ETV Bharat / bharat

Siemens Industry Software India MD Matthew Thomas: 'స్వయంగా సీమెన్స్‌ ఎండీ వివరించినా.. వైసీపీ నేతలకు కనిపించవు.. అవినీతి నిందలకు మాత్రం పోటీ'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 7:18 AM IST

Siemens Industry Software India MD Matthew Thomas: ఆంధ్రప్రదేశ్‌తో నైపుణ్యాభివృద్ధి ఒప్పందం ఉందని.. 2011 నుంచి డిజైన్‌టెక్‌ మా వ్యాపార భాగస్వామేనని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో సీమెన్స్‌ ప్రస్తుత ఎండీ మాథ్యూ తెలిపారు. ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌ రూపంలోనే మా వాటా.. అది ద్రవ్యేతర డిస్కౌంటేనని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర సంస్థలవీ.. ఇదే తరహా ఒప్పందాలని సైతం స్పష్టం చేశారు. అయినా ఇవన్నీ అరాచక పాలన సాగిస్తున్న నేతలకు కనిపించటం లేదు.

Siemens_Industry_Software_India_MD_Matthew_Thomas
Siemens_Industry_Software_India_MD_Matthew_Thomas

Siemens Industry Software India MD Matthew Thomas: స్వయంగా సీమెన్స్‌ ఎండీ వివరించినా.. వైసీపీ నేతలకు కనిపించవు.. అవినీతి నిందలకు మాత్రం పోటీ

Siemens Industry Software India MD Matthew Thomas: ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న మాట నిజమేనని.. సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి ఇచ్చిన వాంగ్మూలంలోనే స్పష్టం చేశారు. డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ సంస్థ 2011 నుంచి తమ వ్యాపార భాగస్వామేనని.. సీఐడీ కేసు తర్వాతే సస్పెన్షన్‌లో ఉంచామని చెప్పారు. సీమెన్స్‌ సంస్థ ఎలాంటి ద్రవ్యసహాయం అందించదని.. వివిధ ఐఐటీ, ఎన్‌ఐటీ, రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య కార్యక్రమాల ప్రాజెక్టులకు కంపెనీ విధానాల ప్రకారం ‘ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌’ రూపంలో డిస్కౌంట్‌ అందిస్తుందని పేర్కొన్నారు. అయినా అధికార వైసీపీ నేతలు, కొందరు అధికారులు మాత్రం బురద చల్లడానికి పోటీపడుతున్నారు.

నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ చెబుతోంది అంటారొకరు.. ‘ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌’ అంటే ఏంటి? అదెక్కడా వినలేదే! అంటూ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిలా చెబుతారు ఇంకొకరు. లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించే సీమెన్స్‌ ప్రాజెక్టుపై.. తాము పీహెచ్‌డీ చేశామన్నట్లుగా అధికారపార్టీ నేతలు, కొందరు అధికారులు తమకు తెలిసిన పరిజ్ఞానాన్ని వల్లెవేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో, పేరున్న విద్యాసంస్థల్లో సీమెన్స్‌ ప్రాజెక్టు ఎలా అమలైందని తెలుసుకునే ఆలోచనా లేదు. ఇదే తరహా ఒప్పందాలు, ఇన్‌కైండ్‌ గ్రాంట్‌ విధానాలపైనే.. సీమెన్స్‌తో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం కూడా సాగరమాల కార్యక్రమంలో భాగంగా మారిటైమ్, నౌకా నిర్మాణాలకు సీమెన్స్‌తో ప్రపంచస్థాయి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అక్కడ కేంద్రవాటాను వన్‌టైమ్‌ గ్రాంట్‌గానే ఇచ్చేందుకు నిర్ణయించింది. అక్కడెక్కడా కనిపించని అవినీతి.. వైసీపీ నేతలకు, కొందరు అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందంలోనే కనిపిస్తోంది.

