ETV Bharat / bharat

Margadarshi Chit Fund case మార్గదర్శి రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు: తెలంగాణ హైకోర్టు

author img

By

Published : May 11, 2023, 10:19 PM IST

Etv Bharat
Etv Bharat

Margadarshi Chit Fund case latest news: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. కౌంటర్లు దాఖలకు ఇంకెంత కాలం కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Margadarshi Chit Fund case latest news: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఒకవేళ భవిష్యత్తులో సోదాలు చేసినట్లయితే.. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సోదాలు ముగిశాయని.. మార్గదర్శి ఖాతాదారులను వేధించలేదన్న ఏపీ ప్రభుత్వ వివరణను హైకోర్టు నమోదు చేసింది. మార్గదర్శి పిటిషన్లపై నెలలు గడుస్తున్నా.. కౌంటర్లు దాఖలు చేయడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పిటిషన్లపై విచారణ.. దర్యాప్తు నెపంతో రోజువారీ వ్యాపారంలో ఏపీ ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ M. సుధీర్ కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ లిఖితపూర్వకంగా హైకోర్టుకు వివరణ సమర్పించింది. క్రైమ్ నంబర్ 8 కేసులో మార్గదర్శిలో సోదాలు ముగిశాయని తెలంగాణ హైకోర్టుకు సీఐడీ తెలిపింది. ఖాతాదారులు ఎవరినీ వేధించలేదని... అలాంటి ఫిర్యాదు ఎక్కడా లేదని ఏపీ తరఫు న్యాయవాది లలిత గాయత్రి తెలిపారు. కొందరు ఉద్యోగులను విచారణ కోసం పిలిచామని వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ సోదాల్లో పాల్గొనడం లేదని.. సీఐడీ బృందంతో పాటు సాంకేతిక అధికారి వెళ్లారని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ అవసరం లేదని ఏపీ న్యాయవాది వాదించారు.

కౌంటర్లు దాఖలకు ఇంకెంత కాలం కావాలి..?.. అయితే, మరో కేసులో మళ్లీ సోదాల పేరుతో వేధించే అవకాశం ఉందని మార్గదర్శి తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వ వివరణను నమోదు చేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో సోదాలు చేసినట్లయితే మార్గదర్శి రోజువారీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మార్గదర్శికి సంబంధించి పెండింగులో ఉన్న ఇతర పిటిషన్లతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మార్గదర్శి పిటిషన్లపై ఎందుకు కౌంటర్లు దాఖలు చేయడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ల దాఖలుకు కొంత సమయం కావాలని ఏపీ తరఫున న్యాయవాది కోరారు. పిటిషన్లు దాఖలై నెలలు గడుస్తుంటే ఇంకా ఎంతకాలం కావాలని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. వేధించడానికే కాలయాపన చేస్తున్నారని మార్గదర్శి తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన వాదన.. కేసుల దర్యాప్తు పేరుతో ఏపీ ప్రభుత్వ అధికారులు తమ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నది ఈ పిటిషన్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన వాదన. సోదాల పేరుతో ప్రధాన ద్వారం తలుపులు మూసి చందాదారులను లోనికి రానివ్వకుండా వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారని మార్గదర్శి పేర్కొంది. తనిఖీల సమయంలో సీఐడీ అధికారులతోపాటు అనధికారికంగా గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చందాదారులను విచారణకు పిలిచి భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపింది. దర్యాప్తు పేరుతో రోజువారీ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా.. ప్రైవేటు వ్యక్తులను సీఐడీ అధికారుల వెంట అనుమతించకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టును మార్గదర్శి కోరింది.

విచారణ పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.. పదేపదే సోదాలు చేస్తూ... అడిగిన ప్రశ్నలే అడుగుతూ విచారణ పేరుతో మార్గదర్శి ఉద్యోగులను వేధిస్తున్నారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఫలితంగా ఉద్యోగులు తమ రోజువారీ సాధారణ విధులకు సమయాన్ని కేటాయించలేక.. చందాదారులకు సేవలందించలేకపోతున్నారని తెలిపారు. చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారులను పెంచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాయని.. చందాదారులకు ఇబ్బందులు ఎదురైతే వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారని హైకోర్టుకు వివరించారు.

సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు.. చందాదారులను చట్టవిరుద్ధంగా పిలిచి వ్యక్తిగత, ఆదాయపన్ను, ఆదాయ వనరుల వివరాలు వంటి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. చెల్లింపులకు కీలకమైన నెలాఖరు సమయంలో తలుపులు మూసివేస్తుండటంతో వసూళ్లు తగ్గిపోతున్నాయని పిటిషన్‌లో వివరించారు. చందాదారులు చెల్లింపుల కోసం విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చందాదారులు పాడుకున్న బిడ్ మొత్తం చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగినా భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని, అందువల్ల వేధింపులు లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని మార్గదర్శి సంస్థ వివరించింది. గుర్తింపు వివరాలు చెప్పకుండా అధికారులు కార్పొరేట్ కార్యాలయంతో పాటు బ్రాంచీల్లోకి ప్రవేశిస్తున్నారని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు. కొన్నిచోట్ల సీఐడీ అధికారులు అభ్యంతరకరమైన భాష వినియోగిస్తూ ఉద్యోగులను అవమానిస్తున్నారని కోర్టుకు వివరించారు.

ఏపీ ప్రభుత్వం.. మార్గదర్శి రోజువారీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.