ETV Bharat / bharat

Sunitha: ఆమె పోరాటంతోనే వివేక హత్య కేసు ఓ కొలిక్కి..! అసాధారణ వనితగా సునీత!

author img

By

Published : Apr 17, 2023, 8:42 AM IST

Updated : Apr 17, 2023, 8:50 AM IST

Vivekananda Reddy daughter Sunitha: తన తండ్రి హత్యకు సంబంధించిన మిస్టరీని చేధించేందుకు కుమార్తె సునీత అలుపెరుగక ఒంటరి పోరాటం చేశారు. తన కుటుంబంపై ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోలేదు. చివరకు తండ్రిపైనే నిందలు వేసినా.. నిజం బయటకు రావాలన్న పట్టుదల ముందు.. ఆ అబద్దం కనుమరుగైపోయింది. ఆమె చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే..

YS Vivekananda Reddy death case
వివేకా కుమార్తె సునీత అలుపెరుగని పోరాటం

Vivekananda Reddy daughter Sunitha: తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా శిక్ష పడాల్సిందేనన్న పట్టుదలతో.. ఆమె చేసిన ఒంటరి పోరాటం అనితర సాధ్యం. వైసీపీ ప్రభుత్వ పెద్దలు కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నించినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారు వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి. అనేక ప్రతికూల పరిస్థితులకు ఆమె ఒంటరిగానే ఎదురొడ్డారు. ఆమె చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించి, కేసు విచారణ కీలకదశకు చేరుకుంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ వరకు దారితీసిన పరిణామాల వెనుక.. వివేకా కుమార్తె సునీతారెడ్డి చేసిన అలుపెరగని పోరాటం ఉంది. కోర్టు వెలుపలా, బయట ఒంటరిగానే ఆమె పోరాటం చేశారు. వాస్తవానికి వివేకా హత్య కేసుపై దర్యాప్తునకు అప్పటి తెదేపా ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసి.. కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి నేతృత్వంలో మరో సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తు కొంత వేగం పుంజుకున్న దశలో.. ఎస్పీ అభిషేక్‌ మహంతికి ఎదురైన ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం ఎస్పీగా అన్బురాజన్‌ను నియమించారు. సునీత ఆయనను కలవగా.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి మార్గనిర్దేశమూ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. పైగా కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించబోతున్నారన్న ప్రచారమూ జరిగింది.

ఆ తర్వాత కూడా వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌కు పదేపదే సునీత విజ్ఞప్తి చేశారు. కానీ జగన్‌ నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని సునీత వివిధ సందర్భాల్లో వెల్లడించిన విషయాల్ని బట్టి అర్థమవుతోంది. తన తండ్రి హత్య కేసు విషయమై చర్చించేందుకు జగన్‌కు చెప్పి ఫ్యామిలీ మీటింగ్‌ ఏర్పాటు చేయించాలని విజయమ్మను కోరగా.. ఆమె జగన్‌కు ఫోన్‌ చేసి ఆ విషయం చెబితే.. ఆయన నవ్వి, గంట కూడా సమయం కేటాయించలేనని చెప్పారని సునీత తెలిపింది. ఆ తర్వాత 2019 అక్టోబరు 6న తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసంలో ఫ్యామిలీ మీటింగ్ ఖరారైంది.

అనుమానితుల పేర్ల జాబితాను జగన్, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందజేశారు. అందులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుకు బదులు.. తన భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరును చేర్చాలని సలహా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అలా చెప్పడంతో జగన్‌తో సునీత వాదించారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్‌రెడ్డి వైసీపీ నుంచి భాజపాలోకి వెళ్లిపోతారని, అప్పుడు ఆయనకు ఏమీ కాదని జగన్‌ చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సునీత అన్నారు. దీంతోపాటు ఈ కేసు సీబీఐకి వెళితే అది తనకు 12వ కేసు అవుతుందని జగన్‌ అన్నారని ఆమె వెల్లడించారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పైవిధంగా పేర్కొన్నారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తనకు కళ్లలాంటివారని జగన్‌ చెప్పినట్లు.. అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాతో అన్నారని కూడా సునీత పేర్కొన్నారు.

కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్నవారిని జగన్‌ సమర్థించేలా మాట్లాడడం వంటి పరిణామాలు సునీతను నిరాశపరిచాయి. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు న్యాయం జరగదని, తండ్రి మరణానికి కారకులైనవారికి శిక్ష పడదని భావించిన ఆమె.. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులను మార్చడం.. కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం వంటి పరిణామాలపై సునీత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో అమాయకులను బలిచేసి అసలు నేరస్థులను వదిలేస్తారేమోన్న సందేహం కలుగుతోందని ఆమె కోర్టుకు నివేదించారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి సహా 15 మందిని అనుమానితులుగా సునీత కోర్టుకు నివేదించారు.

వివేకా కుమార్తె సునీత అలుపెరుగని పోరాటం

దీంతో అప్పటి నుంచి ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాల్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నావంటూ.. కొందరు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నాలూ చేశారు. ఈ విషయాలన్నీ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతే స్వయంగా చెప్పారు. వివేకా హత్య కేసులో తన భర్తను కూడా అనుమానితుడిగా భావించాలని సీఎం జగన్‌ తనతో పలుమార్లు అన్నట్లు కూడా ఆమె సీబీఐకి చెప్పారు. అన్న ఒడిదొడుకులను ఎదుర్కొంటూ సునీత వెనక్కి తగ్గకుండా చేసిన అలుపెరగని పోరాటం వల్లే హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా దర్యాప్తు అంత వేగంగా ముందుకు సాగలేదు. ఆమె అటు దిల్లీ స్థాయిలోనూ తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించినా.. దర్యాప్తు అంత సాఫీగా సాగలేదు. దిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను అనేకసార్లు సునీత కలసి.. తన తండ్రి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల్ని వివరించారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ చేసిన వారికి బెయిల్‌ ఇవ్వవద్దని సీబీఐ వేసిన పిటిషన్‌లలో సునీత కూడా ఇంప్లీడ్‌ అయ్యారు. తన తండ్రి హత్య కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా.. విచారణలో ఎలాంటి పురోగతి లేదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తూ.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీంతో సునీత తండ్రి వైఎస్ వివేకా హత్య కేసును తెలంగాణకు మార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 17, 2023, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.