Payyavula Keshav Reaction on CID False Propaganda: సీమెన్స్‌ సంస్థ రాసిన లేఖను బయటపెడతారా..? సీఐడీకి పయ్యావుల సవాల్‌

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, సాంకేతిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిజైన్‌టెక్, సీమెన్స్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం 2015 జూన్‌లో కుదిరింది. నిర్దేశిత కేంద్రాల్లో అవసరమైన సాప్ట్‌వేర్‌ సరఫరా, హార్డ్‌వేర్‌ టెస్ట్‌ పనులను సీమెన్స్‌ చూస్తుంది అని మాథ్యూ థామస్‌ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. సీమెన్స్‌ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం.. ఆటోమొబైల్, అగ్రిటెక్, ఇండస్ట్రియల్‌ మెషినరీ వంటి రంగాల్లో సాంకేతిక శిక్షణ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటుచేస్తారు.

ప్రాజెక్టులో భాగంగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సరఫరా, ఐపీ అడ్రస్‌ ఇవ్వడంతో పాటు.. ప్రాజెక్టు అమలు, నిర్వహణ, శిక్షణ, ధ్రువీకరణ, పర్యవేక్షణ, శిక్షణకు సంబంధించిన నాణ్యత సహా మొత్తం కేంద్రాల్లో పరిపాలనా వ్యవహారాలను టెక్నాలజీ భాగస్వామి, కార్యక్రమాల సలహాదారుగా సీమెన్స్‌ చూస్తుంది. కేంద్రాల ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణ, సిస్టమ్‌ ఇంటిగ్రేటర్, కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్‌-హార్డ్‌వేర్‌ అనుసంధానం, కోర్సులు, అవసరమైన ఇతర పరికరాల సరఫరా, ఫ్యాకల్టీ, విద్యార్థుల బాధ్యతల్ని సీమెన్స్‌ తరఫున డిజైన్‌టెక్‌ చూస్తుంది.

ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వాటాను డిజైన్‌టెక్‌ ఖాతాకు చెల్లించాలి అని పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుకు.. సీమెన్స్‌ దగ్గరున్న సమాచారం ఆధారంగా డిజైన్‌టెక్‌కు సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్‌ విలువ 12 వందల89 కోట్లుగా తేల్చారు. ఎల్‌ఎంఎస్‌ ఇండియా ద్వారా సరఫరా చేసిన టెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ విలువను 10.25 కోట్లుగా పేర్కొన్నారు.

TDP Leader Pattabhi Ram Sensational Comments: సీమెన్స్‌ కంపెనీ అంశంపై.. నరేంద్రమోదీని అడిగే ధైర్యం జగన్‌కు ఉందా ?: పట్టాభి

‘సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ విక్రయం, అమలు, శిక్షణ అందించడానికి డిజైన్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2011 నుంచి సీమెన్స్‌కు ఛానెల్‌ భాగస్వామిగా ఉందని.. అయితే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై ఏపీసీఐడీ కేసు పెట్టాక.. ఈ సంస్థతో ఒప్పందాన్ని సస్పెన్షన్‌లో ఉంచాం ’ అని మాథ్యూ తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వుల్లో సీమెన్స్‌ తన 90శాతం వాటాను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇస్తుందని పేర్కొన్నారు. అయితే సీమెన్స్‌ కంపెనీ తమ విధానాల ప్రకారం ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌ రూపంలోనే అందిస్తుంది. ఒప్పందంలోనూ ఇలాగే ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విద్యాసంస్థలతోపాటు.. అమెరికాలోని పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలతో సీమెన్స్‌ ఒప్పందాల్ని పరిశీలిస్తే.. అవన్నీ ‘ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌’ రూపంలోనే ఉన్నాయి.

కంపెనీ సాధారణంగా ఇన్‌కైండ్‌ గ్రాంట్‌ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. అంటే కంపెనీ విధానాల మేరకు.. డిస్కౌంట్‌ అందిస్తుంది. ఇది సాధారణంగా ద్రవ్యేతర డిస్కౌంట్‌’ అని కూడా సంస్థ చెబుతోంది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అన్నా.. ఇన్‌ కైండ్‌ గ్రాంట్‌ అన్నా.. అది డిస్కౌంట్‌ రూపంలో అందించే సాఫ్ట్‌వేర్‌ విలువకు సంబంధించినదే. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా.. ఒక్కో క్లస్టర్‌ పరిధిలోని ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, 6 సాంకేతిక శిక్షణ కేంద్రాలకు ప్రాజెక్టు వ్యయంలో 90శాతం చొప్పున.. సీమెన్స్, డిజైన్‌టెక్‌ వాటా ఉంటుంది. మిగిలిన 10శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా. సీమెన్స్‌ దస్త్రాల ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సీమెన్స్‌ నగదు రూపంలో సహకారం అందించాల్సిన పనిలేదు. కంపెనీ విధానాలకు అనుగుణంగా.. సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను డిస్కౌంట్‌ ధరపై అందించారు.

