ETV Bharat / bharat

'ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​కు పరాజయమే'.. పీకే జోస్యం​!

author img

By

Published : May 20, 2022, 3:28 PM IST

Prashant Kishor Congress: ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడిపోతుందని జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​. ఇటీవల నిర్వహించిన చింతన్​ శిబిర్​తో కాంగ్రెస్​కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

Prashant Kishor on Congress' Chintan Shivir
Prashant Kishor on Congress' Chintan Shivir

Prashant Kishor Congress: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ మరోసారి కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో భాజపా పాలిత రాష్ట్రాలు హిమాచల్​ ప్రదేశ్​, గుజరాత్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. ఇటీవల నిర్వహించిన చింతన్​ శిబిర్​తోనే కాంగ్రెస్​కు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు పీకే.

''ఉదయ్‌పుర్‌ చింతన్‌ శిబిర్‌ గురించి మాట్లాడాలని నన్ను పదే పదే అడుగుతున్నారు. నా అభిప్రాయంలో.. దీంతో(చింతన్ శిబిర్​తో) పార్టీకి వచ్చిందేమీ లేదు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్‌ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరికొంత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైంది.'' అని ట్వీట్​ చేశారు ప్రశాంత్​ కిశోర్​.

Prashant Kishor on Congress Chintan Shivir
ప్రశాంత్​ కిశోర్​ ట్వీట్​

వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఇటీవల మూడు రోజుల 'చింతన్‌ శిబిర్‌' నిర్వహించింది కాంగ్రెస్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్‌కు పునర్​వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహించింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు సీనియర్‌ నేతలు ఈ శిబిరంలో ప్రసంగించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్‌ నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించేలా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు.

ఈ శిబిరానికి కొద్ది వారాల ముందే కాంగ్రెస్‌, ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. పీకేను.. కాంగ్రెస్​ అధిష్ఠానం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్​ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్​కు 'నాయకత్వం' అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ చింతన్‌ శివిర్‌పై పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల సంకేతాలిచ్చిన ప్రశాంత్​ కిశోర్ మే 5న కీలక​ ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పెట్టట్లేదని స్పష్టం చేశారు. రాబోయే 3-4 నెలల్లో.. రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు వివరించారు పీకే. బిహార్​లో మంచి పరిపాలన(జన్​ సురాజ్​) కోసం.. వారి నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు.

2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భాజపా అధికారంలోకి రావడంలో ప్రశాంత్​ కిశోర్​ కీలక పాత్ర పోషించారు. 2017 ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్​తో కలిసి పనిచేశారు. బిహార్​, ఆంధ్రప్రదేశ్​, బంగాల్​లోనూ ఆయా పార్టీలు అధికారంలోకి రావడంలో కృషిచేశారు పీకే.

ఇవీ చూడండి: 'షార్ట్​కట్​లు లేవు.. పోరాడదాం.. తుదిశ్వాస వరకు మీతో ఉంటా!'

కాంగ్రెస్​ 'సమైక్య యాత్ర'.. కన్యాకుమారి టూ కశ్మీర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.