ETV Bharat / bharat

పొత్తు పొడుపుల ఆర్‌ఎల్‌డీ... ఫిరాయింపులు కొత్తేం కాదు!

author img

By

Published : Jan 29, 2022, 7:50 AM IST

SP RLD alliance issue: ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్​పీతో కలిసి పోటీ చేస్తున్న ఆర్ఎల్​డీ.. భవిష్యత్​లో భాజపాతో చేతులు కలిపే అవకాశాలు లేకపోవని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనేకసార్లు కూటములు మార్చిన ఆర్ఎల్​డీ చరిత్ర ఈ అభిప్రాయాలను బలపరుస్తోంది. మరి తాజా ఎన్నికల్లో ఏం జరగనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

SP RLD ALLIANCE IN UTTAR PRADESH
up assembly election 2022

SP RLD alliance issue: ఉత్తర్‌ప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) పార్టీకి ఎన్డీయే తలుపులు తెరిచే ఉన్నాయంటూ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంకేతాలిచ్చారు. వెంటనే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ ఛౌధరీ.. తాము సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తోనే కలసి సాగనున్నట్లు స్పష్టం చేశారు. అయితే- ప్రస్తుతానికి కాదన్నప్పటికీ.. త్వరలో జయంత్‌ భాజపాతో చేతులు కలిపే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫిరాయింపులు ఆర్‌ఎల్‌డీకి అలవాటేనని పేర్కొంటున్నారు. ఆ పార్టీ గత చరిత్ర కూడా అభిప్రాయాలను బలపరుస్తోంది! ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటివరకు ఆర్‌ఎల్‌డీ అనేకమార్లు కూటములు మార్చింది. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా భాజపా, కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ.. ఇలా ఏ పార్టీతోనైనా సరే జోడీ కట్టేందుకు సిద్ధమైంది.

up-assembly-election-2022
.

అటూ.. ఇటూ..

RLD in Uttar pradesh politics: పశ్చిమ యూపీ అగ్రనేతల్లో మాజీ ప్రధానమంత్రి చౌధరీ చరణ్‌సింగ్‌ ఒకరు. 1987లో ఆయన కన్నుమూశాక.. ఆయన కుమారుడు అజిత్‌ సింగ్‌ లోక్‌దళ్‌ అధ్యక్షుడయ్యారు. అనంతరం జనతా పార్టీ, జనతాదళ్‌లోనూ అజిత్‌ ఉన్నత పదవులు చేపట్టారు. పశ్చిమ యూపీలో జాట్‌లందరికీ ఆమోదయోగ్యమైన నేతగా ఎదిగారు. ఓ దశలో ఆయన కాంగ్రెస్‌లో భాగమయ్యారు. 1996లో ఆర్‌ఎల్‌డీని స్థాపించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాతో కలిసి ఆ పార్టీ బరిలో దిగింది. అయితే వాటి మధ్య బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. ఆర్‌ఎల్‌డీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2003లో యూపీలో బీఎస్పీ, భాజపా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌తో అజిత్‌ చేతులు కలిపారు. కాంగ్రెస్‌తో కలిసి ఎస్పీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ములాయం పార్టీతో కలసి బరిలో దిగిన ఆర్‌ఎల్‌డీ.. కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో- 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో బంధాన్ని తెంచుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కమలనాథులతో పొత్తు కుదుర్చుకుంది. కానీ అది భాజపాకే ఎక్కువగా కలిసొచ్చింది. పశ్చిమ యూపీలో కమలదళం 10 సీట్లు గెల్చుకోగా.. ఆర్‌ఎల్‌డీ ఐదింటికే పరిమితమైంది. తర్వాత భాజపాతో బంధం తెంచుకున్న ఆ పార్టీ.. 2011లో యూపీఏ-2 ప్రభుత్వంలో చేరింది. 2012 అసెంబ్లీ ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ.. కాంగ్రెస్‌తోనే కలసి నడిచింది.

మళ్లీ జవసత్వాలు!

UP assembly election 2022: పశ్చిమ యూపీ జనాభాలో ముస్లింలు దాదాపు పాతిక శాతం, జాట్‌లు 19% ఉంటారు. వీరి ఓట్లను సంఘటితం చేయడంలో చరణ్‌సింగ్‌ 1970ల్లో విజయవంతమయ్యారు. తర్వాత కూడా ఆర్‌ఎల్‌డీకి వారి మద్దతు కొనసాగింది! ప్రధానంగా జాట్‌లు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. 2013 నాటి జాట్‌ వర్సెస్‌ ముస్లిం అల్లర్లతో సమీకరణాల్లో మార్పు వచ్చింది. జాట్‌లు భాజపావైపు మొగ్గుచూపడంతో.. 2014 సార్వత్రిక సమరంలో అజిత్‌ సింగ్‌, ఆయన కుమారుడు జయంత్‌ చౌధరీ పరాజయం పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమిలో చేరిన ఆర్‌ఎల్‌డీ.. ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. అయితే- సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల (ప్రధానంగా జాట్‌ల) పోరాటం ఆ పార్టీకి తిరిగి ప్రాణం పోసింది! జాట్‌లు మళ్లీ ఆర్‌ఎల్‌డీవైపు వచ్చేశారు! గత ఏడాది అజిత్‌ కన్నుమూయడంతో జయంత్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎస్పీ కూటమిలో భాగంగా ఉన్న ఆర్‌ఎల్‌డీ.. సొంతంగా 33 స్థానాల్లో పోటీ చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​లో మోదీ ఇమేజ్​ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.