈ వాహనాలు రూపొందించే వ్యాపారం ప్రారంభించాడు. పెట్రోల్‌, బ్యాటరీ రెండింటితో నడిచే వాహనం కాబట్టి మంచి గిరాకీ ఏర్పడింది. వాటి తయారీకి అవసరమయ్యే పరికరాలను పలు నగరాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. అలా తన వాహనాలకు మంచి పబ్లిసిటీ కోసం తానే ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ప్రారంభించి మంచి ఆదరణ పొందుతున్నాడు. ఇప్పటి వరకు మంచి వాహనాలను తయారుచేయడంతో ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు పంపుతున్నట్లు చెబుతున్నాడు.

"ఇప్పటి వరకూ చాలా మంది దూర ప్రదేశాల నుంచి వచ్చి మరీ చేయించుకుంటున్నారు. చెన్నై, తిరుపతి, చిత్తూరు, కడప, రాజంపేట, హైదరాబాద్​, సూర్యాపేట ఇలా చుట్టుపక్కల ప్రాంతాల వరకూ ఈ బండ్లను తీసుకెళ్లారు. రేంజ్​ను బట్టి సమయం పట్టింది. చిన్న వాటికి వారం రోజులు పడితే.. పెద్ద వాటికి నెల రోజుల సమయం పట్టిద్ది" -సాయి కుమార్, హైబ్రిడ్ వెహికిల్‌ తయారీదారుడు

అనుకోకుండా ఈ తయారీ రంగంలోకి వచ్చానని అంటున్నాడు ఈ యువకుడు. తన ఆసక్తి మేరకు తయారుచేసుకున్న వాహనాన్ని అందరూ మెచ్చుకుని తమకు కూడా చేసి ఇవ్వాల్సిందిగా కోరడంతో వ్యాపారం ప్రారంభమైంది. ఈ వాహనాల తయారీకి 30 వేల నుంచి గరిష్ఠంగా 2లక్షల 50 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నాడు.

అలా తాను చేసిచ్చిన వాహనాలతో వాటిని వాడుతున్న కస్టమర్లు కూడా పెట్రోలు ఖర్చు కలిసొస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు హైబ్రిడ్‌ వెహికిల్‌ వినియోగదారులు. సవాళ్లను స్వీకరిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు హైబ్రిడ్‌ వెహికిల్‌ రూపకర్త సాయి కుమార్.

పెట్రోల్​+బ్యాటరీ బండి.. విశేషాలు చాలా అండి.. మరి మీరు చూశారా..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.