ETV Bharat / bharat

సైక్లింగ్, వాకింగ్, స్కేటింగ్- అయోధ్యకు భక్తుల సాహసయాత్రలు- ఇతర మతస్థులు కూడా!

author img

By PTI

Published : Jan 19, 2024, 3:32 PM IST

Ram Devotees Ayodhya Cycling And Skating : అయోధ్య రామ మందిరంలో జరిగే చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంతో మంది సాహసయాత్రలు చేస్తున్నారు. నడక సహా సైక్లింగ్, స్కేటింగ్ వంటి భిన్న మార్గాల్లో అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇతర మతాలకు చెందిన వారు సైతం సాహసయాత్రలు చేస్తుండటం విశేషం.

Ram Devotees Ayodhya Cycling And Skating
Ram Devotees Ayodhya Cycling And Skating

Ram Devotees Ayodhya Cycling And Skating : కాలినడకన కొందరు- సైకిల్​ తొక్కుతూ మరికొందరు- స్కేటింగ్ చేస్తూ ఇంకొందరు- మార్గాలు వేర్వేరు కావొచ్చు- కానీ వారందరి లక్ష్యాలు ఒక్కటే. అయోధ్యకు ఎలాగైనా వెళ్లాలని, చారిత్రక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించాలని ఇలా ఎంతో మంది సాహసయాత్రకు పూనుకున్నారు. ఉత్తర భారత గడ్డకట్టించే చలిలో రామ చంద్రుడి దర్శనం కోసం వెళ్తున్నారు. రాముడిపై అచంచల భక్తితో ముందడుగు వేసి ఐక్యతా సందేశం ఇస్తున్నారు. కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకోగా, ఇంకొందరు రఘుకుల నందనుడి సన్నిధికి కొద్దిదూరంలో ఉన్నారు.

బిహార్​కు చెందిన నితీశ్ కుమార్ తన స్వస్థలం మాధేపుర నుంచి అయోధ్యకు సైక్లింగ్ ద్వారా చేరుకున్నాడు. 615 కిలోమీటర్లు సైకిల్ తొక్కి శుక్రవారం రామ జన్మభూమిపై కాలుమోపాడు. సైకిల్​కు ఓ జాతీయ జెండా, మూడు కాషాయ జెండాలు పెట్టుకొని ప్రయాణం చేశాడు 21 ఏళ్ల నితీశ్. జైశ్రీరామ్ నినాదం రాసి ఉన్న ప్లకార్డును సైకిల్​కు తగిలించి రాఘవుడిని తలుచుకుంటూ ప్రయాణం సాగించాడు.

"బిహార్ నుంచి అయోధ్యకు రావడానికి నాకు ఏడు రోజుల సమయం పట్టింది. దారిలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడే స్లీపింగ్ బ్యాగు, కొన్ని అత్యవసర సామాను తప్ప నా సైకిల్​పై ఇంకేమీ తీసుకెళ్లలేదు. ఈ యాత్ర చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడే నిశ్చయించుకున్నా. అప్పుడు నేను స్కూల్ విద్యార్థిని. వచ్చేసారి అయోధ్యకు నా కుటుంబంతో కలిసి వస్తా. మేమంతా రాముడిని బాగా విశ్వసిస్తాం. నా కుటుంబ సభ్యులు ఇంటి వద్దే వేడుకలు నిర్వహించుకుంటారు. నేను మాత్రం చారిత్రక ఘట్టంలో భాగం కావాలని అయోధ్యకు వచ్చా."
--నితీశ్ కుమార్, అయోధ్యకు సైకిల్​పై చేరుకున్న యువకుడు

స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనం
వారణాసికి చెందిన సోనీ చౌరాసియా స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనమైంది. 124 గంటల పాటు డ్యాన్స్ మారథాన్ చేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించిన సోనీ- అయోధ్యకు 228 కిలోమీటర్ల సాహస యాత్ర చేపట్టింది. జనవరి 17న వారణాసి నుంచి బయల్దేరిన సోనీ చౌరాసియా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న అయోధ్యకు చేరుకోనుంది. ప్రాణప్రతిష్ఠకు రావాలని సోనీకి ఇదివరకే ఆహ్వానం లభించడం విశేషం.

