ETV Bharat / bharat

కింగ్ మేకర్ కాదు.. 'కింగ్'! రిక్షావాలా టు మహా 'సీఎం'.. ఎవరీ శిందే?

author img

By

Published : Jun 30, 2022, 5:18 PM IST

EKNATH SHINDE MAHARASHTRA CM: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్​నాథ్ శిందే! తిరుగుబాటును విజయవంతంగా నడిపించి.. ఠాక్రే సర్కారును కూల్చేసిన ఆయన.. ఇప్పుడు సీఎం పదవిని దక్కించుకున్నారు. శివసేనకు షాక్ ఇస్తూ భాజపా పక్షాన చేరిన ఆయన.. కింగ్ మేకర్​గా నిలుస్తారని అందరూ భావించారు. అయితే, ఆయన ఏకంగా సీఎం పదవిని దక్కించుకొని కింగ్​గా నిలిచారు. అసలు ఆయన తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓసారి పరిశీలిస్తే..

EKNATH SHINDE MAHARASHTRA CM
EKNATH SHINDE MAHARASHTRA CM

WHO IS EKNATH SHINDE: ఒకప్పుడు రిక్షా తొక్కితేనే పొట్టగడిచే పరిస్థితి ఆయనది.. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారాయన.. ఠాక్రేను దించేసి.. భాజపాను గద్దెనెక్కించారు... ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే సంపాదించారు. బాలాసాహెబ్​ స్ఫూర్తితో రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా మారి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో గుజరాత్​లో మకాం పెట్టి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన ఆయనే.. ఏక్​నాథ్ శిందే.

Maharashtra political crisis 2022: శివసేనలో ఏక్​నాథ్ శిందే స్థానం చాలా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అందువల్లే ఆయన ఫిరాయింపు.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏక్​నాథ్. 1980లలో శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు శిందే. అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్​నగర్ బ్రాంచ్ హెడ్​గా నియమితులయ్యారు. 1997లో ఠాణె మున్సిపల్ కార్పొరేషన్​ కార్పొరేటర్​గా ఎన్నికయ్యారు. 2004లో ఠాణె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఠాణె జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు.

శివసేనపై తిరుగుబాటు చేసి గుజరాత్​, సూరత్​లోని ఓ హోటల్​లో.. ఆ తర్వాత అసోం గువాహటిలోని హోటల్​లో మకాం పెట్టారు. శివసేన, స్వతంత్రులు కలిసి 50 మందికి పైగా ఎమ్మెల్యేలతో విజయవంతంగా తిరుగుబాటును నడిపించారు. అయితే, ఏక్​నాథ్ శిందే తిరుగుబాటుకు కారణం ఏంటి? శివసేనలో ఇన్నేళ్లు బలమైన నేతగా ఉన్న ఆయన.. ఎందుకు జెండా ఎత్తేశారు? ఇందుకు నాలుగు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

మొదటిది.. ఉద్ధవ్ ఠాక్రే
ఇప్పటివరకు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్​నాథ్ శిందే అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ బాధ్యతలన్నీ ఠాక్రే ఒక్కరే చూసుకున్నారని, ఇది శిందేకు నచ్చలేదని తెలుస్తోంది. మహా వికాస్ అఘాడీ ఏర్పడిన సమయంలో శిందే కీలకంగా వ్యవహరించారు. అప్పుడే శివసేన సభాపక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని తనకు ఇస్తారని శిందే ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా.. ఠాక్రే కుటంబంలో ఎన్నడూ లేని రీతిలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల్లో భాగంగానే పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖలను ఠాక్రే.. ఏక్​నాథ్ శిందేకు అప్పగించారని విశ్లేషకులు చెబుతున్నారు.

సంజర్ రౌత్​కు ప్రాధాన్యం..
మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుండి నడిపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఎన్సీపీ, కాంగ్రెస్​లతో చర్చలు జరపడంలో రౌత్.. కీలకంగా వ్యవహరించారు. పార్టీ తరఫున ప్రతి విషయంపైనా ఆయనే స్పందించేవారు. ఇప్పటికీ శివసేనలో ప్రధాన హోదాలో ఉన్నారు. ఇది కూడా ఏక్​నాథ్ శిందేకు నచ్చట్లేదని తెలుస్తోంది. వ్యూహాత్మక సమావేశాలకు, చర్చలకు తనను దూరం పెడుతున్నారన్న భావన ఆయనలో ఏర్పడింది. ఇది అసంతృప్తిని పెంచింది.

ఆదిత్య ఠాక్రే బ్రాండింగ్
ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ ఠాక్రే చేపట్టిన తర్వాత.. ఆయన తన తనయుడిని కేబినెట్​లోకి తీసుకోవడం, తర్వాతి సీఎం ఆయనే అంటూ పరోక్షంగా ప్రచారాలు చేయించడంపై ఏక్​నాథ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన చర్చల్లో ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య పేర్లు వినిపించాయి. తన పేరును అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న భావన ఆయనలో పెరిగింది. ఉద్ధవ్​ తర్వాత అయినా తనకు సీఎం పదవి దక్కుతుందనే ఆశతో ఉన్న ఏక్​నాథ్ శిందేకు ఇది ఏమాత్రం రుచించలేదు.

పక్కదారి పట్టించారని..
బాలాసాహెబ్, ఆనంద్ దిఘే తర్వాత రాజకీయాలపై గట్టి పట్టున్న నేతగా ఏక్​నాథ్ శిందే ఎదిగారు. ఠాణెలో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. అయితే, ఇటీవల తన ఇమేజ్ తగ్గిపోయిందని శిందే భావిస్తున్నారు. అందుకే సన్నిహిత ఎమ్మెల్యేలతో విడివిడిగా ఉంటున్నారు. ఠాక్రే పుట్టినరోజు వేడుకలకు హాజరైన సమయంలోనూ తన గ్రూపు ఎమ్మెల్యేలతోనే వచ్చారు. వెళ్లేటప్పుడు వారిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఔరంగబాద్​లో నిర్వహించిన పార్టీ వార్షికోత్సవంలోనూ అంటీముట్టనట్టుగానే ఉన్నారు.

అనుకున్నది సాధించి..
మొదటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన శిందే.. తాను అనుకున్నది సాధించారు. శివసేనను నిండా ముంచేసిన ఆయన.. భాజపాతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పోస్టును దక్కించుకున్నారు. రెండున్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని గుప్పిట పెట్టుకోనున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.