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సీమెన్స్‌ సంస్థతో వరంగల్‌ నిట్ రూ.170 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 150 కోట్లను అంటే 88.24శాతం సీమెన్స్, 20 కోట్లను అంటే 11.76శాతం నిట్‌ భరిస్తాయి. మూడేళ్లలో 30వేల మంది విద్యార్థులకు నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో నిట్‌తో అనుసంధానమైంది. 150 కోట్ల విలువచేసే పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్, వ్యాపార భాగస్వామ్య సంస్థలు అందిస్తాయి. డిజైన్‌ అండ్‌ వాలిడేషన్, ఐవోటీ, రోబోటిక్స్‌ ల్యాబ్‌లు.. ఇలా 13 ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలతో కర్ణాటక ప్రభుత్వం 2017 జూన్‌ 9న ఒప్పందం చేసుకుంది. అప్పటి సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే ఈ ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు వ్యయం 2 వేల 41.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా.. అందులో సీమెన్స్‌ వాటాగా 18 వందల 22.48 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.219.32 కోట్లు అంటే 11శాతం చెల్లించేలా అంగీకారం కుదుర్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రప్రభుత్వ వాటా 10శాతం. కానీ, అక్కడ లేని నిబంధనల ఉల్లంఘన, ఏపీలోనే జరిగినట్లు జగన్‌ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. ఏపీలో ఒప్పందం విధానాన్నే కర్ణాటక సైతం అనుసరించింది. సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్, డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్, కర్ణాటక ప్రభుత్వ టూల్‌రూమ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏపీలో ఆరు ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, 36 సాంకేతిక నైపుణ్యశిక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేయగా.. కర్ణాటక నాలుగు సెంటర్లను ఏర్పాటుచేసింది.

నైపుణ్యాభివృద్ధి కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

కర్ణాటక ఒప్పందంలో మొదటి రెండేళ్లు నాలుగు కేంద్రాలను డిజైన్‌టెక్‌ నిర్వహిస్తుందని, మూడో ఏడాది నిర్వహణకు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో నాలుగో ఏడాది సైతం డిజైన్‌టెక్‌ ద్వారానే కేంద్రాలను నిర్వహించారు. అటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఇండస్ట్రియల్‌ మిషనరీ, పునరుత్పాదక ఇంధన విభాగాల్లో శిక్షణకు సీమెన్స్‌తో అప్పటి కర్ణాటక ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ 765 కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో సీమెన్స్‌ వాటా 665 కోట్లు. నౌకాయాన మంత్రిత్వశాఖ వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద 100 కోట్లు అంటే 13శాతం అందించింది. అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్‌వేర్‌ డిజైన్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, స్కాడా కంట్రోల్స్, ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్, పీఎల్‌సీ ప్రోగ్రామింగ్, ట్రాన్స్‌మిషన్‌ కంట్రోల్స్, వర్చువల్‌ రియాలిటీ, రాడార్‌ టెక్నాలజీ, డైమెన్షనల్‌ యాక్యురసీ, నెస్టింగ్‌ తదితర ఎన్నో రంగాలకు సంబంధించి శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సీమెన్స్‌ సంస్థతో వరంగల్‌ నిట్ రూ.170 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 150 కోట్లను అంటే 88.24శాతం సీమెన్స్, 20 కోట్లను అంటే 11.76శాతం నిట్‌ భరిస్తాయి. మూడేళ్లలో 30వేల మంది విద్యార్థులకు నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో నిట్‌తో అనుసంధానమైంది. 150 కోట్ల విలువచేసే పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్, వ్యాపార భాగస్వామ్య సంస్థలు అందిస్తాయి. డిజైన్‌ అండ్‌ వాలిడేషన్, ఐవోటీ, రోబోటిక్స్‌ ల్యాబ్‌లు.. ఇలా 13 ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

CID On Siemens: సీమెన్స్‌ ప్రాజెక్టులో ముగ్గుర్ని అరెస్టు చేసిన సీఐడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.