"గతంలోనూ ఇలా సుదూర స్కేటింగ్ యాత్ర చేశా. కానీ ఇప్పుడు వాతావరణం సవాళ్లు విసురుతోంది. చలి ఎక్కువగా ఉంది. నాతో పాటు నా కోచ్, వైద్యుడు వెంట ఉన్నారు. వాహనాలలో వారు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు."
-సోనీ చౌరాసియా, స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు వెళ్తున్న మహిళ

Ram Devotees Ayodhya Cycling And Skating
సోనీ చౌరాసియా

పదేళ్ల బాలిక స్కేటింగ్
రాజస్థాన్ కోట్​పుత్లీకి చెందిన పదేళ్ల హిమాన్షు సోనీ సైతం స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు పయనమవుతోంది. 704 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేయనుంది. జనవరి 16న ఇంటి నుంచి బయల్దేరింది సోనీ. 'నా కుటుంబం రాముడిని అమితంగా ఆరాధిస్తుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో ఎక్కడ చూసినా దీపావళి తరహా వాతావరణం కనిపిస్తోంది. ప్రాణప్రతిష్ఠ రోజున అయోధ్యలో ఉండాలని అనుకున్నా. నా ట్యాలెంట్​ను ప్రదర్శిస్తూ అక్కడికి చేరుకోవడం కంటే ఉత్తమ మార్గం ఇంకేముంటుంది?' అని అంటోంది సోనీ.

హిందూ- ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా, మతసామరస్యాన్ని ప్రోత్సహించే విధంగా ముంబయి నుంచి అయోధ్యకు పాదయాత్ర చేపట్టింది షబ్నాం షేక్. రాముడి జెండాలు చేతబట్టి 1400 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు కాలి నడకనే వెళ్తోంది. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ రోజుకు 60 కిలోమీటర్లు నడుస్తోంది షబ్నాం. 'అమ్మాయిని కాబట్టి నేను విశ్రాంతి తీసుకునేందుకు మంచి ప్రదేశం చూసుకోవడం ముఖ్యం. అయితే, ఈ విషయంలో నాకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఎక్కడికి వెళ్లినా నాకు అందరూ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు' అని చెబుతోంది షబ్నాం.

Ram Devotees Ayodhya Cycling And Skating
షబ్నాం షేక్

గాంధీ వేషంలో అయోధ్యకు పయనం
మహాత్మా గాంధీలా వేషం వేసుకొని కర్ణాటక నుంచి అయోధ్యకు కాలినడకన చేరుకున్నాడు కారకిట్టికి చెందిన ముత్తన తిర్లపుర. తనను తాను ఆధునిక గాంధీగా అభివర్ణించుకుంటున్న అతడు 2వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యలో అడుగుపెట్టాడు. 'గాంధీజీ ఎల్లప్పుడూ రామ నామాన్ని స్మరించేవారు. రాముడి సందేశాన్ని వినిపించాలంటే ఆయన వేషమైతేనే బాగుంటుందని భావించా' అని చెబుతున్నాడు ముత్తన.

అయోధ్యకు బుడ్డా అంకుల్​
'బుడ్డా అంకుల్​'గా ఫేమస్ అయిన ఓమేశ్ భగత్(47) పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇస్తూ అయోధ్య యాత్ర చేపట్టాడు. సైకిల్​ వెనక సీటుకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. గతేడాది మే నుంచి 13 వేల కిలోమీటర్లకు పైగా సైకిల్​పై ప్రయాణించాడు ఓమేశ్.

"ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న మూడ్ అద్భుతంగా ఉంది. గతంలో ఎన్నడూ ఇలాంటి వాతావరణం లేదు. అయోధ్యలో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగని ఇక్కడి పర్యావరణాన్ని పరిరక్షించకుండా ఉండిపోవద్దు. ఆ సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను సైకిల్ యాత్ర చేపట్టా."
-ఓమేశ్ భగత్, పర్యావరణ ప్రేమికుడు

ఇదే తరహాలో ఛత్తీస్​గఢ్ ఖార్సియాకు చెందిన 36 ఏళ్ల రైతు పాదరక్షలు ధరించకుండానే 700 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నాడు. రెండు నెలల పాటు నడక సాగించి తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు.

ఉత్తరాఖండ్​కు చెందిన జస్విందర్ సింగ్, అతడి కుమారుడు సైక్లింగ్ చేస్తూ అయోధ్యకు బయల్దేరారు. 'సిక్కులు అయినప్పటికీ మేం రాముడిని నమ్ముతాం. మత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకే ఈ యాత్ర చేపట్టాం' అని చెబుతున్నారు. జనవరి 20న వీరు అయోధ్యకు చేరుకోనున్నారు.

పంజాబ్​లోని బాటాలాకు చెందిన మరో సిక్కు నితిన్ భాటియా సైతం రఘుపతి నిలయానికి సైకిల్ యాత్ర చేపట్టాడు. ఇందుకోసం 1,100 కిలోమీటర్లు ప్రయాణం చేపట్టనున్నాడు. నితిన్ సైతం జనవరి 20న అయోధ్యలో కాలుపెట్టనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.